‘కరోనా కథ అప్పుడే ముగియలేదు’  - dr kk agarwal last video inspires us
close
Published : 18/05/2021 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కరోనా కథ అప్పుడే ముగియలేదు’ 

ఆక్సిజన్‌ పెట్టుకునే అవగాహన కల్పించిన కేకే అగర్వాల్‌

వైరల్ అవుతున్న చివరినాళ్ల వీడియో క్లిప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘నేను కేకే అగర్వాల్‌ కాదు.. ఓ వైద్యుడిని.. మిమ్మల్ని రక్షించడమే నా కర్తవ్యం ’’.. ఇండియన్ మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ కేకే అగర్వాల్‌ చెప్పిన మాటలివి. వైద్య రంగంలో విశేష సేవలందించిన ఆయన.. కొవిడ్‌తో సుదీర్ఘంగా పోరాడి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. వృత్తిరీత్యా హృద్రోగ నిపుణలైన ఆయన చివరి క్షణం వరకు రోగులకు సేవలందిస్తూనే ఉన్నారు. శరీరంలోకి వైరస్‌ ప్రవేశించి నిస్సత్తువ ఆవహించినా ఆక్సిజన్‌ పెట్టుకునే ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. కొవిడ్‌ బాధితుల సంరక్షణపై చివరినాళ్లలో ఆయన చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘‘నాకు కొవిడ్‌ న్యుమోనియా సోకింది. తీవ్ర దశలోనే ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే రాజ్‌కపూర్‌ చెప్పిన మాటలు నాకు బాగా గుర్తొస్తాయి. ‘పిక్చర్‌ అబీ బాకీ హై(కథ అప్పుడే ముగియలేదు).. షో కొనసాగాలి’. అందుకే ఆక్సిజన్‌ పెట్టుకునే క్లాసులు చెబుతున్నా. ఎందుకంటే ప్రజలను రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను కేకే అగర్వాల్‌ను కాదు. నేనో వైద్యుడిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యుల చికిత్సా విధానం మారాలి. ఒక్కొక్కరినీ పిలిచి చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే ఒకేలాంటి లక్షణాలున్నవారందరికీ ఒకేసారి చూసి చికిత్స అందించాలి. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే.. షో కొనసాగాలి’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అందులో ఆయన ముక్కుకు ఆక్సిజన్‌ పైపు పెట్టుకుని కన్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

దేశంలో కొవిడ్‌ విజృంభణ తర్వాత వ్యాధిపై అవగాహన కల్పించేందుకు కేకే అగర్వాల్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వందల కొద్దీ వీడియోలు చేశారు. ఆన్‌లైన్‌లో కరోనా గురించి అవగాహన కల్పించడంతో పాటు రోగుల సమస్యలు విని వారికి ఔషధాలు కూడా సూచించారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. న్యుమోనియా వేధిస్తున్నప్పటికీ ఆయన వీడియోలు చేస్తూనే ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉన్న ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వీడియోలను 100 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 

కొద్ది నెలల క్రితం కేకే అగర్వాల్‌ ఆన్‌లైన్‌లో ఉండగా.. ఆయన సతీమణి ఫోన్‌ చేసి తనను తీసుకెళ్లకుండా టీకా వేయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే తన వీడియో టీకాపై అవగాహన కల్పిస్తే అంతకంటే ఏం కావాలని ఆయన హుందాగా చెప్పడం విశేషం. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని