మెగాస్టార్‌కు కథ చెప్పడానికి భయపడ్డా! - director buchibabu about uppena story
close
Published : 08/02/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాస్టార్‌కు కథ చెప్పడానికి భయపడ్డా!

వైష్ణవ్‌ నటనపై ఆసక్తి లేదన్నాడు

హైదరాబాద్‌: సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసి.. ‘ఉప్పెన’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు బుచ్చిబాబు. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా ఈ ప్రేమకథా చిత్రం తెరకెక్కింది. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా కృతిశెట్టి నటించారు. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉప్పెన’ ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఉప్పెన’ ఆరంభం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘సుకుమార్‌ సర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తరుణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఏదైనా ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశపడ్డా. అలా నాకు వచ్చిన ఆలోచనల్ని మొదట సుకుమార్‌కే చెప్పేవాడిని. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. ‘రంగస్థలం’ షూట్‌లో ఉన్నప్పుడు నాకీ ‘ఉప్పెన’ ఆలోచన వచ్చింది. వెంటనే సుకుమార్‌తో చెప్పాను. చాలా బాగుంది. స్టోరీ, స్ర్కీన్‌ప్లే పై పూర్తిగా పనిచెయ్‌ అని అన్నారు. ఆరు నెలలు సమయం తీసుకుని పూర్తి కథ సిద్ధం చేసి మళ్లీ సుకుమార్‌ని కలిసి మొత్తం వివరించాను. ఆయన వెంటనే నన్ను గట్టిగా కౌగిలించుకుని.. ‘సూపర్‌గా ఉంది. నువ్వు నా పెద్దకొడుకువిరా’ అని అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేని అపురూప జ్ఞాపకం.’’

‘‘ఉప్పెన’ కథ సిద్ధమైంది. హీరోగా ఎవరిని తీసుకోవాలి? అని అనుకుంటున్న సమయంలో నా స్నేహితుడు ఒకరు వైష్ణవ్‌ ఫొటో చూపించాడు. నా సినిమాలోని పాత్రకు సరిగ్గా సరిపోతాడు అనుకున్నా. మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి కొత్త దర్శకుడితో సినిమా చేస్తారా? అని భయపడ్డా. కానీ వైష్ణవ్‌ను కలిసి కథ చెప్పాక.. కొంచెం భయం తగ్గి, నమ్మకం వచ్చింది. మొదట వైష్ణవ్‌ని కలవగానే.. ‘నాకు నటనమీద ఆసక్తి లేదు సర్‌. ఆర్మీ వైపు ఆసక్తి ఉంది. అంతేకాకుండా నటనకు సంబంధించి ఏమీ నేర్చుకోలేదు.’ అని చెప్పాడు. నేను చెప్పిన కథ విని.. బాగుందని అన్నారు.’’

‘వైష్ణవ్‌ తేజ్‌కు కథ చెప్పిన రోజు.. రాత్రి సమయంలో సుకుమార్‌ సర్‌ నాకు ఫోన్‌ చేశారు. ‘వైష్ణవ్‌కు కథ నచ్చిందట. చిరంజీవి గారిని కలిసి ఒక్కసారి కథ చెప్పు’ అన్నారు. నాకెంతో భయం వేసింది. ఆయనకు కథ చెప్పడం కోసం వారం రోజులు సిద్ధమయ్యాను. కథ నెరేషన్‌ను రికార్డింగ్‌ చేసుకుని రోజూ వినేవాడిని. ఎంతో కంగారుతో వెళ్లి మెగాస్టార్‌ని కలిశాను. ‘టెన్షన్‌ పడకు.. కథ చెప్పు’ అన్నారు. అలా గంటపాటు ఆయనకు కథ వివరించాను. కథ చాలా బాగుంది అని అభినందించారు.’’ అని బుచ్చిబాబు తెలిపారు.

ఇదీ చదవండి

మీకేం తెలుసని నన్ను తిడుతున్నారు: అనసూయ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని