మహారాష్ట్రను కలవరపెడుతోన్న ‘డబుల్‌ మ్యుటేషన్‌’! - double mutation found in 61percent of 361 covid 19 samples
close
Published : 14/04/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రను కలవరపెడుతోన్న ‘డబుల్‌ మ్యుటేషన్‌’!

361 నమూనాల్లో 61శాతం ఈ రకానివే..

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణకు మహారాష్ట్ర విలవిలలాడుతోంది. నిత్యం కొత్తగా అక్కడ 60వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ వైరస్‌ ఉద్ధృతికి ‘డబుల్‌ మ్యుటేషన్‌’ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నమూనాలను విశ్లేషించగా వాటిలో 61శాతం శాంపిళ్లలో డబుల్‌ మ్యుటేషన్‌ బయటపడినట్లు వైరాలజీ నిపుణులు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతికి ఈ డబుల్‌ మ్యుటేషన్‌ కారణమని చెప్పలేమన్నారు.

దేశంలో కరోనా వైరస్‌ ప్రవర్తనను అంచనా వేసేందుకు పాజిటివ్‌ వచ్చిన రోగుల నమూనాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో జనవరి-మార్చి మధ్య కాలంలో 361 కరోనా శాంపిళ్లను పుణెలోని జాతీయ వైరాలజీ కేంద్రంలో విశ్లేషించారు. వాటిలో 61శాతం కేసుల్లో డబుల్‌ మ్యుటేషన్లు బయటపడినట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మహారాష్ట్రలో నిత్యం 2లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారని.. వాటిలో చిన్న మొత్తంలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టామని నిపుణులు వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతికి డబుల్‌ మ్యుటేషన్‌ కారమణమని ఈ ఫలితాల ద్వారా పేర్కొనలేమని వైరాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించిన నమూనాల ఫలితాలను ల్యాబొరేటరీలు వెల్లడించడం లేదని బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైరస్‌ పరివర్తనాలను తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందని బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేష్‌ కాకానీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ వైరస్‌ రకం ఎంత ప్రభావవంతమైనదో తెలిస్తే ప్రజలను కూడా అప్రమత్తం చేసే వీలుంటుందన్నారు.

శాంపిళ్ల సేకరణపై ఆందోళన..

డబుల్‌ మ్యుటేషన్‌ను గుర్తించేందుకు శాంపిల్‌ సేకరణ ఎంతో కీలకమని వైరాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్థానికంగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వైద్య సిబ్బంది అనుసరిస్తున్న విధానం కొంత ఆందోళన కలిగించే విధంగా ఉందన్నారు. ఉదహరణకు నాసిక్‌ నుంచి పంపించిన అన్ని నమునాల్లో డబుల్‌ మ్యుటేషన్‌ కనిపించిందని..ఇందుకు శాంపిల్‌ సేకరణలోనే లోపం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అందుకే యాదృచ్ఛిక నమూనా(రాండమ్‌)లో వీటిని సేకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

డబుల్‌ మ్యుటేషన్‌ ఎలా..?

వైరస్‌లోని రెండు ఉత్పరివర్తనాలు కలిసి ఒకే రకంగా మారడాన్నే ‘డబుల్‌ మ్యుటేషన్‌’గా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్‌లో వెలుగుచూసిన L452R, E484Q మ్యుటేషన్‌ రకాల స్పైక్‌ ప్రొటీన్‌లలోని గ్రహకాలు కలిసిపోయి కొత్తరకంగా మారుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, ఇలా మ్యుటేషన్ చెందిన రకాలు కలిసిపోవడం సాధారణ ప్రక్రియేనని వైరాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల్లో వెలుగు చూసిన కొత్తరకాలతో పాటు భారత్‌లో కొత్తగా ‘డబుల్‌ మ్యుటేషన్’ వైరస్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇదివరకే వెల్లడించింది. మహారాష్ట్రలోనే వీటి ప్రభావం ఎక్కువగా ఉండగా..ఇతర ప్రాంతాల్లోనూ వైరస్‌ మ్యుటేషన్‌లలో మార్పులు గమనించినట్లు పేర్కొంది. వైరస్‌ ఉద్ధృతికి ఈ మ్యుటేషన్‌లే కారణమా అనే కోణంలో ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని