వినాయక చవితికి వెరైటీ కుడుములు..! - ganesh chaturthi festival special receips
close
Published : 09/09/2021 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వినాయక చవితికి వెరైటీ కుడుములు..!

పండగ అంటేనే పిండివంటలు, నైవేద్యాలు. ఇందులో భాగంగా భగవంతుడిని పూజించడం ఎంత ముఖ్యమో, ఆయనకు మనం భక్తితో సమర్పించే నైవేద్యం కూడా అంతే ముఖ్యమైనది. అందులోనూ వినాయక చవితి అంటే వెరైటీ కుడుములకు పెట్టింది పేరు. మరి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడుములను తయారుచేసి, ఆ బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా సమర్పిస్తే ఆ ఆదిదేవుడి ఆశీర్వాదం అందుకోవచ్చు. మరి, అలాంటి కొన్ని వెరైటీ కుడుములు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

కొబ్బరి-బెల్లం కుడుములు

కావాల్సినవి

* బియ్యప్పిండి - ఒక కప్పు

* కొబ్బరి తురుము - ఒక కప్పు

* యాలకుల పొడి - పావు టీస్పూన్

* ఉప్పు - ముప్పావు టీస్పూన్

* బెల్లం పొడి - ఒక కప్పు

* నువ్వుల నూనె - అర టీస్పూన్

* నెయ్యి - టేబుల్‌స్పూన్

తయారీ

* ముందుగా ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి కొబ్బరి తురుమును దోరగా వేయించాలి.

* మరో ప్యాన్ తీసుకుని అందులో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి సన్నటి మంటపై ఉంచాలి.

* కాసేపయ్యాక బెల్లం చిక్కగా మారి పాకంలా తయారవుతుంది. ఆ సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కలపాలి.

* ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై ఉంచి పదే పదే కలుపుతుండాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి యాలకుల పొడిని జత చేసి మరోసారి కలపాలి.

* కొన్ని సెకన్ల తర్వాత మంటను ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి.

* ఆలోపు ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక కప్పు వేడి నీళ్లను పోయాలి. ఆ తర్వాత నువ్వుల నూనె, ఉప్పు కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.

* ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కాస్త ఒత్తి.. అందులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న బెల్లం-కొబ్బరి ఉండల్ని స్టఫ్ చేయాలి.

* ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే ఎంతో రుచికరంగా నోరూరించే కొబ్బరి-బెల్లం కుడుములు రడీ!

చాక్లెట్ కుడుములు

కావాల్సినవి

* పాలు - 1/3 కప్పు

* కండెన్స్‌డ్ మిల్క్ - 1/3 కప్పు

* పిస్తా పప్పులు - అరకప్పు

* చాక్లెట్ చిప్స్ - 3/4 కప్పు

* పై క్రస్ట్ (ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది) - ఒకటిన్నర కప్పు

* నెయ్యి - కొద్దిగా

తయారీ

* ముందుగా ఒక ప్యాన్‌లో పాలు, కండెన్స్‌డ్ మిల్క్, చాక్లెట్ చిప్స్ తీసుకుని మీడియం మంటపై మరిగించాలి.

* ఎప్పుడైతే చాక్లెట్ కరిగిపోయి మిశ్రమం మృదువుగా తయారవుతుందో అప్పుడు పై క్రస్ట్ వేసి బాగా కలపాలి.

* ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు సిమ్‌లో ఉన్న మంటపై ఉంచి తర్వాత పిస్తా పప్పులు వేసి బాగా కలుపుకోవాలి.

* పిండిలా, మృదువుగా తయారైన ఈ మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.

* అరచేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. వీటి మధ్యలో కాస్త రంధ్రం చేసి అందులో కరిగించిన చాక్లెట్‌ని నింపుకొని పిండితో మూసేస్తే సరి రుచికరమైన చాక్లెట్ కుడుములు విఘ్ననాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి తయార్!

డ్రైఫ్రూట్ కుడుములు

కావాల్సినవి

* బాదం పప్పులు - 12

* ఎండిన ఖర్జూరాలు - 8

* ఎండు కొబ్బరి - అర కప్పు

* నీళ్లు - ఒక టీస్పూన్

* జీడిపప్పు - 15

* ఎండుద్రాక్ష (కిస్‌మిస్) - 2 టేబుల్‌స్పూన్లు

* నెయ్యి - ఒక టేబుల్ స్పూన్

* బియ్యప్పిండి - కప్పు

* ఉప్పు - కొద్దిగా

తయారీ

* ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు కొబ్బరి.. ఇవన్నీ ప్యాన్‌లోకి తీసుకొని దోరగా వేయించాలి.

* ఆపై వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో గింజ తీసేసిన ఎండు ఖర్జూరాలు కూడా వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి.

* ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ ముద్దలు కట్టుకునేలా కలుపుకోవాలి.

* అరచేతులకు నెయ్యి రాసుకొని.. ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.

* మరో గిన్నెలో బియ్యప్పిండి తీసుకొని అందులో ఉప్పు వేసి వేడి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.

* ఈ బియ్యప్పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి కాస్త ఒత్తి మధ్యలో డ్రైఫ్రూట్స్ ముద్దను ఉంచి మూసేయాలి. ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే టేస్టీ టేస్టీ డ్రైఫ్రూట్స్ కుడుములు సిద్ధం!

కేసరి కుడుములు

కావాల్సినవి

* కోవా - 2 కప్పులు

* యాలకుల పొడి - అర టీస్పూన్

* కుంకుమపువ్వు - కొద్దిగా

* చక్కెర - అర కప్పు

* క్రష్ చేసిన పిస్తా పప్పులు - అరకప్పు

* నెయ్యి - వేయించడానికి సరపడినంత

తయారీ

* ప్యాన్‌లో కోవా, చక్కెరను తీసుకుని తక్కువ మంట మీద ఉంచాలి.

* చక్కెర పూర్తిగా కరిగాక మంటను ఆఫ్ చేసి అందులో యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారే వరకు పక్కన ఉంచాలి.

* ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విభజించాలి. ఈ క్రమంలో ఒక గిన్నెలో కాస్త ఎక్కువ మిశ్రమాన్ని, మరో గిన్నెలోకి కాస్త తక్కువ మిశ్రమాన్ని తీసుకోవాలి.

* తక్కువగా ఉన్న మిశ్రమంలో క్రష్ చేసిన పిస్తా పప్పులను, వేరే గిన్నెలో ఉన్న మిశ్రమానికి కుంకుమ పువ్వును కలపాలి.

* ఈ రెండు మిశ్రమాలను కలిపి కేసరి కుడుములను తయారుచేయవచ్చు. అందుకోసం ముందుగా కుంకుమపువ్వు మిశ్రమాన్ని రోలింగ్ చేసి చిన్న ముద్దలుగా చేసుకోవాలి.

* అరచేతులకు నెయ్యి రాసుకొని ముద్దను కాస్త ఒత్తి మధ్య భాగంలో ఉన్న ఖాళీలో పిస్తా మిశ్రమం ఉండను ఉంచి మూసేయాలి. అంతే యమ్మీ యమ్మీ కేసరి కుడుములు రడీ!

మఖానే ఖీర్

కావాల్సినవి

* గసగసాలు - 250 గ్రాములు

* పాలు - అర లీటర్

* నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు

* బాదం పప్పులు - 8

* చక్కెర - కప్పు

* జీడిపప్పులు - 8

* కుంకుమ పువ్వు- చిటికెడు

తయారీ

* ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి గసగసాలు, జీడిపప్పు, బాదం వేసి దోరగా వేయించాలి. ఆపై వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి.

* మరో ప్యాన్‌లో పాలు పోసి బాగా మరిగించాలి.

* వేయించిన గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పుల్లో కొన్ని తీసుకొని పక్కన పెట్టి మిగతా వాటిని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి.

* ఇప్పుడు మరుగుతున్న పాలలో సరిపడా చక్కెర వేసుకోవాలి. అలాగే అందులోనే యాలకుల పొడి, కుంకుమ పువ్వు, జీడిపప్పు పొడి, పక్కన పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

* దీనిని 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఆపై దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే మఖానే ఖీర్ తయార్!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని