close
Published : 09/03/2021 06:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు కొడుకు రైతే అవుతాననే రోజు రావాలి

‘శ్రీకారం’ వేడుకలో చిరంజీవి

‘‘ఒక నటుడి కొడుకు నటుడే అవ్వాలనుకుంటాడు. వైద్యుడి కొడుకు వైద్యుడే అవుతాడు, రాజకీయ కుటుంబాల్లో పిల్లలు రాజకీయాల్లోకే వస్తారు. అలా ఓ రైతు కొడుకు నేను రైతునే అవుతాననే రోజు రావాలి. ఆ రోజు వస్తుందనే నమ్మకం నాకుంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన సోమవారం ఖమ్మంలో జరిగిన ‘శ్రీకారం’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శర్వానంద్‌, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన చిత్రమిది. కిషోర్‌ దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ నెల 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి చిరంజీవి బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ కోసం ఇక్కడికి వచ్చా. మంచి ఆతిథ్యం ఇస్తూ చిత్రీకరణకి అండదండలు అందిస్తున్నారు పువ్వాడ అజయ్‌కుమార్‌. మా ఇంట్లో పెరిగిన బిడ్డ శర్వానంద్‌. తను నాకు మరో రామ్‌చరణ్‌. తొలిసారి నాతో ఒక ప్రకటనలో నటించాడు. ఆ తర్వాత ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లో నటించాడు. సినిమా సినిమాకీ పరిణతి సాధిస్తూ వస్తున్నాడు శర్వానంద్‌. మంచి ఇతివృత్తంతో, యువతరానికి చెప్పాల్సిన సందేశాన్ని వాణిజ్యాంశాలతో చెప్పారు. వ్యవసాయం ఎంత ముఖ్యమో చెబుతూ విలువలతో ఈ సినిమా చేశార’’న్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో రైతే రాజు అనే విధంగా కేసీఆర్‌ పరిపాలన కొనసాగుతోంది. వ్యవసాయం నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ప్రేక్షకాదరణ తప్పక లభిస్తుంది’’ అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘నేను చూసిన మొదటి విజయం ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’. నా విజయానికి శ్రీకారం చుట్టింది చిరంజీవి సారే. ఆయన ఈ వేడుకకి రావడానికి ఒప్పుకోవడంతోనే ఈ సినిమా విజయం ఖాయమైంద’’న్నారు. కార్యక్రమంలో బుర్రా సాయిమాధవ్‌, ప్రియాంక మోహన్‌ , వరంగల్‌ శ్రీను, భరద్వాజ్‌, పెంచల్‌దాస్‌, చెరుకూరి సుధాకర్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని