director krish: కొండపొలం షూటింగ్‌ ఓ సాహసయాత్ర - director krish interview on kondapolam
close
Updated : 04/10/2021 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

director krish: కొండపొలం షూటింగ్‌ ఓ సాహసయాత్ర

తొలిచిత్రం ‘గమ్యం’తోనే వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. మానవసంబంధాలు, వాస్తవజీవితంలో కనిపించే మనషుల కథలనే తెరపై ఆవిష్కరిస్తూ భావోద్వేగాలను పండించడంలో ఆయన దిట్ట. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణంవందే జగద్గురం’, ‘కంచె’ అలాంటి సినిమాలే. హృదయాలను మెలిపెట్టే భావోద్వేగాలు, మనసుకు హత్తుకునే కథనాలతో ప్రేక్షకుడి నాడిని పట్టుకున్న దర్శకుడాయన. ‘గౌతమపుత్ర శాతకర్ణ’, ‘ఎన్టీఆర్‌’ బయోపిక్ ఇలా తీసినవన్నీ భిన్నమైనవే. ఇప్పుడు అడవి నేపథ్యంలో ‘కొండపొలం’ తో మరోసారి విభిన్న కథాంశంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నెల 8న ఆ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ఓబులమ్మ పాత్ర నవలలో లేదు

పుస్తకం, సినిమా రెండు భిన్నమైన మాధ్యమాలు. ‘కొండపొలం’ సినిమాకు తగినట్లుగా మార్పులు చేశాం.  వర్షాభావం వల్ల లేదా నీళ్లు, మేత దొరకనప్పుడు గొర్రెల కాపర్లు వందల గొర్రెలతో కొండల మీదకు వెళ్తుంటారు. కర్నూల్‌ వైపు వెళ్తున్నప్పుడు చాలా సార్లు కొండల మీద గొర్రెలు కనిపించేవి. వాటినలా చూసినప్పుడు అందమైన ఛాయాచిత్రంలా అనిపించేది, అప్పుడు ఎలాంటి ఆలోచన లేదు. ‘కొండపొలం’ చదివినప్పుడు, సినిమా తీసినప్పుడు మాత్రం గొర్రెలను మేపడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. గోవాలో చిత్రీకరణ చేద్దామని అనుమతులు కూడా తీసుకున్నాం.  కానీ, ఈ కథలో గొర్రెలుంటాయని తెలిసి అధికారులు అంగీకరించలేదు. పులులు నిమిషాల్లో వాటిమీద దాడి చేస్తాయని అనుమతిని రద్దు చేశారు. ఆ తర్వాత వికారాబాద్‌ అడవుల్లో తీసేందుకు సిద్ధమయ్యాం. వాస్తవానికి ‘కొండపొలం’ నవలలో ఓబులమ్మ పాత్ర లేదు. ఇందులో మంచి ప్రేమకథ ఉంటే బాగుంటుందని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారితో చర్చించాను. ఓబులమ్మ పాత్ర, సంభాషణలు, సినిమాకు కావాల్సిన మార్పులు చేయడంలో ఆయనే సాయం చేశారు. 

మన చుట్టూ ఉన్నవారే స్ఫూర్తి

పుస్తకంలో చాలా సమస్యలున్నాయి. ఆత్మన్యూనతతో బాధపడే రవీంద్రనాథ్ అనే యువకుడి చుట్టూ అల్లుకున్న కథ ఇది. పల్లెటూరి నుంచి సిటీకొచ్చి, అందరిలాగే ఇంజనీరింగ్‌ చేస్తాడు. ఇంగ్లీష్‌ మాట్లాడటం రాదు. ఇలాంటి వ్యక్తులను రోజూ చూస్తాం. మనందరిలోనూ ఇలాంటి కథలుంటాయి. వ్యక్తిత్వ వికాసం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతాం, వందల కొద్ది వీడియోలు చూస్తాం. దాన్ని ఎక్కడో వెతుక్కోనక్కర్లేదు. మన చుట్టూ ఉన్నవాళ్లని చూసి నేర్చుకోవచ్చు. వాళ్లను స్పష్టంగా గమనిస్తే చాలు, అంతకు మించిన జీవిత పాఠాలు ఎక్కడా దొరకవు. ఇదే మా సినిమాలో చూపించాం. పుస్తకంలోని సారాంశాన్ని చెడగొట్టకుండా వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాను.

సుకుమార్‌  తీద్దామనుకున్నారు

కరోనా కాలంలో ఓసారి డైరెక్టర్స్‌ మీట్‌ జరిగింది. కొరటాల, రాజమౌళి, హరీశ్‌ శంకర్‌ ఇలా అందరూ పుస్తకాల గురించి చర్చించారు. ‘గమ్యం’ రోడ్‌ సినిమా, ‘వేదం’ అంథాలజీ, ‘కంచె’ ప్రపంచయుద్ధం ఇలా తీసినవన్నీ విభిన్నమైన నేపథ్యాలతో తెరకెక్కినవే.  ప్రతి సినిమా కొత్త అధ్యయనంలా తీయడం నాకు ఆసక్తిని కలిగిస్తుంది. అడవి నేపథ్యంలో సినిమా తీయాలనే ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది. డైరెక్టర్స్‌ మీట్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ, సుకుమార్‌ ఒకేసారి ‘కొండపొలం’ నవలను సూచించారు. అక్కడ ‘శప్తభూమి’ గురించి కూడా చర్చకొచ్చింది. ఇంటికెళ్లగానే ఆ రెండు నవలలు కనిపించాయి. ‘కొండపొలం’ చదివి ఆ పుస్తకం హక్కులు తీసుకున్నాను. ఓ రోజు సుకుమార్‌ ‘మీరు తీస్తున్నారా? లేదంటే నేను మా అసిస్టెంట్స్‌తో తీద్దామని అనుకున్నాను’ అని ఫోన్‌ చేసి అడిగారు. అప్పటికే రాజీవ్‌తో మాట్లాడి సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నాను. ‘శప్తభూమి’ నవల కూడా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ స్థాయి వెబ్‌సిరీస్‌గా తీయొచ్చు.

షూటింగ్‌ ఓ సాహస యాత్ర

వికారాబాద్‌ అడవుల్లో  90 మందిని బయోబబుల్‌లో ఉంచి సినిమా పూర్తి చేశాం. సెప్టెంబరు‌, ఆక్టోబరు మాసాల్లో 45 రోజులు షూటింగ్‌ జరిగింది. కొవిడ్‌ సమయంలో షూటింగ్‌ చేయడం ఒక రకమైన కష్టమైతే,  పూర్తిగా అడవులు, కొండల్లో షూట్  చేయడం మరొక ఇబ్బంది. వాటర్‌ క్యాన్స్‌, ఇతర సామాగ్రిని మేమే స్వయంగా మోసుకెళ్లాల్సి వచ్చింది. దాదాపు వేయి గొర్రెలను చూసుకోడానికి ముగ్గురికి బస ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు పొద్దున 6 గంటలకు కచ్చితంగా సెట్‌లో ఉండేవారు. ‘కొండపొలం’ చిత్రీకరణ మాకు  వనవాసం చేసినట్లు కాదు,  ఒకరకంగా సాహసయాత్ర చేసినట్లు అనిపించింది.

వైష్ణవ్‌తేజ్‌కి పవన్‌ కళ్లొచ్చాయి

తను పదోతరగతిలో ఉన్నప్పటి నుంచే వైష్ణవ్‌ను చూస్తున్నాను. ఆ మధ్య ఓ సారి కలిసినప్పుడు ‘ఉప్పెన’లోని ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాటను చూపించాడు. వైష్ణవ్‌ కళ్లు బాగా ఆకర్షించాయి. పవన్‌ కల్యాణ్‌కి ‘మీ కళ్లు వైష్ణవ్‌కి వచ్చాయి సర్‌’ అని చెప్పాను. ఆయన నవ్వి ‘అవి మా నాన్నగారి కళ్ల’న్నారు.  కొన్నాళ్లకు నాన్న, నిర్మాత రాజీవ్‌లతో ‘కొండపొలం’ సినిమా తీద్దామని చెప్పాను. ఇదే విషయం వైష్ణవ్‌కి ఫోన్‌ చేసి చెప్పాను. ఆయన మెగా కుటుంబం నుంచి వచ్చినట్లు ఉండడు. చాలా సాధారణంగా కనిపిస్తాడు.  ప్రతీది సునిశితంగా పరిశీలిస్తాడు. నేర్చుకోవాలనే తపనెక్కువ. సినిమాపట్ల నిబద్ధత అదే స్థాయిలో ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అందరికీ సీన్‌ పేపర్లు పంపించి, నాకు డైలాగ్స్‌ ఎలా కావాలో వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టేవాడిని. ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో ‘ నేను ఇలా అనుకుంటున్నాను సర్‌’ అని తన డైలాగ్స్‌తో మెసేజ్‌ వచ్చేది. పనిపట్ల అంత నిబద్ధతతో ఉంటాడు వైష్ణవ్‌. అందుకే ‘ఉప్పెన’, ‘కొండపొలం’ లాంటి వైవిధ్యమైన సినిమాలు ఎంచుకున్నాడు. కమర్షియల్‌గా ఉంటూనే, కొత్తపంథాలో వెళ్తున్నాడు. ముందుగా ఈ సినిమాని కొత్త అమ్మాయితో చేద్దాం అనిపించింది.  కెమరామెన్‌ జ్ఞానశేఖర్‌ గారు, రకుల్‌ అయితే బాగుంటుందని సూచించారు.  రకుల్‌కు ‘కొండపొలం’ కథ చెబుతుంటే నాకు ఓబులమ్మ పాత్రపై పూర్తి స్పష్టత వచ్చింది. అందమైన పిల్లలా కనిపించింది. వారిద్దరూ ఇందులో చేయడం మా అదృష్టం.

కీరవాణి మరోమెట్టు ఎక్కించారు

‘హరిహర వీరమల్లు’కు పనిచేసిన సాంకేతిక బృందమంతా ‘కొండపొలం’ సినిమాకి పనిచేశారు. ఈ బుక్‌ చదివిన తర్వాత కీరవాణి తనయుడు కాలభైరవను సంగీతమందిస్తావా? అని అడిగాను.  ఆ వెంటనే కీరవాణికి ఫోన్‌ చేసి ‘సర్‌ ఒక పుస్తకం పంపిస్తున్నాను. చదవండి’ అని కోరాను. రెండు రోజుల్లో చదివి కీరవాణి సినిమా చేద్దాం అన్నారు. అయితే మీకన్నా ముందు కాలభైరవను అడిగానని చెబితే, అయితే మీరే నిర్ణయించుకోండన్నారు. కాలభైరవతో మరో సినిమా తీయొచ్చు. ‘కొండపొలం’ కి సంగీతం అందివ్వాలంటే చాలా అనుభవం కావాలని మా సినిమాలో ఆయన్ను భాగం చేశాను. కొండపొలాన్ని కీరవాణి మరోస్థాయిలో నిలబెట్టారనడంలో సందేహం అక్కర్లేదు. కథ పరంగా అడవులు, కొండలు, పులులున్న పెద్దస్థాయి తీసిన సినిమా.  ఓటీటీ కోసం తీసింది మాత్రం కాదు. థియేటర్లో చూడాల్సిన సినిమా. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి భారీగా ఖర్చుపెట్టాం. ఈ దసరాకు రావాలనే ప్రణాళికలు వేసుకున్నాం. అనుకున్నట్టుగానే ఈ పండగకు కొండపొలాన్ని తీసుకొస్తున్నాం. 

పవన్‌తో మళ్లీ నవంబర్‌లో 

కరోనా లాక్‌డౌన్‌ సమయానికి ‘హరిహర వీరమల్లు’  25 శాతం పూర్తయింది.  మార్చిలో సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. జూన్‌, జులైల్లో ఇంట్లోనే కూర్చున్నాం. అప్పటికీ పరిశ్రమలో ఏం జరగట్లేదు. సినిమా టీంలో చాలా మందికి నెలవారీ ఖర్చులు కూడా లేవు. మా టీమ్‌, చిత్రపరిశ్రమ కోసం ఏదైనా చేయాలని అనిపించింది. ‘శప్తభూమి’, ‘కొండపొలం’ సినిమా పుస్తకాలను పవన్‌ కల్యాణ్‌కి ఇచ్చాను.  ‘వకీల్‌సాబ్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ‘కొండపొలం’ గురించి చెప్పాను. ‘మీరు, ఏమ్‌ రత్నంగారు ఒప్పుకుంటే సినిమా తీస్తాన’ని అడగిన వెంటనే పవన్‌ ఒప్పుకొన్నారు. ప్రస్తుతానికి ‘హరిహర వీరమల్లు’  50 శాతం పూర్తయింది. మళ్లీ నవంబర్‌ రెండోవారం నుంచి చిత్రీకరణ ప్రారంభమౌతుంది. 

చాలా పుస్తకాల హక్కులు కొన్నాం

తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు వచ్చాయి. వెంకటేశ్‌తో ‘అతడు అడవిని జయించాడు’ని సినిమాగా తీయాలని భరణిగారు, నేను చాలా ప్రయత్నాలు చేశాం. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కేశవరెడ్డి రాసిన గొప్ప నవల అది. ఫిల్మ్‌ మేకింగ్‌లో రచనే నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తుంది.  తెలంగాణ సాహిత్యం కూడా చదివాను. పెద్దింటి ఆశోక్‌ కుమార్‌ నవలలతో నాకు బాగా దగ్గరయ్యారు. సన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి గారిని మరో కథ రాయమని అడిగాను. మా దగ్గర చాలా నవలల హక్కులున్నాయి. హాట్‌స్టార్‌ కోసం మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ 9 గంటలు’ నవలను సినిమాగా నిర్మిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో రచయితలున్నారు. సాహిత్యం నుంచి సినిమాలకు రచయితలు రావడం ఆనందించదగ్గ పరిణామం. 
 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని