టీకా పంపిణీలో రికార్డు  - fifteen lakh people vaccinated against covid-19 on march 5 highest in a day
close
Published : 06/03/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా పంపిణీలో రికార్డు 

ఒక్క రోజులో 15లక్షల మందికి వ్యాక్సినేషన్‌

దిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు చేపట్టిన టీకా పంపిణీ కార్యక్రమం దేశంలో శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య 2 కోట్లకు చేరువకాగా.. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో దాదాపు 15లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీలో భాగంగా 49వ రోజైన శుక్రవారం దేశవ్యాప్తంగా 14,92,201 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇందులో 11,99,848 మంది తొలి డోసు తీసుకోగా.. 2,92,353 మందికి రెండో డోసు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 1.94కోట్లు దాటింది. 

82 శాతం కొత్త కేసులు.. 5 రాష్ట్రాల్లోనే

మరోవైపు, దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 18,327 కొత్త కేసులు బయటపడగా.. వీరిలో 82శాతం కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం అక్కడ గణనీయంగా 10,216 కేసులు వెలుగుచూశాయి. కేరళలో 2,776, పంజాబ్‌లో 808 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల కనబడినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.  

21 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు 1000లోపే..!

కరోనా కేసులు పెరగడంతో దేశంలో క్రియాశీల కేసులు కూడా మళ్లీ ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,80,304 క్రియాశీల కేసులున్నాయి. అయితే, 21 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1000లోపే ఉండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. కేరళ, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌లలో 24 గంటల్లో క్రియాశీల కేసుల్లో తగ్గుదల నమోదైంది. అయితే మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణాల్లో యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

18 రాష్ట్రాల్లో సున్నా మరణాలు..

గడిచిన 24 గంటల్లో 108 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 53 మంది మరణించారు. కేరళలో 16 మంది, పంజాబ్‌లో 11 మంది కరోనాకు బలయ్యారు. అయితే 18 రాష్ట్రాల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరాంఖండ్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి, అసోం, సిక్కిం, మణిపూర్‌, లద్దాఖ్‌, మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, నాగాలాండ్‌, మిజోరం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలీ- డయ్యూడామన్‌లలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని