సినిమాలు వదిలేసి సేద్యం చేద్దామనుకున్నా! - director sudha kongara special interview
close
Published : 09/11/2020 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమాలు వదిలేసి సేద్యం చేద్దామనుకున్నా!

పెళ్లై... పిల్లలు పుట్టిన తరువాత కెరీర్‌లో నిలదొక్కుకోవడం కష్టమేమో అనుకుంటారు చాలామంది. అది నిజం కాదని నిరూపించారు సుధా కొంగర... మొదటి సినిమా నిరాశనే మిగిల్చినా.. గెలుపు కోసం ఆరేళ్లు ఎదురుచూసి ‘గురు’తో విజేతగా నిలిచారు.. ఇప్పుడు ‘ఆకాశమే నీ హద్దురా’ అంటున్నసుధ జీవితంలో ఆసక్తికరమైన విషయాలెన్నో ఉన్నాయి...  
15 రోజుల్లో 60 పుస్తకాలు  
నేను పుట్టింది కృష్ణాజిల్లాలోని అంగలూరు. పెరిగింది చెన్నై. అమ్మానాన్నలిద్దరూ పుస్తకప్రియులే. ఆ అలవాటే నాకూ వచ్చింది. వేసవి సెలవులకు మా ఊరు వెళ్లినప్పుడు రెండు నెలలకు పైగా ఉండేవాళ్లం. అక్కడ లైబ్రరీలో రెండు నెలలకు సరిపడా 60 పుస్తకాలు చదవడానికి వీలుగా అమ్మ ముందుగానే డబ్బులు కట్టేసేది. వాటిని నేను పదిహేను రోజుల్లోనే పూర్తి చేసేదాన్ని. ఆ తరువాతేం చేయాలో తెలియక ఆ లైబ్రరీలో ఉన్న ఇంగ్లిష్‌ పుస్తకాలన్నీ చదివేసేదాన్ని.
దీపావళికి ఆ పనే చేసేదాన్ని
సినిమా అంటే చిన్నప్పట్నుంచీ పిచ్చే నాకు. అడయార్‌లో ఉన్నప్పుడు ఈరోస్‌ థియేటర్‌లో వచ్చే ప్రతి సినిమాను చూసేయాల్సిందే. నా ఎనిమిదో తరగతిలోనే వీకెండ్స్‌లో స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లేదాన్ని. నా పాకెట్‌మనీ అంతా సినిమాలు, క్యాసెట్లు, సినిమా మ్యాగజైన్లకే ఖర్చుపెట్టేదాన్ని. దీపావళికి అందరూ టపాకాయలు కాలుస్తుంటే నేను మాత్రం ఆ చప్పుళ్లు వినబడకుండా గది తలుపులు మూసేసుకుని దూరదర్శన్‌లో ప్రసారమయ్యే సినిమావాళ్ల ఇంటర్వ్యూలు చూసేదాన్ని. చదువు, సినిమా ఈ రెండే తెలుసు నాకు.
ఆ కోరిక తీరలేదు
స్కూల్‌ స్థాయి నుంచే మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టం. పన్నెండేళ్లున్నప్పుడు ఆయన తీసిన ‘మౌనరాగం’ ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. ఫొటోగ్రఫీ, డైలాగులు, సీన్ల కోసం మళ్లీమళ్లీ చూసేదాన్ని. అప్పట్లో నాకు సినిమాటోగ్రఫీలో అడుగుపెట్టాలని ఉండేది. కానీ చాలామంది తల్లిదండ్రుల్లానే మా ఇంట్లో కూడా ఆలోచించారు. నాన్నకు నన్ను కలెక్టరుగా చూడాలని ఉండేది. దాంతో ఆయన కల నెరవేర్చడానికి ఇంటర్‌ తరువాత విమెన్‌ క్రిస్టియన్‌ కాలేజీలో.. బీఏలో చేరా. డిగ్రీ చదువుతూనే పుణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరడానికి రెండు సార్లు ప్రవేశపరీక్ష రాశా. అయితే సైన్స్‌ చదివి ఉండాలనేది అక్కడి నియమం. అలా సినిమాటోగ్రఫీలో చేరే అవకాశాన్ని దక్కించుకోలేకపోయా.

పెళ్లయిన తరువాతే సాధించా...
డిగ్రీ అయిన వెంటనే పెళ్లి. ఇద్దరు పిల్లలు. అప్పుడు కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చేశా. మద్రాసు విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా ఉన్న రోజులవి. మణిరత్నంతో పనిచేస్తున్న నా స్నేహితురాలు ఒకరు.. ‘రేవతి దర్శకత్వం వహించిన ‘మిత్ర్‌, మై ఫ్రెండ్‌’ సినిమాకి ఇంగ్లిష్‌ వచ్చినవారి కోసం వెతుకుతున్నారు నీకు ఆసక్తి ఉందా?’ అని అడిగింది. ఉద్యోగం చేస్తూనే రేవతి వద్ద స్క్రిప్ట్‌ రాయడానికి చేరిపోయా. వారం రోజులకే ఆమెకు బాగా దగ్గరయ్యా. ఆమె దగ్గర ఫుల్‌ టైం చేయడానికి వీలుగా... నేను చెప్పాల్సిన తరగతులన్నీ ఒకేరోజు వచ్చేలా ఏర్పాటు చేసుకుని మిగతా రోజులన్నీ ఆమె వద్ద పనిచేసేదాన్ని. అలా నా అసలైన కెరీర్‌ పెళ్లి తరువాతే మొదలైంది. నా భర్త, అత్తింటివారి సహకారమే ఇందుకు కారణం.
నాకు నచ్చలేదని చెప్పేశా
పనిచేస్తే మణిరత్నంలాంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేయాలని ఉండేది. ఓ ఫ్రెండ్‌ చెప్పడంతో ఆయన నన్ను పిలిపించారు. ‘అసిస్టెంట్‌గా ఎందుకు, సొంతంగా నువ్వే సినిమా చేయొచ్చు కదా!’ అన్నారు. ‘లేదు మీతో కలిసి పనిచేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఉందని చెప్పా. అప్పట్లో ఆయన చేసిన ‘కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్‌’ సినిమా విడుదలైంది. కానీ నాకు నచ్చలేదు. అదే విషయం ఆయనతో చెప్పా. అందుకు గల కారణాలని విశ్లేషించి చెప్పా. అలా చెప్పాను కాబట్టే ఆయనతో కలిసి ఆరున్నరేళ్లపాటు కలిసి పనిచేసే అవకాశం దక్కింది.

సినిమాలు వదిలేద్దామనుకున్నా
నేను చేసిన మొదటి సినిమా ‘ద్రోహి  ’ అపజయం పాలైంది. ఆ తరువాత ఆరేళ్లు విరామం వచ్చింది. నన్ను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. సినిమా రంగాన్ని వదిలేసి, ఏదైనా రెస్టారెంటు పెట్టాలనుకున్నా లేదా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నా. ఆ లోపు మాధవన్‌ను కలిసినప్పుడు ఓ కథకు సంబంధించి లైన్‌ చెప్పా. అది తనకు నచ్చింది. ఆ కథే తెరపైకి తమిళంలో ‘ఇరుదు సుట్రు’గా వచ్చి బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. తెలుగులో కూడా నేనే దర్శకత్వం వహించా. అదే ‘గురు’ సినిమా.
గెలిచిన వారి మాటే వింటారని
నా మొదటి సినిమా అపజయం పాలైన సమయంలోనే.... డెక్కన్‌ ఎయిర్‌వేస్‌ అధినేత, కెప్టెన్‌ గోపీనాథ్‌గారి ఇంటర్వ్యూ ఓ టీవీలో చూశా. ఆయన గురించి తెలుసుకుని ఎంతో ప్రభావితమయ్యా. ఆయన ఆటోబయోగ్రఫీ విడుదలవుతుందని తెలిసి, దాని కోసం ఎదురుచూసి, గోపీనాథ్‌ గురించి పూర్తిగా తెలుసుకున్నా. అలా పదేళ్ల క్రితమే ‘ఆకాశమే నీ హద్దురా’కు లైన్‌ సిద్ధం చేసుకున్నా. కానీ గురు సినిమా హిట్‌ అయిన తరువాత ఒక విజేతగానే ఆయనను కలిసి సినిమా తీయడానికి అనుమతిని తీసుకున్నా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని