RRR విడుదలకి ఇప్పటికీ అవకాశం ఉంది: NTR
close
Published : 13/05/2021 06:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR విడుదలకి ఇప్పటికీ అవకాశం ఉంది: NTR

అక్టోబరు నెలలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విడుదలకి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. తొలి దశ కరోనా తర్వాత సెట్‌కి వెళ్లి రాత్రింబవళ్లు పనిచేసినట్టు తెలిపారు. ఆయన రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్న చిత్రమిది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రెండో దశ కరోనా ఉద్ధృతితో ఈ సినిమా చిత్రీకరణకి మరోసారి బ్రేకులు పడ్డాయి.  ఇటీవల ఎన్టీఆర్‌ కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. కరోనా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని ఏ రకంగా ప్రభావితం చేయలేదని, తాము పని చేసే వేగమే మారిందని చెప్పారు. ఎన్టీఆర్‌ చెప్పిన మరిన్ని వివరాలివీ...

సినిమా కోసం నేను మరింత నిర్దుష్టమైన శారీరక రూపంతో కనిపించాల్సి వచ్చింది. అందుకోసం దాదాపు 18 నెలలపాటు తీవ్రమైన శిక్షణ తీసుకున్నా. ఈ సినిమాకి ముందు 71 కిలోలు ఉన్నా. దీని కోసం  అదనంగా తొమ్మిది కిలోల కండరాల్ని పెంచాల్సి వచ్చింది.   సాంకేతికంగా 19 నెలల చిత్రీకరణ జరిగింది. ఊహించిన స్థాయిలో ఇది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆ సమయం అవసరమే. ఇందులో పోరాట ఘట్టాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. దర్శకుడు రాజమౌళి ప్రతి సన్నివేశాన్నీ పరిపూర్ణతతో తీర్చిదిద్దారు. 2001లో మేం కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టాం. ఏదో సాధించాలనే పెద్ద ఆలోచనలు ఆయనలో కనిపించేవి. ఆ విషయంలో ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు.

  సినిమాలోని పాత్రలకి సంబంధించిన కథల్ని ఇప్పుడు మా పిల్లలకి చెబుతున్నా. మన జ్ఞాపకాల ద్వారా ఆ పాత్రలు అలా జీవిస్తూ ఉంటాయి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం స్థానికంగా నిజ జీవిత కథానాయకులు. మేం పెరుగుతూ వాళ్ల గురించి కొంచెం కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు సినిమా కోసం వారి జీవితాల గురించి మరింతగా తెలుసుకోవాల్సి వచ్చింది. వాళ్లు సాధించిన విజయాల గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చూపించడమే మా పని. అందుకోసం మా బృందం అంతా కూడా పెద్దయెత్తున కసరత్తులు చేసింది. నేను, రామ్‌చరణ్‌ దీని కోసం కలిసి రావడం ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని ఓటీటీలో విడుదల చేయాలని మేమెప్పుడూ అనుకోలేదు. సమష్టిగా కలిసి పెద్ద తెరపై చూస్తూ ఆస్వాదించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అలాంటిదే. మేం సినిమా హాళ్ల పునః ప్రారంభం గురించి వేచి చూస్తాం. భారతీయ ప్రేక్షకులకు సినిమా అంటే ప్రాణం. వాళ్లు సినిమాలు చూడటానికి తిరిగి వస్తారని మాకు తెలుసు. ఆ నమ్మకం మాకు ఉంది.  

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తర్వాత  కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాక ‘కె.జి.ఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి సినిమా చేస్తా. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తరహాలో భారతీయ భాషల్లో ప్రయాణించే చిత్రం అవుతుంది. పలు భాషల్లో విడుదలవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. నేను విధిని బలంగా నమ్ముతా. నటుడిగా కథలో భాగం కావాలని కోరుకునే వ్యక్తిని.  దర్శకత్వం గురించి ఆలోచన లేదు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్‌ని సృష్టించాలనే ఆలోచన మాత్రం ఉంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని