భారతీయుడు-2 సెట్స్‌లో ఘోర ప్రమాదం
close
Updated : 20/02/2020 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారతీయుడు-2 సెట్స్‌లో ఘోర ప్రమాదం

ముగ్గురు మృతి

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారతీయుడు-2 సినిమా సెట్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సినిమా చిత్రీకరణలో భాగంగా చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్స్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి  క్రేన్‌  తెగిపడి టెంట్‌పై పడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌  ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను చెన్నైలోని పునమలై ప్రధాన రహదారిలో గల సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం నుంచి సెట్స్‌ పనులను దర్శకుడు శంకర్‌, కమల్‌హాసన్‌ పరిశీలించి వెళ్లారు.  

ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో 1996లో విడుదలై బ్లాక్‌బ్లాస్టర్‌ విజయం సాధించిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా భారతీయుడు-2 చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌, సిద్ధార్థ, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌కరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రమాదం నా మనసుని కలిచివేసింది: కమల్‌హాసన్‌

సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై కమల్‌హాసన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఈ ఘటన నా మనసుని కలిచివేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం. నా బాధ కన్నా వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ’’ అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుంటుబాలకు సానుభూతి తెలిపారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని