మనసుకు అక్షరం..ప్రేమకు అమృతం
close
Updated : 07/05/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనసుకు అక్షరం..ప్రేమకు అమృతం

తెలుగు పాటల తోటలో పూసిన సినీ వేమన ఆత్రేయ శతజయంతి నేడు

ఇరువురి చూపులు ఒకటైతే తన్మయత్వం
ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకుంటే ప్రణయం
ఒకరికొకరు గుర్తొస్తే తీయని తలపులు
కొన్ని క్షణాలు దూరమైతే విరహం
ప్రేమించిన వ్యక్తి ఇక దక్కదని తెలిస్తే వేదన...
ఇలా ప్రేమ మనసుల్లో ఎన్నెన్ని కోణాలో...!?
ఈ నిశ్శబ్ద తరంగాలను అక్షరాల మాలగా కూర్చడం
బహుకష్టం. ఇంతటి భిన్న భావాలను ఒడిసిపట్టి
తన కలంలో సిరాగా నింపి, ‘తెలుగు పాట’కు
హృదయాన్ని చిగురింపజేసింది మనసు కవి ఆత్రేయ.
మనసు ముక్కలయ్యే శబ్దాన్ని వినిపిస్తారాయన.
అది అథఃపాతాళంలోకి జారుతున్న
తీరును కళ్లకు కడతారాయన.
మనసు మంటల్లో కాలిపోతున్నప్పుడు చేసే
ఆక్రందనలను పాటగా కూర్చగలరాయన.
మది శిథిలమవుతున్నప్పుడు రాలుతున్న
జ్ఞాపకాల చప్పుడును... గుండెకు చేరుస్తారాయన.
ఎవ్వరికీ అర్థంకానీ మనసునీ... ‘తేట తేట
తెలుగులా, తెల్లవారి వెలుగులా’ అందరికీ
అర్థమయ్యే  పదాలతో ఆవిష్కరించారు
కాబట్టే ఆచార్య ఆత్రేయను తెలుగు సినీ పాటల
పూదోటల్లో పూసిన సినీవేమన అంటారు.

‘ఆచార్య ఆత్రేయ’ అనేది ఆయన కలం పేరు. అసలు పేరు కిళాంబి వెంకట నరసింహా చార్యులు. వారిది ఆత్రేయస గోత్రం. నరసింహా చార్యులులో ‘ఆచార్య’ను, గోత్రంతో కలిపి ‘ఆచార్య ఆత్రేయ’గా మారి సినిమా పాటల్లో మనసును పండించారాయన. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా సూళ్ళురుపేట తాలూకా ఉచ్చూరు(వత్సపురి). ఆ ఊరికి దగ్గరగా ఉన్న మంగళంపాడులో మే7, 1921న సీతమ్మ- కృష్ణాచార్యుల దంపతులకు ఆచార్య ఆత్రేయ జన్మించారు. ఆత్రేయ పెద మేనమామ శ్రీనివాస వరదాచార్యులు తెలుగు పండితుడు. మేనమామ పద్య రచన నేర్పగా, తన మిత్రుడు చెంగలువరాయ పిళ్లై రాసిన పద్యాల మీద అభిప్రాయాన్ని కంద పద్య రూపంలో చిన్నతనంలోనే రాసి తనలోని ప్రతిభ గుభాళింపులను చుట్టూ ఉన్న వారికి పరిచయం చేశారు. ఇంకో విశేషం ఏమంటే ఆయన తన ఆత్మకథ(అసంపూర్ణం)ను (375 పద్యాల్లో) పద్యరూపం లోనే రాశారు. పద్యమన్నా, కవిత్వమన్నా చిన్ననాటి నుంచే ఆయనకు ప్రీతి.
నాటకాలు...నాటికలు
నెల్లూరు మున్సిఫ్‌ కోర్టులో, తిరుత్తరణి సెటిల్మెంట్‌    ఆఫీసులో గుమస్తాగా సేవలందించారు. ‘జమీన్‌ రైతు’   పత్రికలో సహాయ సంపాదకుడిగానూ, ఆంధ్రనాటక కళాపరిషత్తులో వేతన కార్యదర్శిగాను పనిచేశారు. ఇలా ఉద్యోగాలు చేసే సమయానికి ఆత్రేయ నాటకాలు, నాటికలు (ఒకే అంకం ఉండి నిడివి తక్కువ ఉంటే అది నాటిక, అలా కాకుండా ఎక్కువ అంకాలతో పాటు నిడివి ఎక్కువ ఉన్నవి నాటకం) రాశారు. ‘గౌతమ బుద్ధ, అశోక సామ్రాట్‌, పరివర్తన, వాస్తవం, ఎన్జీవో, ఈనాడు, విశ్వశాంతి, కప్పలు, భయం, మనసు-వయసు తదితర నాటకాలు ఆయన మస్తిష్కంలో పుట్టినవే. అంతర్యుద్ధం, అంత్యార్పణ, అశ్వగోషుడు, ఎవరు దొంగ?, ఒక్క రూపాయి, ఓటు నీకే, కళకోసం, చస్తే ఏం?, ఆత్మార్పణ,  కాపాలావాని దీపం, చావకూడదు, తెరచిన కళ్లు, ప్రగతి, మాయ, వరప్రసాదం మొదలైన నాటికలు ఆయన కలంలో ప్రాణం పోసుకున్నవే.
వెండితెరపై పాటలు... మాటలు
నాటక రచనే ఆత్రేయను సినిమా రంగం వైపు నడిపించింది. నాటక రచయితలు సినిమా రచయితలు అవ్వడం ఆనాడు సాధారణమే. ‘వింధ్య రాణి’ రాసిన పింగళి నాగేంద్ర రావు, ‘నాటకం’ రాసిన డి.వి.నరసరాజు... ఇలా ఒకరా ఇద్దరా? ఆనాటి సినీ రచయితలందరూ దాదాపుగా నాటక రంగం నుంచి వచ్చి వెండితెరకు   మెరుగులు అద్దినవారే. నాటక రంగంలో హీరో స్థాయి క్రేజ్‌ రచయితలదే. సంభాషణలకు వన్స్‌మోర్లు వస్తే రచయితకు భవిష్యత్తు ఉందని గుర్తించి... సినిమా దర్శకులు పిలిచి అవకాశాలిచ్చే కాలమది. అలా ఆత్రేయ రాసిన ‘ఎన్జీవో’, ‘కప్పలు’ నాటకాలు పెద్ద హిట్లు. అందులో డైలాగులకు ఎన్నో వన్స్‌మోర్లు పడేవారోజుల్లో. ఆత్రేయలోని ప్రతిభను గమనించిన  ఆనాటి దర్శకులు శ్రీ కె.ఎస్‌.ప్రకాశరావు(దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తండ్రి) ఆహ్వానం మీద తొలిసారిగా 1951లో ‘దీక్ష’ సినిమా కోసం ‘పోరా బాబు పో... పోయి చూడు లోకం పోకడ..’ అనే పాటతో సినీ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి ఆయన తెలుగు ప్రేక్షకులకు దూరమైనంత వరకూ దాదాపుగా 400 చిత్రాలకు పాటలు-మాటలు రాశారు.

మనసే.. మనిషై
సృజనకారుడి మనసులో వేదన ఉంటే అదంతా తన సృజనాత్మక ప్రక్రియ ద్వారా బయటపడుతుంది అంటారు. అది నిజమని ఆత్రేయ జీవితం రుజువుచేస్తుంది. యవ్వనపు తొలినాళ్లలో వీణా వాదనలో నిపుణురాలయిన ఒకామెను ఆత్రేయ ప్రేమించారు. పెళ్లాడాలనుకున్నారు. అయితే ఇద్దరిది ఒకే గోత్రం కావడం వలన, సగోత్రీకురాలిని చేసుకోవడం సమ్మతం కాదు కాబట్టి తండ్రి వారి ప్రేమకు-పెళ్లికి సమ్మతించలేదు. తండ్రి మాటకు ఎదురుచెప్పలేక మనసులో ప్రేమను చంపుకొని గుండెల నిండా విషాదాన్ని నింపు  కొన్నారు ఆత్రేయ. అందుకేనేమో సినిమాల్లో అలాంటి సన్నివేశానికి పాట రాయాల్సి వచ్చినప్పుడు ఆయన కలం భగ్న ప్రేమికుడి మనస్థితికి ప్రతిబింబం అవుతుంది. ‘మనసు గతి ఇంతే! మనిషి బ్రతుకింతే! మనసున్న మనిషికి బ్రతుకులేదంతే.... (ప్రేమనగర్‌ 1971) పాట వినండి... తాగకుండానే విషాదపు నిషా నరనరాల్లోకి ఎక్కి, ఎక్కిల్లొస్తాయి. సముద్రమంత వేదన చిన్న చుక్కగా మారి కనుల రెప్పల మధ్య మసకగా మెరుస్తుంది. అదే పాటలో ‘మనిషికి మనసే తీరని శిక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష’ అన్నప్పుడు ఆయన వేదన అర్థం అయిన భావన కలుగుతుంది. ఆత్రేయ రాసిన పాటలు ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా....(తోడికోడళ్ళు-1957) గీతం కమ్యూనిస్ట్‌ భావజాలానికి నిలువటద్దంలా మారుతుంది. చాలా మంది ఇది శ్రీశ్రీ రాసిందేమో అని  పొరపాటుపడుతుంటారు.
ప్రేయసీ ప్రియుల ప్రణయ గీతాలైతే ఆయన కలం పన్నీటి జలపాతమై దూకుతుంది. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటె, చెలికాడే సరసన ఉంటే...’(ఆత్మబలం1964) అనే గీతం వింటూ ఉంటే మన మీద వర్షం కురుస్తున్నట్టు, ప్రియురాలి కౌగిలి వెచ్చదనంలో చలి కాచుకుంటున్నట్టు శరీరానికి గిలిగింతలు పూస్తాయి.
‘నీవులేక వీణ పలకలేనన్నది’(డాక్టర్‌ చక్రవర్తి 1964)గీతం వింటుంటే... ప్రేయసి పిలుస్తున్నట్టు, మాటికి మాటికి మనల్నే తలుస్తున్నట్టు మనసుకు సందేశాలొస్తాయి.
‘బలే బలే మొగాడివోయ్‌..’ (మరో చరిత్ర 1978) పాట శ్రవణాలను తాకుతుంటే... సిగ్గు తెరలని తొలగించుకున్న ఆధునిక మగువ ప్రియుడితో ముచ్చట ఆడినట్టు లేదూ?
...ఇలా ఒకటేమిటి? ప్రేమ, రక్తి, భక్తి... అన్నీ భావనలు ఆయన కలంలో అక్షరాలుగా పుడతాయి.‘శేషశైలావాస శ్రీవేంకటేశ(శ్రీ వెంకటేశ్వర మహత్యం 1960)’ గీతం వింటే భక్తిపారవశ్యం కలగకుండా ఉంటుందా? ‘నువులేకా అనాథలం...’(షిర్డిసాయిబాబా మహత్యం 1986) పాట కదా సాయిని తెలుగువారి ముక్కోటి దేవతల్లో ఒక దేవుణ్ణి చేసింది.

కరోనా కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో... బంధాలు, బంధుత్వాలు నిలువునా తెగిపోతుంటే... ‘ఈ జీవన తరంగాలలో (జీవనతరంగాలు 1973)’ పాట హృదయానికి వినిపించక మానదు.

దర్శకత్వం చేసి...
ఆత్రేయ తన స్వీయ దర్శకత్వంలో ‘వాగ్దానం’ అనే చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడు. ఇందులో పాటలు దాశరధిగా ప్రసిద్ధులైన దాశరధి కృష్ణమాచార్య రాయడం విశేషం. రసజ్ఞులైన ప్రేక్షకుల చేత ఎన్నోబిరుదులు పొందిన ఆచార్య ఆత్రేయ 1989వ సంవత్సరం అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ఆయన చనిపోయిన (1989) మరుసటి సంవత్సరం అంటే... 1990లో అక్షర వాచస్పతి కొంగర జగ్గయ్య, సినీపరిశోధకులు పైడిపాల కలసి మనస్విని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున ఆత్రేయ లభ్య రచనలు అన్నీ కలిపి సంకలనంగా తెచ్చారు. తెలుగువారికి ఆత్రేయ అక్షరాల ఆస్తిని అందించారు.

మాటలే మాలలుగా...
‘ప్రేమనగర్‌’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘మాంగల్య బలం’, ‘మనుషులు మమతలు’, ‘విచిత్ర బంధం’, ‘అర్ధాంగి’, ‘అదృష్టవంతులు’, ‘ఆత్మబలం’, ‘చిలిపికృష్ణుడు’, ‘బంగారు బాబు’, ‘బాబు’, ‘పునర్జన్మ’, ‘చక్రవాకం’, ‘మంచివాడు’ తదితర సినిమాలకు మాటలు పలికించారు. సూపర్‌హిట్లు అందుకున్నారు. ఆత్రేయ మాటలకంటే... పాటలే పదునైననవి. అందుకే తెలుగువారి గుండెల్లోకి దూసుకెళ్లాయి. ‘‘ఆత్రేయ.. పాట రాసి ప్రేక్షకులను, రాయక(ఆలస్యంగా రాసి) నిర్మాతలను ఏడిపిస్తారు’’ అని ఆయనను ఎవరైనా అంటే.. ‘రాసేటప్పుడు నేనెంత ఏడుస్తానో ఎవరికి తెలుసు?’ అని ప్రశ్నించేవారు ఆత్రేయ. ఈయన పాటను తలచుకున్నప్పుడు సంగీత దర్శకులు కె.వి.మహదేవన్‌ని తప్పక  స్మరించుకోవాలి. ఎందుకంటే ఆత్రేయ పాటను అజరామరం చేసే బాణీలు కట్టిందే ఆయనే. అమావాస్య రోజు పుట్టిన మనసుకవి(అమావాస్య ధనుర్లగ్నం, భరణీ నక్షత్రం) తెలుగు పాటకు వెన్నెల వెలుగులద్దారు. ఆత్రేయ పుట్టి నేటి (శుక్రవారం)కి వంద సంవత్సరాలు. ఇంకో నూరేళ్లైనా ఆయన పాట మన మనసుల్లో వెలుగులై విరబూస్తేనే ఉంటుంది. ఎందుకంటే మనిషున్నంత వరకూ మనసు ఉంటుంది. ఆ మనసులో ఒకరికి చోటుంటుంది. ఆ చోటులో ఎన్నో భావోద్వేగాల అలలుంటాయి. ఆ అలలన్నీ అక్షరాలను తొడుక్కుని మనముందు సాక్ష్యాత్కరించడానికి ఆత్రేయ పాటలను వెదుక్కుంటాయి కాబట్టి.

- కమల్‌రెడ్డి, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని