Kohli - Sarfaraz: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒక్కటే! - faf du plessis compares sarfaraz ahmad captaincy with virat kohli
close
Published : 06/06/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kohli - Sarfaraz: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒక్కటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ సారథి సర్ఫరాజ్‌ఖాన్‌ కెప్టెన్సీ.. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీలాగే ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో సర్ఫరాజ్ సారథ్యంలోని కెట్టా గ్లాడియేటర్స్‌ జట్టులో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాక్‌ మీడియాతో మాట్లాడుతూ ధోనీ, సర్ఫరాజ్‌ల కెప్టెన్సీని పోల్చే క్రమంలో డుప్లెసిస్‌ పై విధంగా స్పందించాడు. వాళ్లిద్దరి శైలి వేరని, ఒకరితో ఒకరిని పోల్చలేమని చెప్పాడు.

‘వాళ్లిద్దరి కెప్టెన్సీ విధానాలు ప్రత్యేకమైనవి. ధోనీ ప్రశాంతంగా ఉంటూనే ఒంటరిగా ఆలోచిస్తాడు. అప్పటికప్పుడు మైదానంలో నిర్ణయాలు తీసుకుంటాడు. సర్ఫరాజ్‌ పూర్తిగా ధోనీకి భిన్నంగా ఉంటాడు. మరోవైపు అతడు విరాట్‌ కోహ్లీలా కనిపిస్తాడు. ఎప్పుడూ ఇతరులతో మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకుంటాడు. జట్టును ఎలా నడిపించాలనే పట్టుదలతో ముందుకు సాగుతాడు. మైదానంలోనూ అదే బయటకు చూపిస్తాడు. అయితే, ఒకరు కరెక్టు, మరొకరు కాదని ఏదీ లేదు. ఎవరి కెప్టెన్సీ వాళ్లది. సర్ఫరాజ్‌ ఇప్పటికే పాకిస్థాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దాంతో తన ఆటగాళ్ల నుంచి మెరుగైన ప్రదర్శన రాబట్టాడు’ అని డుప్లెసిస్‌ వివరించాడు.

అలాగే తనకు వివిధ కెప్టెన్లతో కలిసి ఆడాలని ఉంటుందని, వాళ్లంతా తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలని ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ సారథి చెప్పుకొచ్చాడు. తనకు కూడా వ్యక్తిగతంగా కెప్టెన్సీ అంటే ఇష్టమని చెప్పాడు. సర్ఫరాజ్‌ సారథ్యంలో ఆడటం తనకు నచ్చిందని, అతడికి అవసరమైతే తాను సలహాలు, సూచనలు చేస్తానని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. కాగా, ఇటీవల ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన ఈ స్టార్‌ ఓపెనర్‌ ఏడు మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధశతకాలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ, బయోబుడగలో పలు కరోనా కేసులు నమోదవ్వడంతో మిగతా మ్యాచ్‌లను అర్థాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని