కార్లనే కాదు.. ప్రభుత్వాన్ని నడిపిస్తూ..! 
close
Updated : 15/06/2020 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్లనే కాదు.. ప్రభుత్వాన్ని నడిపిస్తూ..! 

  ఇంధనం పన్నులతో నెట్టుకొస్తున్న సర్కార్లు

 ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తొమ్మిది రోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలే కరోనావైరస్‌ కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారికి ఇది మరింత భారంగా మారింది. ఇప్పుడు చాపకింద నీరులా ఇంధన ధరలు పెరగడం రవాణా రంగం సహా ఇతర రంగాలపై ప్రభావం చూపించనుంది. అసలు ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గితే ఆ ప్రభావం ఎందుకు కనిపించడంలేదు.. 

అసలే జరుగుతోంది..?

భారత్‌లో చమురు ధరలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించారు. అంటే అక్కడ ధరలు తగ్గితే.. ఇక్కడ కూడా ఆ ప్రభావంతో ధరలు పతనం అవ్వాలి. కానీ, అలా జరగడంలేదు. గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పతనం అయ్యాయి. కానీ, మన మార్కెట్లలో ఆ స్థాయి తగ్గింపు కనిపించలేదు. పైగా గత తొమ్మిది రోజుల నుంచి మాత్రం క్రమం తప్పకుండా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 82 రోజుల విరామం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. పైగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు జూన్‌ 1 తర్వాత నుంచి మళ్లీ తగ్గుతున్నాయి. 

పెరుగుదల ఎందుకు..?

భారత్‌లో చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణ వదులుకోవడం అనేది వాస్తవ పరిస్థితుల్లో కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని వినియోగదారుడితో పంచుకొంటారు. అదే ధరలు పతనమైన సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం పన్నులను పెంచుతుంది. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుంది. చివరికి ఉన్న ధరలను కొనసాగించడమే వినియోగదారుడికి పెద్ద ఊరడింపు అన్న పరిస్థితి కలుగుతుంది. గత ఫిబ్రవరి నుంచి ఇదే జరిగింది. ఇంధన ధరలపై నియంత్రణను వదులుకున్నాక కూడా అంతిమంగా అత్యధిక లాభం ప్రభుత్వాలకే వెళ్తోంది. కొంత ఇంధన కంపెనీలకు చేరుతోంది. 

గతంలో ఇలా.. 

గతంలో ప్రభుత్వం చమురు ధరలను పూర్తిగా నియంత్రించేది. వీటితోపాటు కిరోసిన్‌, ఎల్‌పీజీ ధరలు కూడా ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. 2002లో తొలిసారి విమానాలకు వినియోగించే ఏటీఫ్‌పై నియంత్రణను వదులుకొంది. ఆ తర్వాత 2010లో పెట్రోల్‌పై.. 2014లో డీజిల్‌పై నియంత్రణను ప్రభుత్వం వదులుకొంది. కిరోసిన్‌, ఎల్‌పీజీల ధరల నియంత్రణను మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకొంది.  

సాంకేతిక ఇబ్బదులు..

భారత్‌లోని చమరు సంస్థలు అన్నిరకాల ముడిచమురును ప్రాసెస్‌ చేయలేవు. ముడి చమురులో కూడా సోర్‌గ్రేడ్‌, స్వీట్‌ గ్రేడ్‌ రకాలు ఉంటాయి. సోర్‌గ్రేడ్‌లో సల్ఫర్‌ శాతం ఎక్కువగా ఉండగా.. స్వీట్‌ గ్రేడ్‌లో 0.5శాతం కంటే తక్కువ ఉంటుంది. స్వీట్‌ గ్రేడ్‌ను బ్రెంట్‌ క్రూడ్‌ అంటారు.  

మార్చిలో ధరలు ఎందుకు తగ్గలేదు..?

ఫిబ్రవరిలో ముడిచమురు ధర బ్యారెల్‌ 55 డాలర్లు ఉండగా.. అది మార్చి ప్రారంభానికి 35డాలర్లకు పతనమైంది. మార్చి చివరి నాటికి 20 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని మళ్లీ 37 డాలర్ల వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్న దాదాపు 82 రోజుల పాటు దేశీయంగా  ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీనికి తోడు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని రెండు సార్లు పెంచింది. మార్చి మొదటి వారంలో ఒక సారి.. మే5వ తేదీన మరోసారి పెంచింది. మే5వ తేదీన అయితే పెట్రోల్‌ లీటర్‌పై రూ.13, డీజిల్‌పై రూ.10 చొప్పున పన్నులను పెంచింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు కూడా పన్నులు పెంచాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎక్సైజ్‌ డ్యూటీ పెంచామని.. అయినా ఈ పెంపు భారం ప్రజలపై పడదని కేంద్రం పేర్కొంది. దీంతో కొత్తగా జేబులో నుంచి డబ్బు కట్టడం లేదుగా అనుకొని ప్రజలు కూడా తేలిగ్గా తీసుకొన్నారు. కానీ, అంతర్జాతీయ ధరలు పెరుగుతుండటంతో ఆ ఎక్సైజ్‌ డ్యూటీ ప్రభావం ఇప్పుడు  కనిపిస్తోంది. 

పన్ను శాతం అంతా..!

భారత్‌లో కేర్‌ రేటింగ్స్‌ అంచనా ప్రకారం ఫిబ్రవరి మొదటి నాటికి పెట్రోల్‌పై దాదాపు 107శాతం, డీజిల్‌పై 69శాతం పన్నులు వసూలు చేశారు. వీటిల్లో ఎక్సైజ్‌, వ్యాట్‌ రెండూ ఉన్నాయి. ఆ తర్వాత తొలిసారి మార్చిలో పన్నులు పెంచాక అది పెట్రోల్‌పై 134శాతం, డీజిల్‌పై 88శాతానికి చేరింది. రెండోసారి మేలో పన్నులు పెంచాక అది పెట్రోల్‌పై 260శాతం, డీజిల్‌పై 256 శాతానికి చేరింది.  అదే జర్మనీ, ఇటలీలో 65శాతం, బ్రిటన్‌లో 62శాతం, జపాన్‌లో 45శాతం, అమెరికాలో దాదాపు20శాతం మాత్రమే ఉంటున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని