వాటర్‌ హీటర్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! - everything about an immersion water heater you need to know
close
Updated : 06/07/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాటర్‌ హీటర్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

వర్షంలో తడిసాక వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ హాయే వేరు కదండీ! అయితే ఈ క్రమంలో నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది గీజర్‌ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్‌ స్టౌ వాడుతుంటారు.. ఇంకొందరేమో వాటర్‌ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుంటారు. అయితే వీటిలో చాలామంది ఇళ్లలో ఉండేది మాత్రం వాటర్‌ హీటరే! అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి చేసే సత్తా ఉండడమే చాలామంది దీన్ని ఎంచుకోవడం వెనకున్న ముఖ్యోద్దేశం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. దీన్ని ఉపయోగించే క్రమంలో కొంతమంది చేసే పొరపాట్లు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మరి, వాటర్‌ హీటర్‌ వాడే క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం రండి..

నిర్లక్ష్యం వద్దు.. ఈ జాగ్రత్తలు ముద్దు!

* పిల్లలున్న ఇళ్లలో వాటర్‌ హీటర్‌ వాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు పదే పదే తిరిగే ప్రదేశాల్లో కాకుండా ఏదో ఒక మూలకు లేదంటే ప్రత్యేకమైన గది ఉంటే అందులో పెట్టి హీటర్‌తో నీళ్లు వేడి చేసుకోవచ్చు.

* అలాగే ఒకసారి స్విచ్‌ ఆన్‌ చేశామంటే అటువైపుగా ఎవరూ వెళ్లకుండా.. ముఖ్యంగా చిన్నారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

* కొంతమంది ప్లాస్టిక్‌ బకెట్స్‌లో హీటర్‌ పెడుతుంటారు. అయితే ఈ క్రమంలో నేరుగా బకెట్‌కు హీటర్‌ హుక్‌ను తగిలించకూడదు. ఎందుకంటే ఆ వేడికి ప్లాస్టిక్‌ కరిగిపోతుంది. ఇది ప్రమాదకరం కూడా! కాబట్టి ప్లాస్టిక్‌ బకెట్‌లోనే హీటర్‌ పెట్టాలనుకుంటే దానిపై ఒక సన్నటి చెక్కకు హీటర్‌ను తగిలించడం ఉత్తమం. లేదంటే అల్యూమినియం బకెట్‌ ఉంటే దానికి నేరుగా హీటర్‌ను అమర్చచ్చు. అలాగే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇనుప బకెట్స్‌ని కూడా వాడకపోవడం మంచిది. ఎందుకంటే దీనివల్ల కూడా విద్యుత్‌ షాక్‌ తగిలే ప్రమాదం ఎక్కువ.
* వాటర్ లెవెల్‌ని బట్టి బకెట్‌ను పూర్తిగా నింపిన తర్వాత హీటర్‌ను ఆ నీళ్లలో ఉంచాలి. అది కూడా హీటింగ్‌ కాయిల్‌ పూర్తిగా మునిగేలా జాగ్రత్తపడాలి. ఆ తర్వాతే ప్లగ్‌ని సాకెట్‌కి కనెక్ట్‌ చేసి స్విచాన్‌ చేయాలి.
* ఇక స్విచ్‌ వేశాక నీళ్లు వేడయ్యాయో, లేదో చెక్‌ చేసే విషయంలో కొందరు ఏమరపాటుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో మర్చిపోయి అలాగే నీళ్లలో చేయి పెట్టారంటే షాక్‌ తగిలి ప్రాణాల మీదకొస్తుంది. కాబట్టి హీటర్‌ పెట్టిన తర్వాత ధ్యాసంతా దాని మీదే ఉంచాలి. స్విచ్‌ ఆఫ్‌ చేసి ప్లగ్‌ తొలగించిన తర్వాతే నీళ్లను ముట్టుకోవాలి.
* నీళ్లు మరీ వేడైతే చేతులు కాలే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా చేతిని అందులో పెట్టడం కాకుండా వేలితో నీటి ఉష్ణోగ్రతను పరిశీలించడం మంచిది. అది కూడా హీటర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ప్లగ్‌ తొలగించిన తర్వాతే.
* నీళ్లు మరగాలని మరీ ఎక్కువ సేపు హీటర్‌ను అలాగే స్విచ్ ఆన్‌ చేసి ఉంచడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక్కోసారి దీనివల్ల షార్ట్‌ సర్క్యూట్‌ కూడా జరగచ్చు.
* కొంతమంది వాటర్‌ హీటర్స్‌ని నేరుగా బాత్‌రూమ్స్‌లో వాడుతుంటారు. ఈ క్రమంలో 2 ఇన్‌ 1 కనెక్షన్‌ ఇస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒకవేళ స్విచ్‌ ఆఫ్‌ చేయడం మర్చిపోయి అలాగే బాత్‌రూమ్‌లోకి వెళ్లామంటే అక్కడున్న తేమకు కరెంట్‌ షాక్‌ కొట్టే ప్రమాదం ఉంది.

* ఒకవేళ మర్చిపోయి నీళ్లలో పెట్టకుండానే హీటర్‌ స్విచ్‌ ఆన్ చేస్తే మాత్రం హీటర్‌ కాయిల్‌ నిప్పు కణికలా మారి మండిపోయే ప్రమాదం ఉంది. ఏమరపాటుగా దాన్ని తాకితే విద్యుత్‌ షాక్‌ తగిలి ప్రాణాల మీదకొస్తుంది.

 

ధర కాదు.. నాణ్యత ముఖ్యం!

అందుబాటు ధరలో లభ్యమవుతుందన్న ఉద్దేశంతో బ్రాండ్‌తో పనిలేకుండా ఏ వాటర్‌ హీటర్‌ పడితే అది కొంటుంటారు కొంతమంది. అయితే ఇలా నాణ్యత లేని వాటర్‌ హీటర్‌ కూడా ప్రమాదకరమే! అందుకే ధర కాస్త ఎక్కువైనా పర్లేదు.. కానీ నాణ్యమైన, బ్రాండెడ్‌ వాటర్‌ హీటర్స్‌ని ఎంచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇక ప్రస్తుతం ఆటో-ఆఫ్‌ సదుపాయం ఉన్న వాటర్‌ హీటర్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే.. నీళ్లు వేడయ్యాక దానంతటదే హీటర్‌ ఆఫ్‌ అయిపోతుందన్న మాట! అంతేకాదు.. వాటర్‌ప్రూఫ్‌/షాక్‌ప్రూఫ్‌ వాటర్‌ హీటర్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటికి ఉండే పిడి లాంటి షాక్‌ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ టాప్‌.. విద్యుత్‌ షాక్‌ రాకుండా మనల్ని కాపాడుతుంది. అయినా కూడా సాకెట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి, ఆ ప్లగ్‌ను తొలగించాకే వేడి నీళ్లను వాడుకోవడం మంచిది. తద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడచ్చు.

సో.. ఇవండీ! వాటర్‌ హీటర్‌ని ఉపయోగించుకునే క్రమంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. మరి, ఇవి కాకుండా మీకు తెలిసిన ఇతర జాగ్రత్తలేమైనా ఉంటే మాతో పంచుకోండి.. వాటర్‌ హీటర్‌ విషయంలో అందరినీ అప్రమత్తం చేయండి!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని