పామాయిల్‌ వివాదం పరిష్కరించుకొంటాం 
close
Published : 11/03/2020 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పామాయిల్‌ వివాదం పరిష్కరించుకొంటాం 

 దిద్దుబాటు చర్యలకు మలేషియా కొత్త ప్రభుత్వం యత్నాలు

కౌలాంపూర్‌: పామాయిల్‌ కొనుగోళ్ల విషయంలో భారత్‌తో ఏర్పడ్డ వివాదాన్ని నెలరోజుల్లోపు పరిష్కరించుకొంటామని మలేషియా ప్లాంటేషన్‌ ఇండస్ట్రీస్‌ శాఖ మంత్రి మొహద్‌ ఖరుద్దీన్‌ అమన్‌ రజాలీ బుధవారం వెల్లడించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఆయన ఈ అంశంపై స్పందించారు. భారత్‌తో చర్చించేందుకు ప్రతినిధుల బృందం పంపించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ బృందం ఇరుదేశాల మధ్యసంబంధాలను బలపర్చేందుకు కృషి చేస్తుందన్నారు. 

అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి యత్నం..

కౌలాలంపూర్‌లో కొన్నాళ్ల కిందట జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న నాటి ప్రధాని మహతిర్ మహమ్మద్‌ భారత్‌లో కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంపై నోరుపారేసుకొన్నారు. ‘లౌకిక దేశం అని చెప్పుకునే భారత్‌ ఇప్పుడు కొందరు ముస్లింల పౌరసత్వాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టడం బాధాకరం. భారత్‌ చేసినట్లుగా ఇక్కడ మేం కూడా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటాయి. అస్థిరత్వం నెలకొంటుంది. దీని వల్ల ప్రతి ఒక్కరు బాధపడాల్సి ఉంటుంది’ అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. 

మహతిర్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కూడా అప్పట్లో తీవ్రంగానే స్పందించింది. ఆ దేశానికి తమ నిరసన తెలిపింది. భారత వంట నూనె వర్తకుల సంఘం కూడా అప్పట్లో మలేషియాకు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌ వ్యవహారంలో పాక్‌కు అనుకూలమైన రీతిలో వ్యవహరిస్తున్న మలేషియా నుంచి పామాయిల్‌ను కొనగోలు చేయొద్దని సభ్యులకు సూచించింది. ఈ మేరకు ముంబయిలో సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయవాద భావాలు అంతర్జాతీయ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ నిర్ణయం సూచిస్తుందని పేర్కొంది. ఇండోనేషియా తర్వాత రెండో అతిపెద్ద పామాయిల్‌ ఉత్పత్తి దేశమైన మలేషియాకు ఇదో పెద్ద కుదుపు అని తెలిపింది.  ఈ నిర్ణయంతో మలేషియా పరిశ్రమ గుండెకు దెబ్బ తగిలినట్టయింది. దీనిపై అప్పటి ప్రధాని మహతీర్‌ స్పందిస్తూ..  పామాయిల్‌ కొనుగోలు చేయకూడదంటూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాము ప్రతిఘటించలేమని వ్యాఖ్యానించారు. మళ్లీ ఆ కొద్దిసేపటికే  సీఏఏపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోపక్క నష్ట నివారణ చర్యల్లో భాగంగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(జనవరి-మార్చి) భారత్‌ నుంచి 49.20 మిలియన్‌ డాలర్ల విలువైన 1,30,000 టన్నుల ముడి చక్కెర కొనుగోలు చేయనున్నట్లు ఎంఎస్‌ఎం మలేషియా హోల్డింగ్స్‌ బెర్హాడ్‌ నిర్ణయించింది. ఆ తర్వాత కూడా మహతిర్‌ వ్యవహార శైలిలో పెద్దగా మార్పురాలేదు. భారత్‌తో ఒకప్పుడు మంచి సంబంధాలు ఉన్న మలేషియా విరోధిగా మారే పరిస్థితిని మహతిర్‌ తీసుకొచ్చారు. ఇటీవల మహతిర్‌ పదవి నుంచి తప్పుకోవడంతో భారత్‌-మలేసియా సంబంధాల పునరుద్ధరణకు కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని