ఎల్‌ఐసీ ఐపీవో ప్రతిపాదనలు ఇంకా రాలేదు..!
close
Published : 19/02/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్‌ఐసీ ఐపీవో ప్రతిపాదనలు ఇంకా రాలేదు..!

ముంబయి: ఎల్‌ఐసీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఐపీవో ప్రతిపాదనలు అందలేదని బీమా రంగ సంస్థ రెగ్యూలేటరీ ఐఆర్‌డీఏ తెలిపింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ ఎస్‌సీ కుంతియా మంగళవారం వెల్లడించారు. నష్టాలు తెచ్చే ప్రొడక్ట్‌ల నుంచి బీమా రంగ కంపెనీలు పక్కకు రావాలని ఆయన సూచించారు. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటనపై స్పందిస్తూ ఇప్పటి వరకు ఎల్‌ఐసీలో ఐపీవో ప్రతిపాదన రాలేదన్నారు. ఏ కంపెనీ అయినా ఐపీవోకు వెళ్లాక మరింత మెరుగైన నిర్వహణ, పారదర్శకతను సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు.  ఐపీవోకు వెళ్లే సందర్భంగా అవసరమైన మార్పులను ప్రభుత్వం చూసుకొంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో లిస్టింగ్‌కు రావొచ్చని భావిస్తున్నారు. 
ఎంతమొత్తం వాటా విక్రయించేది మాత్రం తెలియరాలేదు.  సుమారు 10 శాతం వాటాలు విక్రయించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎల్‌ఐసీని లిస్టింగ్‌కు తీసుకురావడం ద్వారా రూ.90వేల కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మొత్తం రూ.2.10 లక్షల కోట్లను రాబట్టాలని యోచిస్తోంది.

పెరుగుతున్న నిరర్థక ఆస్తులు..

ఎల్‌ఐసీ (జీవిత బీమా కార్పొరేషన్‌) వద్ద భారీగా నిరర్థక ఆస్తులు, తక్కువ రేటింగ్‌ పెట్టుబడులు పోగుబడుతున్నాయి. ఇటువంటివి దాదాపు రూ.67,387 కోట్లకు చేరాయి. ఈ లెక్కలను ఆ సంస్థే ప్రకటించింది. 2014 తర్వాత ఈ సంస్థ పెట్టుబడులు కూడా భారీగా పెరిగిపోయాయి. నిధుల కొరత ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో వాటాలు కొని ఆదుకొంది. సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఎల్‌ఐసీ రూ.30వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. అంతకు ముందు ఆరునెలలతో పోలిస్తే ఇది రూ.5,000 కోట్లు ఎక్కువ. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.24,777 కోట్లుగా ఉన్నాయి. 2015 మార్చి నుంచి సెప్టెంబర్‌ 2019 వరకు 145శాతం పెరిగాయి. ఇవి ప్రమాద ఘంటికలు మోగించినట్లే లెక్క. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలహీనమైన పెట్టుబడులు(డౌన్‌గ్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్లు)రూ.23,126 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికే రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, ఎస్సార్‌ పవర్‌, స్టెర్లింగ్‌ బయోటెక్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌, డెక్కన్‌  క్రానికల్‌ హోల్డింగ్స్‌ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. దీనికి తోడు ఎల్‌ఐసీ సాల్వెన్సీ రేషియో కూడా సెప్టెంబర్‌ 2019 నాటికి 1.55 నిష్పత్తికి చేరింది. ఇది పరిశ్రమలో అతితక్కువ. 

భారీగా పెరిగిన పెట్టుబడులు

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్‌ఐసీ పెట్టుబడులు భారీగా 76శాతం పెరిగాయి. మార్చి 2019 నాటికి ఎల్‌ఐసీ రూ.26,61,564 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. 2014లో ఈ మొత్తం కేవలం రూ.15,11,133 కోట్లుగా ఉంది. మోదీ సర్కారు చేపట్టిన పెట్టుబడి ఉపసంహరణల్లో చాలా వాటిని ఇదే ఆదుకొంది. బీహెచ్‌ఈఎల్‌లో 5.94శాతం వాటా.. కోల్‌ ఇండియాలో రూ.7,000 కోట్లు.. 2017 జనవరిలో జీఐసీ, న్యూఇండియా ఎష్యూరెన్స్‌ కార్పొరేషన్‌లో రూ.15,000 కోట్లు, 2018లో ఐడీబీఐలో రూ.13,000 కోట్లు పెట్టి వాటాలు కొనుగోలు చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను కూడా కష్టాల నుంచి బయటపడేయమని ప్రభుత్వం కోరినా.. మోసపూరిత వ్యవహారాలు ఉండటంతో  వెనుకడుగు వేసింది. ఏటా కనీసం రూ.55వేల కోట్ల వరకు మార్కెట్లలో ఎల్‌ఐసీ పెట్టుబడులు వస్తుంటాయి. ఎల్‌ఐసీకి రూ.4లక్షల కోట్లకు విలువైన డిబెంచర్లలో పెట్టుబడులు ఉన్నాయి. దీతోపాటు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో రూ.3.7లక్షల కోట్ల వరకు మదుపు చేసింది. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని