కోహ్లీసేన ‘కేక’: ఇంగ్లాండ్‌ లక్ష్యం 318 - england target 318
close
Updated : 23/03/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీసేన ‘కేక’: ఇంగ్లాండ్‌ లక్ష్యం 318

విజృంభించిన ధావన్‌, కోహ్లీ, రాహుల్‌, కృనాల్

పుణె: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొట్టింది. 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (98; 106 బంతుల్లో 11×4, 2×6) అద్భుత విధ్వంసానికి తోడుగా.. సారథి విరాట్‌ కోహ్లీ (56; 60 బంతుల్లో 6×4), కేఎల్‌ రాహుల్‌ (62*; 43 బంతుల్లో 3×4, 4×6), కృనాల్‌ పాండ్య (58*; 31 బంతుల్లో 7×4, 2×6) మెరుపులు మెరిపించారు. ఇంగ్లాండ్‌కు భారీ లక్ష్యం నిర్దేశించారు.

శుభారంభం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (28; 42 బంతుల్లో 4×4), శిఖర్‌ ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లిష్‌ పేసర్లు చక్కని వేగం, కచ్చిమైన లైన్‌లో బంతులు వేయడంతో మొదట్లో ఆచితూచి ఆడారు. చెత్త బంతులు మాత్రమే వెంటాడుతూ 10 ఓవర్లకు 39/0తో జట్టును నిలిపారు. ఈ క్రమంలో వరుస బౌండరీలు బాది ఊపుమీదున్న హిట్‌మ్యాన్‌.. స్టోక్స్‌ వేసిన 16వ ఓవర్లో దేహానికి దూరంగా వెళ్తున్న బంతిని ఆడి బట్లర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో టీమ్‌ఇండియా తొలి వికెట్‌ చేజార్చుకుంది.

ముందు ‘గబ్బర్‌+కోహ్లీ’

రోహిత్‌ నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సొగసైన బౌండరీలతో ఆకట్టుకున్నాడు. తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. శిఖర్‌తో కలిసి స్కోరు వేగాన్ని పెంచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 102 బంతుల్లో 105 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో 68 బంతుల్లో అర్ధశతకం బాదేసిన గబ్బర్‌ గేర్లు మార్చాడు. అతడికి తోడుగా కోహ్లీ సైతం 50 బంతుల్లో అర్ధశతకం అందుకొన్నాడు. అయితే జట్టు స్కోరు 169 వద్ద మార్క్‌వుడ్‌.. కోహ్లీని పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే శ్రేయస్‌ అయ్యర్‌ (6; 9 బంతు్లో 1×4) అనవసర షాట్‌ ఆడి  ఔటయ్యాడు. ఈ క్రమంలో శతకానికి చేరువైన గబ్బర్‌ కాసేపు నెమ్మదిగా ఆడాడు. సెంచరీకి 2 పరుగుల దూరంలో.. స్టోక్స్‌ షార్ట్‌పిచ్‌లో వేసిన 38.1వ బంతిని పుల్‌ చేయబోయి మోర్గాన్‌కు చిక్కాడు. నిరాశగా మైదానం వీడాడు. అప్పటికి జట్టు స్కోరు 197.

తర్వాత ‘రాహుల్‌+కృనాల్‌’

ఇంగ్లాండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు వేయడం.. హార్దిక్‌ (1; 9 బంతుల్లో) ఔటవ్వడం.. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడంతో టీమ్‌ఇండియా 270 మార్క్‌ దాటుతుందా అనిపించింది! కానీ.. నిలదొక్కుకోవడానికి ఆచితూచి ఆడిన రాహుల్‌ కాసేపయ్యాక విజృంభించాడు. సొగసైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. ఫామ్‌లోకి రావాలన్న ఆత్మవిశ్వాసంతో మెరుపు షాట్లు కొట్టాడు. అతడికి తోడుగా అరంగేట్రం ఆటగాడు కృనాల్‌పాండ్య బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్ధశతకాలు సాధించిన వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయమైన 112 (61 బంతుల్లో) పరుగుల సాధికారిక భాగస్వామ్యం అందించారు. ఆఖరి 5 ఓవర్లలో 67 పరుగులు సాధించారు. జట్టును 317/5తో నిలిపారు.  మార్క్‌వుడ్‌ 3, బెన్‌స్టోక్స్‌ 2 వికెట్లు తీశారు. కాగా 26 బంతుల్లో కృనాల్‌ చేసిన అర్ధశతకం టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం ఆటగాడు చేసిన వేగవంతమైంది కావడం గమనార్హం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని