రైతుల గోడు కేంద్రం వినాలి: దేవేగౌడ - devegowda distressed about confrontation with farmers
close
Published : 26/11/2020 23:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతుల గోడు కేంద్రం వినాలి: దేవేగౌడ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులను గౌరవించి, వారి గోడును వినాలని భారత మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవేగౌడ సూచించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన ‘దిల్లీ చలో’ర్యాలీ ఉద్రిక్తంగా మారడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవేగౌడ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘దిల్లీ సమీపంలో రైతులతో పోలీసుల ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు చూసి నేను చాలా బాధపడ్డాను. రైతులను ప్రభుత్వం గౌరవంగా చూసుకోవాలి. వారితో మమేకమై.. వారి సమస్యల్ని వినాలి. పోలీసు బలగాలతో వారి సమస్యల్ని పరిష్కరించలేం’ అని పేర్కొన్నారు. 

రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇప్పటికే పలువురు నాయకులు మండిపడ్డారు. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ స్పందిస్తూ.. రాజ్యాంగ దినోత్సవం రోజునే రైతుల హక్కుల్ని కాలరాయడం బాధాకరమన్నారు. శాంతియుతంగా వెళ్తున్న రైతుల్ని వెనక్కి నెట్టకండి అంటూ హరియాణా సీఎం ఖట్టర్‌కు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం రైతులతో ఘర్షణ వాతావరణం సృష్టించవద్దని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్రానికి సూచించారు. 

కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గురువారం ‘దిల్లీ ఛలో’ర్యాలీని తలపెట్టిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో రైతులకు దిల్లీ వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీకి నిరాకరించారు. అయినప్పటికీ రైతులు ర్యాలీ ప్రారంభించారు. దిల్లీ దిశగా కదం తొక్కిన రైతుల్ని హరియాణా సరిహద్దులో సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. పాటియాలా, అంబాలా హైవేపై నిలువరించాయి. దీంతో ఆగ్రహించిన రైతులు బారికేడ్లను ఎత్తి నదిలో పారవేశారు. వెంటనే పోలీసులు వారిని నియంత్రించేందుకు జలఫిరంగులు, భాష్పవాయువును ప్రయోగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ సరిహద్దులను మూసేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని