మొదలుపెట్టేది మామా అల్లుళ్లేనా?!
close
Updated : 17/06/2021 06:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొదలుపెట్టేది మామా అల్లుళ్లేనా?!

చిత్రీకరణలు షురూ అయ్యాయి. ఇప్పుడందరి దృష్టి థియేటర్లపైనే. రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టగానే చిత్రీకరణల కోసం ధైర్యంగా రంగంలోకి దిగినట్టుగానే... థియేటర్లు తెరుచుకున్న వెంటనే సినిమాల్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కరోనాపై అవగాహన పెరగడంతోపాటు..వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతోంది కాబట్టి ప్రేక్షకులు ఇదివరకటి కంటే ధైర్యంగా వస్తారని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత ప్రేక్షకులు వస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ మంచి సినిమాలు విడుదలైన వెంటనే ప్రేక్షకులు థియేటర్లకి వచ్చారు. ఇప్పుడూ అదే తరహా స్పందన లభిస్తుందనేది నిర్మాతల నమ్మకం. యాభై శాతం ప్రేక్షకులతో అనుమతులు లభించినా ఈసారి బాక్సాఫీసు ముందుకు సినిమాలు వరుస కట్టే అవకాశాలున్నాయి. వచ్చే నెలలోనే తెరపై బొమ్మ పడొచ్చని, అగ్ర తారలు నటించిన భారీ బడ్జెట్‌ చిత్రాలేమో వంద శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు మొదలైనప్పుడే విడుదల కావొచ్చని వ్యాపార వర్గాల అంచనా వేస్తున్నాయి.

విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా పెద్దదే. ‘టక్‌ జగదీష్‌’, ‘లవ్‌స్టోరి’, ‘విరాటపర్వం’ తదితర చిత్రాలు రెండో దశ కరోనా వల్ల విడుదల ముంగిట ఆగిపోవల్సి వచ్చింది. ఆ సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్ల ముందుకు వరుస కట్టనున్నాయి. లాక్‌డౌన్‌ తొలగించిన వెంటనే మా సినిమాని విడుదల చేస్తామని ‘లవ్‌స్టోరి’ నిర్మాతలు చెబుతున్నారు. యాభై శాతం ప్రేక్షకులతో అనుమతులు లభించినా తమ సినిమాల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలు చాలామందే ఉన్నారు. విడుదల కావల్సిన సినిమాల జాబితా ఎక్కువగా ఉండటం...ఆలస్యం చేస్తే పోటీ ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో నిర్మాతలు తమ చిత్రాల్ని వీలైనంత త్వరగా విడుదల చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం2’, ‘నారప్ప’ సినిమాలు ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరో వారం రోజుల్లో ‘నారప్ప’ తొలి కాపీ సిద్ధం కానుందని ఆ సినిమా వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. పరిస్థితులు చూస్తుంటే ఈసారి మామా అల్లుళ్లు వెంకటేష్‌, నాగచైతన్య కథా నాయకులుగా నటించిన ‘నారప్ప’, ‘లవ్‌స్టోరి’ సినిమాలతోనే బాక్సాఫీసు దగ్గర సందడి షురూ కావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జులై ఆఖరు, ఆగస్టు ఆరంభంలో ఆ సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. గతేడాది ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాతో థియేటర్ల దగ్గర సందడి మొదలైంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలతో సినీ వ్యాపారం గాడిన పడింది. ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’, ‘వకీల్‌సాబ్‌’లు ఓవర్సీస్‌లోనూ తెలుగు సినిమా పుంజుకున్న వైనం గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈసారి మరింత వేగంగా సినీ పరిశ్రమ గాడిన పడొచ్చనే ఆశాభావం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ‘


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని