‘స్నేహభావం..సహజలక్షణం’అనుబంధం కాదు: పూరీ - friendliness is a natural quality its not a relationship- purijagannadh
close
Published : 16/11/2020 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్నేహభావం..సహజలక్షణం’అనుబంధం కాదు: పూరీ

హైదరాబాద్‌: ‘స్నేహభావం’ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పేర్కొన్నారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘స్నేహభావం’ గురించి మాట్లాడారు. స్నేహభావం అనేది సహజ లక్షణం. ఇది అనుబంధం కాదు అని చెప్పారు.

‘దారిలో ఒక చిన్న కుక్కపిల్ల కనపడుతుంది. అది తోక ఊపుతూ దగ్గరికి వస్తుంది. ఆ కుక్కపిల్లకి మనం ఎవరమనేది తెలీదు. అయినా సరే  మన చుట్టూ తిరుగుతుంది. కాసేపు దానితో ఆడుకొని వెళ్లిపోతాం. మనం తిరిగి వచ్చేసరికి ఆ కుక్కపిల్ల వేరే ఎవరితోనో ఆడుతూ ఉండటం చూస్తాం. అందరికీ ఆ కుక్కపిల్లంటే ఇష్టం. నిమిషం తిరగకుండా నేస్తం అవుతుంది. ఆ కుక్కపిల్లతో కాసేపు ఉన్నా ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి ఆ కుక్కపిల్లలో ఉన్నది ‘స్నేహభావం’. స్నేహం వేరు. స్నేహభావం వేరు. చెలిమిలో స్నేహితుడుంటాడు. స్నేహభావంలో ఎవరూ ఉండరు. ఎవరికి వారే ఉంటారు. మనకు ఇష్టమైన వారితోనూ, తెలియని వారితోనూ స్నేహపూర్వకంగా ఉండచ్చు. స్నేహభావం అనేది మన ప్రధాన లక్షణంగా ఉండాలి’.అని ఆయన చెప్పారు. 

‘ఎక్కడో అడవిలో ఓ అందమైన పువ్వు పూస్తుంది. ఎవరు చూసినా, చూడకపోయినా ఆ పూవు పరిమళం అలాగే ఉంటుంది. అది సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ పూవు ఎవరి కోసమో విచ్చుకోదు, అలాగే పరిమళించదు. పూవు పూయటం, సువాసనను అందించటం దాని లక్షణం. అదే విధంగా మనం సైతం ఆ పువ్వులాగా ఉండాలి అని పూరీ అన్నారు. ప్రతి అనుబంధానికి ఎవరో ఒకరు కావాలి. కానీ స్నేహభావానికి ఎవరూ అవసరం లేదు. ఎవరికి వారు స్నేహపూర్వకంగా ఉండచ్చు’. 

‘తమపై తమకు ఎందుకంత కోపం, నిరాశ. మనందరికీ మనతో మనం స్నేహభావంతో ఉండటం తెలియదని ఆయన అన్నారు. ఎన్నోసార్లు మనల్ని మనమే శిక్షించుకుంటాం. మనతో మనమే కాకుండా రాళ్లు రప్పలు, చెట్లు, మొక్కలతో స్నేహంగా మెలగవచ్చు’. 

‘మనం స్నేహభావం కలిగి ఉన్నట్లైతే నక్షత్రాలు మనల్ని పలకరిస్తాయి. నదిలో నీళ్లు మనల్ని తడుముకుంటూపోతాయి. చల్లని గాలి మనల్ని ఉక్కిరి బక్కిరి చేస్తుంది.  ఈ స్నేహభావం మనలో ఉంటే సాధువుతో సమానం అని ఆయన చెప్పారు. ఈ ఒక్క లక్షణాన్ని చాలా సులభంగా అలవరచుకోవచ్చు. దీంతో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు’.

‘ఈ లక్షణం మనం అలవరచుకోవాలనుకుంటే ఎవరిపైనా ఆధారపడకూడదు. మన పని మనం చేసుకోవాలి. ఎవరికీ బరువుగా ఉండకూడదు. అలా ఉన్నప్పుడే మనతో మనం డ్యాన్స్‌ చేయగలుగుతాం’. అని పూరీ వివరించారు.  

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని