వ్యాక్సిన్‌ కొరతను పరిష్కరించాలి: ఈటల - etala rajendar press meet
close
Updated : 18/04/2021 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ కొరతను పరిష్కరించాలి: ఈటల

హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన బీఆర్కే భవన్‌ నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రోజుకు 10లక్షల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. టీకాలు అందుబాటులో లేక  ఇవాళ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఇవాళ రాత్రికి 2.7లక్షల డోసులు వస్తాయని సమాచారమిచ్చారు.. వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. నిత్యం వైద్య అధికారులు, తాను కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నామని, ఎంత తొందరగా వ్యాక్సిన్‌ ఇస్తే  పంపిణీ ప్రక్రియ అంత వేగవంతంగా చేపడతామని చెబుతున్నామని మంత్రి వివరించారు.  కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉత్పత్తిని బట్టి, ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్‌ సరఫరా చేస్తోందని తెలిపారు. వ్యాక్సిన్‌ సమస్యను త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 25ఏళ్లు పైబడిన వారికి కూడా కొవిడ్‌ టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు స్పందించలేదన్నారు. దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 50శాతం మహారాష్ట్ర నుంచే ఉన్నాయని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడక కొరత లేదని, రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతానికి ఆక్సిజన్‌ కొరతలేదు..
‘‘కొవిడ్‌ చికిత్సకు ఐసీఎంఆర్‌ స్పష్టమైన ప్రొటోకాల్‌ ఇచ్చింది. గతంలో 10.. 12 రోజులకు లక్షణాలు కనిపించేవి. కానీ సెకండ్‌ వేవ్‌లో 2..3 రోజులకే తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా వైద్యశాఖ అధికారులు నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం. ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఉత్పత్తి చేసుకోలేవు. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ  300 నుంచి 350 టన్నుల వరకు అవసరమయ్యే ఆస్కారముంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదు. పేషెంట్‌ ఆందోళనను బట్టి ట్రీట్‌మెంట్‌ కాకుండా, అవసరాన్ని బట్టి వైద్యం అందించాలని వైద్యులను కోరుతున్నా. అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ పెట్టాలని వైద్యులపై ఒత్తిడి చేయడం సమంజసం కాదు. అవసరం లేకపోయినా రెమ్‌డెసివిర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేయడం తగదు. ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అనవసరంగా అందరికీ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇవ్వొద్దు. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి తగ్గిపోయింది. త్వరలోనే కావాల్సినన్ని రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తాయి’’ ఈటల రాజేందర్‌ తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని