వ్యాక్సినేషన్‌ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు - don’t do mistakes after vaccination
close
Published : 10/06/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సినేషన్‌ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారితో పోరాటంలో విజయం సాధించాలంటే మన దగ్గరున్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్‌. అయితే ఈ వ్యాక్సిన్‌ గురించి చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వ్యాక్సిన్‌ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఏం చేయాలి? అసలు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? ఇలా.. ఎన్నో సందేహాలు సామాన్యుల మెదళ్లను తొలిచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

కరోనా మహమ్మారి నుంచి తప్పించుకుని జనజీవనం సాధారణ స్థితికి చేరాలంటే అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందే. అయితే టీకా తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత వైరస్‌ లక్షణాలు కనిపించినా లేదా కరోనా సోకిన వాళ్లను కలిసినా వ్యాక్సిన్‌ తీసుకోవడం వాయిదా వేసుకోవడం మంచిది. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా, మందులు వాడుతున్నా వ్యాక్సిన్‌ తీసుకునేముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే హెమోఫీలియా వంటి రక్తస్రావం అయ్యే వ్యాధులు ఉన్నవాళ్లు తమ వైద్యుల సమక్షంలో టీకా తీసుకోవడం మంచిది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఒక అరగంటసేపు వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఉండాలి. దీని వల్ల మనపై అక్కడి వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. ఏవైనా సమస్యలు తలెత్తితే వైద్యులు వెంటనే స్పందిస్తారు. 

వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, వ్యాక్సిన్‌ వేసిన చోట దద్దుర్లు, నొప్పి, దురద వంటి కొన్ని లక్షణాలు ఉండవచ్చు. అయితే ఏ వ్యాధికి వ్యాక్సిన్‌ తీసుకున్నా ఇలాంటి లక్షణాలు కనిపించడం సహజమే. వ్యాక్సిన్‌ వల్ల కలిగిన దుష్ఫలితాలు ఎక్కువకాలం ఉంటే వెంటనే వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని లేదా దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. అంతేగానీ సొంత ప్రయోగాలు చేయకూడదు. వారం, పదిరోజుల పాటు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం మేలు. వీటి వల్ల వ్యాక్సిన్‌ ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే షెడ్యూల్‌ ప్రకారమే వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోవాలి. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టు. కాబట్టి తొలి డోసు తీసుకున్న తర్వాత నిబంధనలు కఠినంగా పాటించాలి. పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలను తప్పని సరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత చిన్న లక్షణమైనా సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌లను తెలుసుకోవడంలో సహాయం చేసినట్లే. దీని ద్వారా భవిష్యత్‌లో వ్యాక్సిన్‌ అభివృద్ధికి దోహదం చేసినట్టవుతుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని