close
Array ( ) 1

తాజా వార్తలు

ఆవేదనలో కోలీవుడ్‌!

క్రేన్‌ కూలిన ఘటనతో విషాదఛాయలు

ప్రశ్నార్థకంగా మారిన కార్మికుల భద్రత

పునరావృతమవుతున్న ప్రమాదాలు

కూలిన క్రేన్‌ (పాత చిత్రం)

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఈవీపీ ఫిలింసిటీలో క్రేన్‌ కుప్పకూలిన ఘటన కోలీవుడ్‌లో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటన కార్మికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. కమల్‌ చెప్పినట్లు.. బడ్జెట్‌, కలెక్షన్ల పరంగా రూ.200 కోట్లు, రూ.500 కోట్లు అని కాలరెగరేస్తున్న చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటనలు జరగడం నిజంగానే ఆవేదన కలిగిస్తోందని చిత్ర పరిశ్రమ పేర్కొంటోంది. ఎన్నో కలలతో విహరిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డలు ఎవరి తప్పిదానికో ఏకంగా ప్రాణాలు కోల్పోతుండటం ఆగ్రహావేశాలు తెప్పిస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటనపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు సినీ పెద్దలు అనుసరించాల్సిన విషయాలుగానే కనిపిస్తున్నాయి.

 

అనేక ఘటనలు..

కోలీవుడ్‌లో ఈ తరహా ఘటనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇక ఈవీపీ ఫిల్మ్‌ సిటీలోనే ఇప్పటికే పలుమార్లు ఇలాంటి పలు ప్రమాదాలు చోటుచేసుకోగా, వేర్వేరు ఘటనల్లో మొత్తం ఏడుగురి వరకు ప్రాణాలు కోల్పోయినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పూందమల్లి సమీపంలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీకి తగిన అనుమతులు కూడా లేవని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇది 2012లో ఈవీపీ థీమ్‌ పార్క్‌గా మొదలైంది. 2012 ఏప్రిల్‌లో ఇక్కడి థీమ్‌ పార్క్‌ల రాట్నంలో ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. అదే ఏడాది సెప్టెంబరులో స్విమ్మింగ్‌పూల్‌లో చిన్నారి జారి పడగా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. సెప్టెంబరులో జరిగిన మరో ప్రమాదంలో అక్టోపస్‌ రాట్నంలో జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొంత కాలం తర్వాత ఆ థీమ్‌ పార్క్‌ను మూసివేశారు. ఆ తర్వాతే ఈవీపీ ఫిల్మ్‌ సిటీగా మారింది.

మృతులు కృష్ణ, చంద్రన్‌, మధులకు అంజలి

బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ..

2017లో ఇక్కడ రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ సినిమా కోసం రూ.5 కోట్లతో ఓ సెట్‌ ఏర్పాటు చేశారు. ఈ సెట్‌ నిర్మాణ పనుల్లో మైఖెల్‌ అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రజనీకాంత్‌ కూడా సంతాపం ప్రకటించారు. ఇక ఇదే ఫిల్మ్‌ సిటీలోనే కమల్‌హాసన్‌ హోస్ట్‌ చేస్తున్న ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ను కూడా ఏర్పాటు చేశారు. రెండో సీజన్‌ సమయంలో ఇంట్లోని ఓ ఏసీకి మరమ్మతు చేస్తుండగా మెకానిక్‌ గుణశేఖరన్‌ జారి కింద పడి గాయపడ్డాడరు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక అట్లి దర్శకత్వంలో విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ సినిమా కోసం ఇక్కడ ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో చిత్రీకరణ జరుగుతుండగా క్రేన్‌లోని ఫోకస్‌ లైట్‌ సెల్వరాజ్‌ అనే కార్మికుడి తలపై పడింది. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాదాపు నాలుగు నెలల పాటు చికిత్స పొందిన అనంతరం అతను మృతి చెందాడు. ఇక తాజాగా అదేచోట ‘ఇండియన్‌ 2’ చిత్రీకరణలో భాగంగా క్రేన్‌ కుప్పకూలి ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా అదేచోట ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు, సహాయ దర్శకులు సైతం ఆందోళన చెందుతున్నారు.

మౌనం పాటిస్తున్న మాయతిరై చిత్ర బృందం

అంజలి ఘటించిన చిత్ర బృందం..

ఇదిలా ఉండగా ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ శుక్రవారం మళ్లీ మొదలైంది. దర్శక బృందం, నటీనటులు, కార్మికులు... అందరూ స్పాట్‌కు చేరుకున్నారు. అయితే ఎప్పటిలా అక్కడ సందడి కనిపించలేదని సమాచారం. అందరూ మౌనంగానే ఉన్నారు. షూటింగ్‌కు ముందు రెండు నిమిషాల పాటు మృతులకు నివాళిగా వారు మౌనం పాటించారు. ఇదిలా ఉండగా శ్రీ శంకర నారాయణ చాముండేశ్వరి మూవీస్‌ బ్యానరుపై అశోక్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘మాయతిరై’ చిత్ర బృందం వారి షూటింగ్‌ స్పాట్‌లో అంజలి ఘటించింది. క్రేన్‌ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఏదేమైనప్పటికీ పునరావృతమవుతున్న ఈ ఘటనలు కార్మికులు, వారి కుటుంబీకుల గుండెలో భయాందోళనలు కలిగిస్తోంది. ఎన్నో ఆశలతో, కలలతో వస్తున్న కళాకారులకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేక్షకులు సైతం కోరుతున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.