నేను తట్టుకున్నా.. సుశాంత్‌ వల్ల కాలేదు
close
Updated : 17/06/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను తట్టుకున్నా.. సుశాంత్‌ వల్ల కాలేదు

చిత్ర పరిశ్రమలో బంధుప్రీతిని ఉద్దేశిస్తూ ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం యావత్‌ దేశాన్ని కలచివేసింది. మానసిక ఒత్తిడితో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇది కాకుండా మరేవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. సోషల్‌మీడియాలో సుశాంత్‌ పాత ఇంటర్వ్యూలకు సంబంధించి వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో సుశాంత్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి గురించి మాట్లాడారు. ‘బంధుప్రీతి (నెపోటిజం) ప్రతి చోటా ఉంది. కేవలం బాలీవుడ్‌కే ఇది పరిమితం కాలేదు. నైపుణ్యం ఉన్న నూతన నటీనటుల్ని పోత్సహించకపోతే, వారి ఎదుగుదలకు అడ్డుపడితే సమస్యలు వస్తాయి. ఏదో ఒక రోజు చిత్ర పరిశ్రమ నిర్మాణం మొత్తం పతనం అవుతుంది’ అని ఓ అవార్డు వేడుకలో ఆయన మీడియాతో అన్నారు.

ఇదే వీడియోను ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. చిత్ర పరిశ్రమ నుంచి ఏర్పడ్డ సమస్యల్ని తను తట్టుకున్నట్లుగా.. సుశాంత్‌ తట్టుకోలేకపోయాడని పేర్కొన్నారు. ‘నెపోటిజం మధ్యే నేనూ జీవిస్తున్నా. అయినా సరే రాణించగలుగుతున్నా. నాకు తగిలిన గాయాలు ఎంతో లోతైనవి. కానీ వయసులో చిన్నవాడైన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ వాటిని భరించలేకపోయాడు. బాధల నుంచి పాఠం నేర్చుకుంటే.. తప్పకుండా లేచి నిలబడగలం. మన కలల్ని చంపుకోవాల్సిన అవసరం ఉండదు’ అని ఆయన తన మనసులోని మాటల్ని పంచుకున్నారు.

ఇదే కాకుండా మరో సందర్భంలోనూ సుశాంత్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో జరిగే ఓ పార్టీలకు తనను ఆహ్వానించలేదని, చిత్ర పరిశ్రమ నుంచి తనను వేరు చేసిన భావన కలుగుతోందని చెప్పారు. నెపోటిజంపై కథానాయిక కంగనా రనౌత్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని