ఆ సమయంలోనే పవన్‌ అదిరిపోయే ఎంట్రీ! - dil raju interview
close
Published : 07/04/2021 23:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సమయంలోనే పవన్‌ అదిరిపోయే ఎంట్రీ!

నిర్మాత దిల్‌ రాజు

‘పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేయాలనే కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు నిర్మాత దిల్‌ రాజు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘వకీల్‌ సాబ్‌ ’ చిత్రాన్ని నిర్మించారాయన. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా విలేకర్లతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

పవన్‌ కల్యాణ్‌తో ప్రయాణం ఎలా సాగింది?

అద్భుతమైన ప్రయాణం మాది. అది ఈ ఒక్క చిత్రంతోనే ఆగిపోదు. కొనసాగుతూనే ఉంటుంది. షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్ను రోజూ కలుస్తూనే ఉన్నాను. ఆయనతో సినిమా చేయాలనే నా కల ఇన్నేళ్లకు నెరవేరింది. సినిమా చూసి ప్రేక్షకులు బాగుందని మెచ్చుకున్నప్పుడే‌ అసలైన ఆనందం. త్వరగా ఈ సినిమాని పూర్తి చేద్దామనుకున్నాం. కరోనా వల్ల ఆలస్యమైంది. అయినా అదే ఉత్సాహంతో వస్తున్నాం.

ముందస్తు విడుదల వేడుకలో పవన్‌ మీ గురించి చెప్పినపుడు ఏమనిపించింది?

సినిమాలపై నాకున్న ప్యాషన్‌ గురించి వేరే వాళ్లు చెప్తే వినడం వేరు, నేరుగా చూడటం వేరు. ‘వకీల్‌ సాబ్‌’ చిత్ర నిర్మాణం సమయంలో ఆయన నన్ను దగ్గరగా చూశారు. అందుకే అలా చెప్పారు. ఆయన నటించిన  ‘తొలి ప్రేమ’ చూసి నేను నిర్మాతనైతే పవన్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలనుకునేవాణ్ని. అది ఇప్పటికి నెరవేరింది.

దర్శకుడిగా శ్రీరామ్‌ వేణునే తీసుకోవడానికి కారణం?

ఈ కథ కోసం ముందుగా ఇద్దరు ముగ్గురు దర్శకుల్ని అనుకున్నాం. కానీ కుదరలేదు. గతంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘ఐకాన్‌’ అనే ప్రాజెక్టును ప్రకటించాడు వేణు. కరోనా వల్ల, పైగా అర్జున్‌ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల  ‘ఐకాన్‌’ ఆలస్యమవుతుందని భావించాం. అందుకే వేణుకి ఈ అవకాశం ఇచ్చాం. ఈ సినిమా ‘పింక్‌’ రీమేక్‌ అని అతనికి చెప్పడమే ఆలస్యం.. మన నేటివిటీకి, పవన్‌ క్రేజ్‌కి తగ్గట్టు సన్నివేశాలు రాసేశాడు.

‘పింక్‌’(హిందీ), ‘నేర్కొండ పార్వై’ (తమిళ్‌)లో కమర్షియల్‌ హంగులు లేవు కదా?

పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌కి తగట్టు ఉండటం కోసమే కొన్ని మార్పులు చేశాం తప్ప కథని ఏమాత్రం మార్చలేదు. కథని ఉన్నది ఉన్నట్టు చెప్తూ, స్టార్‌ హీరో క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలు జత చేయడం కత్తిమీద సాములాంటిది. దాన్ని సుసాధ్యం చేశాడు దర్శకుడు వేణు. థియేటర్‌లో అభిమానులతో విజిల్‌ కొట్టించేందుకు ఎన్నో కసరత్తులు చేశాడు.

పాటల విషయంలో ఎలాంటి చర్చలు జరిగాయి?

ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ని హీరోగా అనుకున్నప్పుడే పాటలు, పోరాటాల గురించి ఆలోచించాం. కథలోంచే ఎలాంటి పాటలు ఇవ్వగలమో, ఎలాంటి యాక్షన్‌ సన్నివేశాలు చూపించగలమో చర్చించుకున్నాం. దానికి తగ్గట్టు రూపొందించాం.

నిర్మాతగా కాకుండా ప్రేక్షకుడిగా సినిమాపై మీ అభిప్రాయం?

‘పింక్‌’.. 50, ‘నేర్కొండ’.. 70 అయితే, ‘వకీల్‌ సాబ్‌’.. 100.. అదే  మీటరు‌. అజిత్‌ మాస్‌ హీరో కాబట్టి అక్కడ కొన్ని మార్పులు చేశారు. పవన్‌ కోసం ఇక్కడ మరికొన్ని మార్పులొచ్చాయి.

ఈ సినిమాలో హీరోగా పవన్‌నే ఎందుకు తీసుకున్నారు?

ఒక్కో హీరోకి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌ అంటేనే స్టైల్‌. పవన్‌ని పోలీసుగా, విద్యార్థిగా, ప్రేమికుడిగా చూశాం. ఇప్పటి వరకు ఆయన లాయరుగా కనిపించలేదు. ఈ కథని ఎవరైనా చేయొచ్చు. కానీ పవన్‌లాంటి వాళ్లు చేస్తే మజా వస్తుంది. అందుకే ఆయన్ను తీసుకున్నాం. అగ్ర కథానాయకుల డేట్స్‌ ఉన్నాయనో దర్శకుడు కథ చెప్పాడనో కాకుండా ఓ బలమైన అంశాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే నేను చిత్రాలు నిర్మిస్తుంటాను. 

సంగీత దర్శకుడు తమన్‌ గురించి ఏం చెప్తారు?

తమన్‌ ఈ చిత్రాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. మా అందరి కలల ప్రాజెక్టు కావడంతో మేము ఏదైనా ఓ ట్యూన్‌ను ఓకే చేసినా.. దానికి మించిన మరొక ట్యూన్‌ కోసం కష్టపడేవాడు. పాటలు, నేపథ్య సంగీతం అత్యద్భుతంగా అందించాడు.

* సినిమాలో ప్రత్యేక సర్‌ప్రైజ్‌ అంటూ ఏం లేదు. కథ చెప్పడం పూర్తవ్వగానే 15వ నిమిషంలో పవన్‌ ఎంట్రీ ఉంటుంది. దాన్ని చూసి ఎవ్వరూ సీట్లో కూర్చోరు. అంతలా అలరిస్తుందా సీన్‌.  కథకు అనుగుణంగానే దాన్ని తెరకెక్కించాం.

*  మా బ్యానర్‌లో రూపొందనున్న శంకర్‌ - రామ్‌ చరణ్‌ చిత్రం వచ్చే జులై లేదా ఆగస్టులో మొదలవుతుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చివరి దశలో ఉంది. ‘రౌడీ బాయ్స్‌’, ‘పాగల్‌’, ‘ఎఫ్‌ 3’ సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. బాలీవుడ్‌లో ‘జెర్సీ’, ‘హిట్‌’ రీమేకులు చేస్తున్నాం. ‘ఐకాన్‌’ ఎప్పుడు ప్రారంభమవుతుందో స్వయంగా అల్లు అర్జున్‌ ప్రకటిస్తారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని