సారంగదరియా ఇష్యూ: శేఖర్‌ కమ్ముల స్పందన - director sekhar kammula responds on saranga dariya​​ issuse
close
Published : 10/03/2021 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సారంగదరియా ఇష్యూ: శేఖర్‌ కమ్ముల స్పందన

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘సారంగదరియా’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. కొద్ది గంటల్లోనే ఈ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. పవన్‌ అందించిన స్వరాలకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా.. మంగ్లి పాడారు. ఈ జానపద గీతాన్ని ఓ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదంటూ కోమలి అనే జానపద గాయని ఆరోపించారు. దీంతో ఈ పాటపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రచయిత సుద్దాల అశోక్‌ తేజ వివిధ వేదికలపై స్పందించారు. తాజాగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల సైతం ఈ పాటపై నెలకొన్న వివాదంపై వివరణ ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘చాలా ఏళ్ల కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రామ్‌లో శిరీషా అనే యువతి ‘సారంగ దరియా’ పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండిపోయింది. ఆ పాట నాకు ఎంతో నచ్చింది. ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా ఈ పాట నా మదిలో తిరుగుతూనే ఉంది. నా మొదటి చిత్రం ‘డాలర్‌ డ్రీమ్‌’లో లక్కీ అలీ పాట ఉంటుంది. ఆ పాటని సినిమాలో వాడినందుకు సోనీ కంపెనీకి కొంత మొత్తం చెల్లించా. వారికి క్రెడిట్‌ కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’లో లక్కీ అలీతో పాడించుకున్నా. ‘ఆనంద్’లో సుబ్బలక్ష్మిగారి పాట నుంచి ‘ఫిదా’లో అప్పగింతల పాట వరకూ స్టోరీ రాస్తున్నప్పుడు నాకు ఒక్కో సినిమాకి ఒక్కో పాట మదిలో మెదులుతూ ఉంటుంది. ‘లవ్‌స్టోరీ’కి కూడా నా మనసులో ఈ పాట ఉంది. అందుకే సుద్దాల గారిని కలిశా. ఈ పాటని సినిమాకు అనుకూలంగా రాయాలంటే.. ఈ పాట పల్లవి తీసుకొని, చరణాలు రాశారు. ఆ సాహిత్యం చూసి చాలా ఆనందించా.’’

‘‘నా టీమ్‌లోని సహాయ దర్శకుడు ఒకరు శిరీష ఫోన్‌ నంబర్‌ సంపాదించి ఆమెతో మాట్లాడారు. ఆమె అప్పటికి గర్భిణి కావడం.. డెలివరీ టైమ్‌ దగ్గర పడటంతో ఆ చర్చలు అక్కడితో ఆపేశాం. కరోనా వల్ల సినిమా షూటింగ్‌ కూడా ఆగిపోయింది. తిరిగి షూటింగ్‌ మొదలైన తర్వాత చంటి బిడ్డతో ఉన్న శిరీషను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఈ పాటను నవంబర్‌లో షూట్‌ చేశాం. అది కూడా ట్రాక్‌ సింగర్‌ పాడిన వెర్షన్‌తోనే! ఫిబ్రవరి చివరిలో మంగ్లితో పాడించాం. ప్రోమో విడుదలయ్యాక సుద్దాల గారు ఫోన్‌ చేసి, ‘ఆ ఇద్దరు సింగర్స్‌ ఆ పాట మేమే పాడాలి’ అంటున్నారని తెలిపారు. వారి నంబర్లు కూడా ఇచ్చారు. మా టీమ్‌ వారితో మాట్లాడింది. నేను వెంటనే సుద్దాలగారి ఇంటికి వెళ్లాను’’

‘‘ఈ లోగా ఆయన వివరాలు సేకరించి, ‘ఆ ఇద్దరిలో కోమలి ఆ పాటని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమెతో పాడిద్దాం’ అని అన్నారు. నా ముందే ఆమెకు ఫోన్ చేశారు. ‘పాట రిలీజ్ చేస్తామని ప్రకటించాం కాబట్టి, కోమలిని వెంటనే రమ్మని కోరాను. వరంగల్ నుంచి రావడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పా. సంగీత దర్శకుడిని చెన్నై నుంచి హైదరాబాద్‌కు రమ్మన్నాం. ‘జలుబుగా ఉంది, రాలేను’ అని కోమలి చెప్పారు. మరోవైపు పాట విడుదల చేస్తామని ప్రకటించడంతో కాస్త ఇబ్బంది పడ్డాం. తన పేరు కూడా వేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని కోమలి చెప్పారు. ‘క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అని సుద్దాల గారు సూచించారు. ఇదే విషయాన్ని కోమలిని అడిగితే ‘మీ ఇష్టం సర్‌.. ఎంత ఇస్తే అంత ఇవ్వండి’ అని ఆమె అన్నారు. ఆడియో ఫంక్షన్‌లో పాడమని ఆమెను అడిగాను. అందుకు కోమలి కూడా ఒప్పుకొన్నారు. పాట విడుదల చేసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పా. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలికి మేం తప్పకుండా క్రెడిట్‌ ఇస్తాం.. తగిన మొత్తం కూడా ఇస్తాం. ఆడియో విడుదల వేడుకకు తప్పక ఆహ్వానిస్తాం’’ అని శేఖర్‌ కమ్ముల అభిమానులతో పంచుకున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని