maruthi: భయం వద్దు... ఇది తాత్కాలికమే - director maruthi special interview
close
Published : 17/05/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

maruthi: భయం వద్దు... ఇది తాత్కాలికమే

జూన్‌ మధ్యలో చిత్రీకరణలు ప్రారంభం కావొచ్చు!

లాక్‌డౌన్‌తో మరోసారి చిత్రసీమ స్తంభించిపోయింది. గతేడాది తరహాలోనే దాదాపు అందరూ ఇంటి పట్టున ఖాళీగా గడుపుతున్నారు. దర్శకులకి ఇలాంటి విరామ సమయంలోనూ చేతినిండా పనే. పాత కథలకి మెరుగులు దిద్దుకుంటారు. కొత్త కథలపైనా దృష్టి పెడతారు. మారుతి అయితే కథలు రాసుకోవడంతోపాటు... సరదాగా బొమ్మలూ గీస్తున్నారు. ఆయన వాట్సాప్‌ స్టేటస్‌లో చిరంజీవి బొమ్మని మెరుపు వేగంతో గీస్తున్న వీడియో కనిపించింది. ఈ సందర్భంగా ‘ఈనాడు సినిమా’ ఆయన్ని పలకరించింది.
ఈ విరామంలో పెయింటింగ్స్‌పై దృష్టిపెట్టారా?
నేను స్క్రిప్ట్‌లే రాసుకుంటున్నా. మా అమ్మాయేమో ఎప్పుడూ పెయింటింగ్స్‌తోనే గడుపుతూ ఉంటుంది. తనని చూసినప్పుడు నాకు నా గతం గుర్తుకొస్తుంటుంది. నా పాత కళ నాలో అలాగే ఉందా? లేదా? అని అప్పుడప్పుడు చెక్‌ చేసుకుంటుంటా. స్క్రిప్ట్‌ రాసుకుంటూ మధ్యలో చిరంజీవి గారి బొమ్మ గీయాలనిపించి పెన్సిల్‌ పట్టుకున్నా. అలా వచ్చిందే ఈ బొమ్మ.
వెబ్‌ సిరీస్‌ల కోసమే స్క్రిప్ట్‌లు రాస్తున్నారా?
‘త్రీ రోజెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ కోసం మూల కథని ఇచ్చానంతే. దాని చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం నేను రాస్తున్నవి సినిమా కథలే. పూర్తిగా కథపైనే దృష్టిపెట్టే ఇలాంటి నాణ్యమైన సమయం మళ్లీ దొరకదు కదా. భవిష్యత్తులో నాణ్యమైన సినిమాలు తీయకపోతే కష్టం. మంచి కాన్సెప్ట్‌లు వస్తున్నాయి. ఈమధ్య చూసినవాటిలో ‘సినిమా బండి’ బాగా తీశారు అనిపించింది. అలా మంచి స్క్రిప్టులతో, మనమూ మరింత బాధ్యతతో సినిమాలు చేయాలి. దానిపైనే నా దృష్టంతా.

ప్రత్యేకంగా ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని రాస్తున్న కథలేమైనా ఉన్నాయా?

నా పనితీరు ఎప్పుడూ అలా ఉండదు. ముందు కథపైనే నా దృష్టి ఉంటుంది. ఆ కథే నన్ను ఆత్రుతకి గురిచేస్తూ ముందుకు తీసుకెళుతుంది. పూర్తయ్యాక ఈ కథ ఎవరికైతే బాగుంటుందా అని ఆలోచించి, వాళ్ల దగ్గరికి వెళతాను. ఇప్పటికే నేను చాలా కథలు సిద్ధం చేసుకున్నా. వాటిని మరోసారి జాగ్రత్తగా చూసుకుని హీరోల దగ్గరికి వెళతా.

‘పక్కా కమర్షియల్‌’ ఎంత వరకు వచ్చింది?
40 శాతం వరకు పూర్తయింది. మంచి రోజులు మొదలయ్యాయనే ఉత్సాహంతో వేగంగా చిత్రీకరణ చేశాం. కోర్టు సన్నివేశాలు చాలానే తీశాం. మళ్లీ చిత్రీకరణ మొదలైనా అదే వేగంతో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం. కరోనా మరోసారి అందరినీ ఇంట్లో కూర్చోబెట్టింది.

‘పక్కా కమర్షియల్‌’ కోర్ట్‌ రూమ్‌ డ్రామానా?

తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఓ మంచి కథ ఇది. కోర్ట్‌ రూమ్‌ నేపథ్యం ఉంటుంది. పూర్తిస్థాయి వినోదంతోపాటు... మంచి సందేశం, భావోద్వేగాల మేళవింపుగా చాలా బాగుంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కథానాయకుడు గోపీచంద్‌ కొత్తగా కనిపిస్తాడు. రాశిఖన్నా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా  కంటే పది రెట్లు ఎక్కువ వినోదం పంచుతుంది. ప్రేక్షకులంతా ఆ పాత్రని చూసి షాక్‌ అవుతారు. ఆ అమ్మాయి పాత్ర అంత బాగా కుదిరింది. సత్యరాజ్, రావు రమేష్‌... ఇలా నా బృందమంతా ఇందులో కనిపిస్తుంది. కచ్చితంగా ఓ మంచి సినిమా అవుతుంది.

మళ్లీ చిత్రీకరణలు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి?
జూన్‌ మధ్యలో చిత్రీకరణలు మొదలవుతాయి. ఆ నమ్మకం నాకు బలంగా ఉంది. వాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి వస్తోంది కాబట్టి త్వరలోనే మనం మళ్లీ పనులు మొదలుపెడతాం అని నమ్ముతున్నా.
గతేడాది లాక్‌డౌన్‌కీ, ఇప్పటి పరిస్థితులకీ మీరు గమనించిన తేడాలేమిటి?  
గత లాక్‌డౌన్‌ సమయంలో ఇలాగే అందరం ఇంట్లో కూర్చున్నా ఎంతో కొంత జీవితాన్ని ఆస్వాదించాం. ఈ లాక్‌డౌన్‌ మాత్రం ప్రతి ఇంట్లోనూ ఒక రకమైన బాధ. ఫలానా తెలిసినవాళ్లకి కరోనా వచ్చిందనో, లేదంటే సీరియస్‌ అయ్యి ఇబ్బంది పడుతున్నారనో ఇలా ఏదో ఒక బాధ కలిగించే విషయం వింటున్నాం. ఈసారి ఎవరికివాళ్లు లాక్‌డౌన్‌ అయిపోయాం. ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కనిపిస్తోంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా తాత్కాలికమే. త్వరలోనే కరోనా తగ్గుతుంది. పరిస్థితులు దారిలోకి వస్తాయి.

చాలా వేగంగా గీసేశారు? చిరంజీవి బొమ్మే అలా గీస్తారా లేక ఏదైనా అంతేనా?

నేను వేగంగానే బొమ్మలు గీస్తాను. ఆఫీసులో కూర్చున్నప్పుడు ఎవరితోనైనా ఎక్కువసేపు ఫోన్‌ మాట్లాడుతున్నా సరే... పక్కనే ఉన్న పెన్సిల్‌ తీసుకుని అలా ఏదో ఒక బొమ్మ గీస్తూనే ఉంటా. చెయ్యి అప్రయత్నంగా అలా వెళ్లిపోతుంటుంది. యానిమేషన్‌ చేసి వచ్చాను కదా. నా సినిమాల పేర్లు నేనే రాసుకుంటుంటా. అప్పట్లో యానిమేషన్‌ వైపు వెళ్లాలంటే ఆర్ట్‌ తెలియాల్సిందే. 2డీ యానిమేషన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ చేసినవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. అలా సినిమా రంగంలోకి రాకముందు నుంచే నాకు చిత్రలేఖనంపై పట్టుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని