ధోనీ × ధోనీ - dhoni vs dhoni
close
Published : 03/04/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీ × ధోనీ

2005 మహీతో 2021 మహీ ముఖాముఖి

ఒకరేమో అప్పుడే టీమ్‌ఇండియాకు వచ్చిన ఆటగాడు. అరె.. బాగా ఆడుతున్నాడే అంటూ ప్రశంసలు. అంతా కొత్త.. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు.. సీనియర్లతో మాట్లాడాలంటే బెరుకు. ఇంకొకరేమో టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్పులు అందించిన దిగ్గజం. ఐపీఎల్‌లో మూడుసార్లు చెన్నైని విజేతగా నిలిపిన ధీరుడు. గొప్ప మ్యాచ్‌ ఫినిషర్‌. మరి ఆ క్రికెట్‌ దిగ్గజం అప్పుడే వచ్చిన కుర్రాడిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే ఆ ఇద్దరూ ఒకే వ్యక్తి అయితే ఎంత మజా ఉంటుంది?

2005 మహీ× 2021 మహీ

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో ఒక సరదా వీడియో రూపొందించింది ‘గల్ఫ్‌ ఆయిల్‌’. విచిత్రం ఏంటంటే ఇందులో ప్రశ్నలు అడిగేవారు.. సమాధానాలు చెప్పేవారు ఒక్కరే. అంటే 2005 ఎంఎస్‌ ధోనీని 2021 ఎంఎస్‌ ధోనీ ఇంటర్వ్యూ చేశాడన్నమాట. నాలుగు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో మహీ అటు జూనియర్‌గా.. ఇటు సీనియర్‌గా అద్భుతమైన హావభావాలు పలికించాడు! (నటించడం కష్టమనేవాడు మొదట్లో!).

ఏడాదిలోనే..

2021 మహీ పూర్తి ఆత్మవిశ్వాసంతో కుర్చీలో కూర్చొన్నాడు. 2005 మహీ మాత్రం కాస్త బెరుకుగా కుర్చీలో ముందుకు జరిగి కూర్చోవడం గమనార్హం. అతడికి మైక్‌ పెట్టిన సహాయకురాలికి ధన్యవాదాలు చెబుతూ కనిపించాడు. ‘అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ దక్కించుకున్నావు. అభినందనలు’ అని 2021 ధోనీ అనడంతో 2005 మహీ ధన్యవాదాలు సర్‌ అని బదులిచ్చాడు. ‘అంతేకాదు.. శ్రీలంకపై 183 పరుగులు.. అదీ 50 ఓవర్లు కీపింగ్‌ చేసి 46 ఓవర్లు బ్యాటింగ్‌ చేయడం తేలికేం కాదు’ అని సీనియర్‌ అంటే.. ‘సర్‌.. మీకు తెలియంది కాదు. వికెట్‌ ఫ్లాట్‌గా ఉంది. వేర్వేరు పరిస్థితులు, పిచ్‌లపై నిలకడగా ఆడుతుంటే ఇవన్నీ సాధ్యమే’ అని జూనియర్ హుందాగా‌ బదులిచ్చాడు.

నీ వల్లే 2011 ఫైనల్‌..

‘సర్‌.. మీరెన్నో వన్డేలు, టెస్టులు ఆడారు. మీకిష్టమైన ఇన్నింగ్స్‌ ఏంటి’ అని జూనియర్‌ మహీ ప్రశ్నించగా ‘ప్రపంచకప్‌ ఫైనల్‌. ఆ మ్యాచ్‌ను ముగించడం ఎంతో మజానిచ్చింది’ అని సీనియర్‌ బదులివ్వగా ‘సర్‌.. ప్రపంచకప్‌ ఫైనల్‌ ఏంటి?’ అని 2005 మహీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘2011 వాంఖడే, ప్రపంచకప్‌ ఫైనల్‌’ అని సీనియర్‌ చెప్పగా ‘2011 ఫైనల్‌, అంటే మనం ప్రపంచకప్‌ గెలిచామా?’ అని జూనియర్ ఆనందంతో‌ ఆశ్చర్యపోయాడు. ‘నీ కష్టం వల్లే ఆ ఇన్నింగ్స్‌ సాధ్యమైంది. నువ్వు ఇంకొక త్యాగం చేయాలి. బటర్‌ చికెన్‌, శీతల పానీయాలు, మిల్క్‌ షేక్‌లంటే ఇష్టం కదా. మెల్లగా వాటినీ వదిలేయాలి’ అని 2021 మహీ చెప్పాడు. ‘సర్‌.. నిలకడగా బాగా ఆడుతున్నా అన్ని ఇష్టాల్నీ త్యాగం చేయాలా’ అని జూనియర్‌ ప్రశ్నిస్తే ‘అవసరం లేదు.. బైకింగ్‌ను మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు’ అని సీనియర్‌ ముగించాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని