‘పెదరాయుడు’ గురించి ఈ విశేషాలు తెలుసా?
close
Updated : 15/06/2020 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెదరాయుడు’ గురించి ఈ విశేషాలు తెలుసా?

బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి పాతికేళ్లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుగు తెరపై ఆవిష్కృతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ‘పెదరాయుడు’ ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో డైలాగ్‌ కింగ్ మోహన్‌బాబు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటితో 25 ఏళ్లు అయ్యింది. పాపారాయుడిగా రజనీకాంత్‌ అద్భుత నటన, పెదరాయుడిగా మోహన్‌బాబు యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగులు, భానుప్రియ, సౌందర్య అభినయం, కోటి అందించిన సంగీతం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సినిమాలో ఎన్నో విశేషాలు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పెదరాయుడు’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..

తమిళనాడులో పుట్టిన కథ..!!

కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘నట్టమై’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో ‘పెదరాయుడు’ విడుదలయ్యింది. శరత్‌కుమార్‌ కథానాయకుడిగా 1994లో వచ్చిన ‘నట్టమై’ మంచి విజయాన్ని సాధించింది. అయితే, ఆ సినిమా చూసిన తర్వాత ఓ రోజు రజనీకాంత్‌.. మోహన్‌బాబుకి ఫోన్‌ చేసి ‘నట్టమై’ చూడమని, ఆ కథను తెలుగులో తెరకెక్కిస్తే విజయం సాధిస్తుందని తెలిపారు. స్నేహితుడి మాట మేరకు మోహన్‌బాబు వెంటనే ఆ చిత్రాన్ని చూసి కాపీ రైట్స్‌ కొనుగోలు చేశారు. అలా ‘పెదరాయుడు’ చిత్రానికి తొలి అడుగు పడింది.

హిట్‌ చిత్రాల దర్శకుడు

‘ఎమ్‌.ధర్మరాజు ఎం.ఏ’ చిత్రం తర్వాత మోహన్‌బాబు, రవి రాజా పినిశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. కాపీరైట్స్‌ కొనుగోలు చేసిన అనంతరం ఈ కథను రవిరాజా అయితే సరిగ్గా తెరకెక్కించగలరని మోహన్‌బాబు భావించారు. అలా ‘పెదరాయుడు’ డైరెక్షన్‌ రవిరాజాని వరించింది. నటీనటుల సంభాషణలు, హావభావాలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా డైరెక్టర్‌ కథలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సన్నివేశంలో కుటుంబ విలువలను చక్కగా చూపించారు. పాపారాయుడుగా రజనీకాంత్‌, పెదరాయుడుగా మోహన్‌బాబు అతని భార్య లక్ష్మిగా భానుప్రియ, పెదరాయుడు తమ్ముళ్లుగా మోహన్‌బాబు (రాజా), రాజా రవీంద్ర (రవీంద్ర) మెప్పించారు. అలాగే రాజా సతీమణిగా ధనవంతురాలైన అమ్మాయిగా సౌందర్య (భారతి) నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కదిలించిన సంగీతం..!!

కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేపథ్య సంగీతానికి  కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘బావవి నువ్వు భామని నేను’ అనే ప్రేమ గీతం, ‘కదిలే కాలమా’ అనే భావోద్వేగ భరితమైన పాట.. ఇలా ప్రతిదీ సూపర్‌ హిట్టే. కోటి అందించిన స్వరాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే సౌందర్య సీమంతం నేపథ్యంలో సాగే ‘కదిలే కాలమా’ అనే పాట మోహన్‌బాబు అభిరుచికి నిదర్శనం. ఎందుకంటే ఆయనే కావాలని ఆ పాటను సినిమాలో పెట్టించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రతి తెలుగింటిలోనూ ఈ పాట ఎంతగానో వినిపించింది.

పారితోషికం లేకుండా..!!

అన్నదమ్ముల అనుబంధం గురించి తెలియజేసే ఈ కథలో పెదరాయుడు నాన్న పాపారాయుడి పాత్ర కీలకమైనది. సినిమాలో ఈ పాత్ర నిడివి తక్కువ సమయమే అయినా కథకు మూలమిదే. మోహన్‌బాబు కాపీరైట్స్‌ కొనుగోలు చేసిన తర్వాత ‘పాపారాయుడు’ పాత్ర తాను చేస్తానని రజనీ తెలిపారు. నిడివి చాలా తక్కువ ఉంటుంది కదా వద్దు అని చెప్పినా సరే.. రజనీకాంత్‌ మాత్రం ఆ పాత్రలో ఒదిగిపోయారు. అయితే, పాపారాయుడిగా నటించినందుకు రజనీ ఎలాంటి పారితోషికం‌ తీసుకోలేదు.

బాక్సాఫీస్‌ వసూళ్లు..!!

మామూలు చిత్రంగా తెరకెక్కిన ‘పెదరాయుడు’ విడుదల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లతో సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విజయవంతంగా 25 వారాలు ఆడింది. ఈ సినిమా 200 రోజుల ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఇలా ప్రేక్షకుల నీరాజనం, సినీ ప్రముఖుల ప్రశంసలతో మోహన్‌బాబు కెరీర్‌లో ఎప్పటికీ చెప్పుకునే ఓ చిత్రంగా ఇది నిలిచింది.

హిట్‌ డైలాగ్స్‌..!!

1.పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం.. మనకు పుట్టారుగాబట్టి..పెళ్లాన్ని పోషించడం మన బాధ్యత.. మనల్ని నమ్మకొని వచ్చిందిగాబట్టి.. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన ధర్మం.. వాళ్లు మనకు జన్మనిచ్చారుగాబట్టి.. మనల్ని చూసి వాళ్లు గర్వపడాలిగానీ సిగ్గుపడకూడదురా.

2.న్యాయానికి బంధం బంధుత్వం ఒకటే. ఒప్పు చేసినవాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు

3.భారతి.. భార్యాభర్తల సంబంధం గురించి కుటుంబసభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్‌ కవి ఏమన్నారో తెలుసా..!
The Relationship between two persons of a family must be like a fish and water, but it should not like a fish and a fisherman..
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు.. నీకు ఇంగ్లీషులో చెబితే అర్థమౌతుందని చెప్పాను. గ్రామర్‌ తప్పులుంటే మన్నించు.. అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు..! 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని