మన దేహమే ఓ గొప్ప ఫైటర్‌: Anil Ravipudi - Anil Ravipudi interview
close
Published : 11/05/2021 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మన దేహమే ఓ గొప్ప ఫైటర్‌: Anil Ravipudi

తొలి సినిమాతోనే ఈ ‘పటాస్‌’ మాస్‌ అనిపించాడు... యువ దర్శకుడు అనిల్‌   రావిపూడి. ఆయన సినిమాలో ఫన్‌ అయినా... ఫ్రస్ట్రేషన్‌ అయినా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవల్సిందే. తెరపై హీరోయిజాన్ని   ఆవిష్కరించడంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనేంతగా ప్రభావం చూపించారు. అందుకే తక్కువ సమయంలో స్టార్‌ దర్శకుడు అనిపించుకున్నారు. ‘ఎఫ్‌3’ సినిమాతో బిజీగా ఉన్న సమయంలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో పోరాటం చేసి కోలుకున్న అనిల్‌ రావిపూడి ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టేనా?
నెగిటివ్‌ వచ్చాక కూడా వైద్యులు మనకు వచ్చిన  లక్షణాల్ని, జరిగిన చికిత్సని బట్టి మందులు ఇస్తారు. వాటిని నెల పాటు వాడాలి. కొవిడ్‌ తర్వాత రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుందట. అందుకే వైద్యులు చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటిస్తూ, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా.

మీకు పరీక్షల్లో పాజిటివ్‌ అని తెలిశాక భయపడ్డారా?
కొంచెం గందరగోళంగా అనిపించింది. నేను ధైర్యంగానే ఉన్నాను కానీ, ‘ఇంట్లో కుటుంబం ఉంది, వాళ్లకీ వస్తుందా? ఏంటి?’ అనే ఆలోచనలు మొదలయ్యాయి. ఐదారు రోజులు వైద్యులు ఇచ్చిన మందులు వాడాక కానీ, జ్వరం తగ్గలేదు. 12 రోజుల తర్వాత నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. మానసికంగా దృఢంగా ఉంటే... మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ మనకు అండగా ఉంటుంది. కరోనా విషయంలో సొంత వైద్యం వద్దు. ఫేస్‌బుక్‌లో చూసో,    వాట్సాప్‌లో వచ్చిందనో ఏవి పడితే ఆ మందులు వాడకూడదు.

ఎప్పుడూ మాస్క్‌తోనే కనిపించేవారు. మీరు ఎలా దీని బారినపడ్డారు?
‘ఎఫ్‌3’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కోసమని చెన్నై వెళ్లా. అక్కడ ఓ హోటల్‌లో బస చేశాం. హోటల్‌కి ఎవరెవరు వచ్చి వెళుతుంటారో తెలియదు కదా, అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు, మనం అజాగ్రత్తగా మెలిగి ఉండొచ్చు. మొదట నా స్నేహితుడు సాయి, ఆ తర్వాత నేను కరోనా బారిన పడ్డాం. నా భార్య, పిల్లలకీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడంతా కోలుకుంటున్నాం.

‘ఎఫ్‌3’ ఎంత వరకు పూర్తయింది?
సగం సినిమా పూర్తయింది. ఏప్రిల్‌ 15 నుంచి మైసూర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టాలనుకున్నాం. 14నే నాకు పాజిటివ్‌ వచ్చింది. మా ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ఈ షెడ్యూల్‌ చేస్తే 80 శాతం పూర్తవుతుంది.

బాలకృష్ణ, మహేష్‌బాబుతో సినిమాలు మొదలుకొని ‘రాజా ది గ్రేట్‌’ సీక్వెల్‌ వరకు పలు సినిమాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ దేనిపై దృష్టిపెట్టారు?
మొదట ప్రేక్షకులంతా ఈ సెకండ్‌ వేవ్‌ ఒత్తిడి నుంచి బయట పడేలా ‘ఎఫ్‌3’తో కడుపుబ్బా నవ్వించాలనేది నా ఆలోచన. బాలకృష్ణ గారితో చేయాల్సిన సినిమా అంటారా? ఇప్పటికే స్క్రిప్ట్‌ సిద్ధమైంది. అదొక భిన్నమైన జోనర్‌ సినిమా అవుతుంది. అది మల్టీస్టారర్‌ సినిమా కాదు. అలాగే మహేష్‌ సర్‌తో సినిమాకీ కథ ఓకే అయ్యింది. త్రివిక్రమ్‌గారితో సినిమా ముందుకొచ్చింది కాబట్టి, అది పూర్తయిన తర్వాత మా ప్రాజెక్టు ఉంటుంది. ‘సరిలేరు నీకెవ్వరు’కి పూర్తి భిన్నమైన కథతో ఆ సినిమా ఉంటుంది. ‘రాజా ది గ్రేట్‌’కి సీక్వెల్‌ ఆలోచన కూడా ఉంది. ‘ఎఫ్‌3’ తర్వాత చేయబోయే సినిమా ఏమిటనేది ఒక నెలలో చెబుతా.

దేహమే బలం.. పోరాటం చేయగలం

‘‘పనులే కాదు, ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలని... ఆరోగ్యమే మహా భాగ్యం అని కరోనా మరోసారి గుర్తు చేసింది. ఎంత బిజీగా ఉన్నా...  శారీరక ధృఢత్వంపైన, ఆహారపు అలవాట్లపైన దృష్టిపెట్టాలి. అప్పుడే మనకు ఏ కష్టం వచ్చినా పోరాటం చేయగలం. ప్రపంచంలో అన్ని వ్యాక్సిన్‌లు, మెడిసిన్‌ కంటే కూడా మన దేహమే గొప్ప ఫైటర్‌. మన దేహాన్ని మనం కరెక్టుగా ఉంచుకోగలిగితే అదే పెద్ద మెడిసిన్‌. కరోనా విషయంలో సానుకూల ధోరణి అవసరం. చనిపోతున్నవాళ్ల కంటే కూడా  కోలుకుంటున్నవారే ఎక్కువ కదా, అందుకే భయాల నుంచి బయటకి వచ్చి జాగ్రత్తలు తీసుకుంటూనే పోరాటం చేయడం అలవాటు చేసుకోవాలి’’

‘‘ప్రపంచంలో మనం బాగుండాలని కోరుకునే మొట్ట మొదటి వ్యక్తి... అమ్మ. మా అమ్మ పేరు.. అనంత లక్ష్మి. మనం ఎంత దూరంలో ఉన్నా సరే..వాళ్ల మనసులు మన చుట్టూనే తిరుగుతుంటాయి.  స్వార్థం ఎరుగని ప్రేమ మూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మన కళ్ల ముందున్న దైవాలు అమ్మానాన్నలు. వాళ్లు బాగుంటే మనం బాగుంటాం. అందుకే అమ్మానాన్న ఆరోగ్యాల గురించి ఈ విపత్కర సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నా తల్లిదండ్రులకి ఇద్దరికీ వ్యాక్సిన్‌ వేయించా’’.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని