India In UN: పాక్‌ విధానాలు యావత్‌ ప్రపంచానికి ముప్పు! - entire world suffered due to pakistans terror policies
close
Updated : 25/09/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India In UN: పాక్‌ విధానాలు యావత్‌ ప్రపంచానికి ముప్పు!

ఐరాస వేదికగా పాక్‌కు చురకలంటించిన భారత్‌

న్యూయార్క్‌: ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌.. ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్‌ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌ దుర్నీతి వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు జవాబిస్తూ భారత్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. 

‘‘పాకిస్థాన్‌ ప్రధాని భారత అంతర్గత విషయాలను ప్రస్తావించారు. తద్వారా ఈ వేదిక ప్రతిష్ఠను తగ్గించారు. ఈ క్రమంలో వారికి బదులిచ్చే హక్కును వినియోగించుకుంటున్నాం. ఓ అంతర్జాతీయ వేదికపై అవాస్తవాలతో విషం చిమ్మేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. అందుకే నిజాల్ని ప్రపంచం ముందుంచాలనుకుంటున్నాం. పైగా పదే పదే అవాస్తవాలు వల్లెవేస్తున్న నాయకుడి మానసిక స్థితిపై మనమంతా జాలిచూపాల్సి ఉంది. తమని తాము ఉగ్రవాద బాధిత దేశంగా పాకిస్థాన్‌ చెప్పుకొంటోంది. ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా పాక్‌ నటిస్తోంది. వారి విధానాల వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంది. పాక్‌ను ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశంగా ఈ ప్రపంచం చూస్తోంది. పైగా వారి దేశంలోని వేర్పాటువాద ఉద్యమాల్ని ఉగ్రవాద చర్యలుగా చిత్రీకరిస్తోంది’’ అని ఐరాసలోని భారత ప్రతినిధి స్నేహా దూబే దీటుగా బదులిచ్చారు.

అమెరికాలో ప్రపంచ వాణిజ్య భవంతులపై జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా భారత్‌ ప్రస్తావించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ మారణహోమాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని వ్యాఖ్యానించింది. అంతటి ఘోరానికి పాల్పడిన ఉగ్రనేత ఒసామా బిన్‌ లాడెన్‌కు పాక్‌ ఆశ్రయమిచ్చిందని గుర్తు చేసింది. పైగా ఆ ముష్కరుణ్ని పాక్‌ నేతలు అమరుడిగా కీర్తిస్తున్నాయని పాక్‌ దుర్బుద్ధిని ఎండగట్టింది. ఇంకా పాకిస్థాన్‌ తమ ఉగ్రచర్యల్ని సమర్థించుకుంటోందని స్పష్టం చేసింది. ఈ ఆధునిక యుగంలో ఉగ్రసమర్థ చర్యలు ఏమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పింది.

పాక్‌ సహా పొరుగు దేశాలన్నింటితో భారత్‌ సత్సంబంధాలనే కోరుకుంటోందని దూబే ఐరాస వేదికగా స్పష్టం చేశారు. అయితే, పాక్‌ ఆ దిశగా చొరవచూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు విశ్వసనీయ, తిరుగులేని చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. సిక్కులు, హిందువులు, క్రైస్తవుల వంటి మైనారిటీలను పాక్‌లో అణచివేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం, నాయకుల మద్దతు సైతం ఉందని తెలిపారు. నిరసన తెలిపే గొంతుల్ని నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. అపహరణ, చట్టవిరుద్ధ మరణశిక్షలు పరిపాటిగా మారాయని గుర్తుచేశారు.

ఐరాసలో ప్రసంగించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఇటీవల మరణించిన వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ పేరును సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇలా పాక్‌ నేత, ఐరాసలోని ఆ దేశ ప్రతినిధులు కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం ఇది కొత్తేమీ కాదు. అయితే, ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మాత్రం పాక్‌ విఫలమైంది. ప్రపంచ దేశాలు దీన్ని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశంగా పరిగణిస్తున్నాయి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని