Cinema: అటు.. ఇటైనా ఫరవాలేదోయ్‌ కొత్త కబురు వినిపిస్తారోయ్‌!
close
Published : 19/05/2021 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema: అటు.. ఇటైనా ఫరవాలేదోయ్‌ కొత్త కబురు వినిపిస్తారోయ్‌!

విడుదల కావల్సిన సినిమాలు. పూర్తి చేయాల్సిన సినిమాలు. కొత్తగా ప్రారంభించాల్సిన సినిమాలు... - ఇలా దాదాపు కథానాయకుల ముందు మూడు దశలు ఉన్నాయిప్పుడు! మామూలుగానే మన హీరోలు కొన్నేళ్లుగా వేగం పెంచారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో దానికోసం కథ పక్కా చేసుకుంటున్నారు. ఇక గతేడాది లాక్‌డౌన్‌తో వచ్చిన విరామంతో మరిన్ని కథలు వినేశారు. నచ్చినవాటికి పచ్చజెండా ఊపేశారు. వాటిలో కొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరికొన్ని రేపో మాపో పట్టాలెక్కుతాయి. ఇక ఏ హీరోకీ ఇప్పట్లో  కథల అవసరం లేదేమో అనిపించింది మొన్నటిదాకా. ఇటీవల కొద్దిమంది కథానాయకులు... దర్శకుల మధ్య అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఖరారైన కొన్ని ప్రాజెక్టులు సైతం అటూ ఇటూ అయ్యాయి. దాంతో కథల కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. అగ్ర కథానాయకులు వెంకటేష్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ లక్ష్యంగా ఇప్పుడు కొద్దిమంది దర్శకులు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్లతో కథాచర్చల్నీ షురూ చేసినట్టు తెలుస్తోంది.

చిత్రసీమలో వ్యవహారం అంతా గొలుసు కట్టులానే ఉంటుంది. నిర్మాణం మొదలుకొని... విడుదల వరకు ఏ దశలోనైనా సరే, ఒక్క సినిమా అటూ ఇటూ అయిందంటే మిగతా చాలా ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం పడుతుంటుంది. మొన్నటిదాకా అల్లు అర్జున్‌ ‘పుష్ప’ తర్వాత, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. ఆ కలయికలో ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్నాళ్ల కిందటే అనూహ్యంగా ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో సినిమా ఖరారైంది. దాంతో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ తర్వాత ఎవరితో సినిమా చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. మురుగదాస్‌, ప్రశాంత్‌ నీల్‌ మొదలుకొని పలువురు దర్శకులు ఇటీవల అల్లు అర్జున్‌తో కథా చర్చలు సాగించినట్టు తెలిసింది. అల్లు అర్జున్‌ చేస్తున్న ‘పుష్ప’ రెండు భాగాలు కావడంతో కొత్త సినిమా కోసం కథని ఎంపిక చేసుకోవడానికి ఆయనకి తొందరేమీ లేదు. ‘పుష్ప’ తొలి భాగమే ఇంకా పూర్తి కాలేదు. రెండో భాగం పూర్తి చేశాకగానీ ఆయన కొత్త దానికోసం రంగంలోకి దిగే అవకాశం లేదు. అయినా సరే అల్లు అర్జున్‌ కోసం దర్శకులు వరుస కట్టారు. మరి ఏ కలయికలో సినిమా ఖరారవుతుందనేది చూడాలి.

రామ్‌చరణ్‌కి తప్పదా?

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘ఆచార్య’ సినిమాలతో వరుసగా సందడి చేయనున్నాడు రామ్‌చరణ్‌. ఆ తర్వాత ఆయన చేయనున్న ప్రాజెక్ట్‌ అధికారికంగా ఖరారైంది. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా పాన్‌ ఇండియా చిత్రం చేయడం కోసం అంతా సిద్ధమైంది. జూన్‌, జులై మాసాల్లో సినిమాని ప్రారంభించాలనీ అనుకున్నారు. కానీ  అనూహ్యంగా శంకర్‌ చేస్తున్న ‘ఇండియన్‌ 2’కి సంబంధించిన వివాదం తెరపైకొచ్చింది. శంకర్‌ ఆ సినిమాని పూర్తి చేయాల్సి వస్తే, రామ్‌చరణ్‌ ఆలోపు మరో కొత్త సినిమాని చేయాల్సిందే అని లెక్కలు వేస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. అందుకే రామ్‌చరణ్‌ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. మరి ఆయన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘ఆచార్య’ తర్వాత మరో సినిమాని పట్టాలెక్కిస్తాడా లేక, శంకర్‌ కోసమే వేచి చూస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. చరణ్‌ కోసం సుకుమార్‌ ఓ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. ‘రంగస్థలం’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి మరో సినిమాని చేయడానికి పక్కా ప్రణాళికలతో ఉన్నారని తెలుస్తోంది. మరి అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది కాలమే చెప్పాలి.

మధ్యలో సినిమా చేయాల్సిందే?

‘పుష్ప’ రెండు భాగాలు కావడంతో ఆ ప్రభావం యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ప్రయాణంపై పడింది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ ఖరారైన సంగతి తెలిసిందే. ‘లైగర్‌’ తర్వాత ఈ కలయికలోనే సినిమా పట్టాలెక్కుతుందని భావించారంతా. కానీ సుకుమార్‌ రెండు భాగాల ‘పుష్ప’ని పూర్తి చేశాక కానీ విజయ్‌తో సినిమా కోసం రంగంలోకి దిగే పరిస్థితి లేదు. అందుకే ‘లైగర్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండ మరో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తుండడంతో పలువురు దర్శకులు ఆయనకి కథల్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. శివ నిర్వాణ, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తదితర దర్శకులు విజయ్‌ కోసం ఇప్పటికే కథలు సిద్ధం చేశారు. అయితే ఆ కలయికలపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. దాంతో విజయ్‌తో సినిమా చేయాలని పలువురు దర్శకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

వెంకటేష్‌ ఎవరితో?

‘దృశ్యం2’ పూర్తయింది. ‘నారప్ప’ విడుదలకి ముస్తాబవుతోంది. ‘ఎఫ్‌3’ చిత్రీకరణ దశలో ఉంది. మరి వాటి తర్వాత వెంకటేష్‌ సినిమా ఏంటనేదే ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. సీనియర్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున... ఈ ముగ్గురూ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాతి ప్రాజెక్టులు కూడా ఖాయం చేసుకున్నారు. వెంకీనే ఇంకా కథలపై నిర్ణయం తీసుకోలేదు. ఆయన కోసం పలు రీమేక్‌ కథలతోపాటు... తరుణ్‌భాస్కర్‌లాంటి యువ దర్శకులూ కథలు సిద్ధం చేశారు. ఆ ప్రాజెక్టుల్ని మాత్రం ఇంకా పక్కా చేయలేదు. అందుకే ఆయనతో సినిమాలు చేయాల్సిన దర్శకులంతా కూడా కథల్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే... ఈ లాక్‌డౌన్‌ తర్వాత మరికొన్ని కొత్త కలయికల్లో సినిమాలు ఖరారయ్యే, కొత్త కబుర్లు వినిపించే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని