నాన్నను మించిన హీరో ఎవరు?
close
Published : 20/06/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్నను మించిన హీరో ఎవరు?

రాత్రీ పగలూ ఏకధాటిగా... రక్తాన్ని చెమటగా మార్చి... కొండల్ని పిండి చేసి.. సంపాదించినదంతా...
బిడ్డ భవిష్యత్తు ‘చిత్రం’ బాగుండాలని ఖర్చు పెట్టే నిర్మాత నాన్న.
కళ్లలో ఒత్తులేసుకొని... బుర్ర బద్దలు కొట్టుకొని... ఆలోచనలన్నీ వడబోసి... తీసిన సృజనాత్మకతంతా..
బిడ్డను అందరూ మెచ్చే హీరోలా మార్చడానికి వాడే దర్శకుడు నాన్న.
బరువులెన్నో మోసి... పరుగులెన్నో తీసి
ఎండనకా... వాననకా.. కష్టాలెన్నో ఓర్చి..
బిడ్డ జీవితంలో ప్రతి సీన్‌ బాగుండాలని తపించే సినిమాటోగ్రాఫర్‌ నాన్న.

బిడ్డ ఆడుకోవాలంటే సంగీతమందించే మ్యుజీషియన్‌ నాన్న.
బిడ్డ పాడుకోవాలంటే సాహిత్యమందించే కవి నాన్న.
బిడ్డ వందేళ్ల జీవనం హాయిగా, ఆనందంగా సాగడానికి    కరోనా లాంటి ఒడుదొడుకులెన్ని వచ్చినా ధైర్యంగా నిలబడే థియేటర్‌ నాన్న.
పరిశ్రమలో ప్రతి విభాగమూ నాన్నలా మారి ‘సినిమా’ బిడ్డను ప్రపంచానికి గొప్పగా పరిచయం చేస్తుంది.తండ్రి త్యాగాలను, ఆదర్శాలను... కథానాయకుల లక్ష్యాలుగా మార్చి లోకం మెచ్చే కథలు చెబుతుంది. వీరాధివీరుడు హీరో అయితే... హీరోధిహీరుడు తండ్రేనని తెరపై కళ్లకు కడుతుంది. అలాంటి కొన్ని ‘చిత్ర’ విశేషాలు నాన్నల దినోత్సవం సందర్భంగా...

అమ్మ - నాన్న
నాన్నని అమ్మ తర్వాతే గుర్తు చేసుకున్నా... మనకి మాత్రం ఆయనే  సూపర్‌హీరో. మనందరి కథలోనూ ఆయనే హీరో. తన భుజాలపై ఎత్తుకుని మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. తన చేయి పట్టుకుని మనతో అడుగులు వేయిస్తాడు. తాను ఎన్నో కష్టాల్ని అనుభవిస్తాడు. కానీ తను పడిన కష్టాలు బిడ్డలు పడకూడదని కోరుకుంటాడు. అందుకే  నాన్న.. మన కోసం పడిన కష్టాల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇంత గొప్ప భావోద్వేగాలు నాన్న బంధం వెనుక ఉన్నాయి కాబట్టే... ఆ పాత్ర వెండి తెరపై ఎప్పుడూ సూపర్‌హిట్టే. నాన్న పాత్ర చుట్టూ రూపుదిద్దుకున్న కథలు ఎన్నెన్నో. ఆ బంధం బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి తెరపై కనిపిస్తున్నా నిత్యనూతనం అనిపిస్తుంది. ఎన్నిసార్లు తెరపై చూసినా మరోసారి చూడటానికి సిద్ధమైపోతుంటాం. అందుకే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ అంటూ నాన్నతో ముడిపడిన సినిమాలు తరచూ  తెరపైకొస్తుంటాయి.

*  ‘నాన్న.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఓ ఎమోషన్‌’ అంటాడు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్‌. నాన్న ఆశయాన్ని తన లక్ష్యంగా చేసుకొని ప్రతినాయకుడి ఆట కట్టిస్తాడు. తండ్రి ఆశను నెరువేరుస్తాడు.
*  ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఏడిస్తే అంత ప్రేమ అనుకుంటే నేను నా లైఫ్‌లాంగ్‌ ఏడ్చినా మా నాన్న మీద నాకున్న ప్రేమకి  సరిపోదు’ అంటాడు అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో! నాన్న ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎన్ని కష్టాలొచ్చిన ఎదురొడ్డి నిలబడతాడు కథానాయకుడు.

*  కొడుకుకు జెర్సీ కొనిస్తానని చెప్పిన మాట కోసం.తన బిడ్డ కళ్లలో ఎప్పటికీ హీరోలా నిలిచిపోవడం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని తండ్రిని ‘జెర్సీ’లో చూసి కళ్లు తడవని ప్రేక్షకులుండరు.
*  ఓడిపోయినా సరే, తన కొడుకు వెన్నంటే నిలిచిన ఓ తండ్రి పాత్ర ‘చిత్రలహరి’లో కనిపిస్తుంది. ‘నాన్న’, ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘7 / జి బృందావన్‌ కాలనీ’, నీదీ నాదీ ఒకే కథ’, ‘గాలిసంపత్‌’... ఇలా ఎన్నో సినిమాలు  తండ్రీ బిడ్డల అనుబంధాన్ని గొప్పగా ఆవిష్కరించాయి. అగ్ర కథానాయకుల చిత్రాలంటే హీరోయిజం,  ఫైట్లు, డ్యాన్సులే అనుకుంటాం. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘దూకుడు’ సినిమాలోనూ, ప్రభాస్‌ ‘మిర్చి’లోనూ తండ్రీ తనయుల బంధం, భావోద్వేగాలే హైలెట్‌గా నిలిచాయి. థ్రిల్లర్‌ కథైన ‘దృశ్యం’లోనూ ఓ తండ్రి తన కుటుంబం కోసం పడే తపనే కీలకం.

*  చిరంజీవి ‘డాడీ’ మొదలు కొని... అమ్మాయిల పట్ల నాన్న ప్రేమ ‘ఆకాశమంత...’అని, తండ్రులకు బిడ్డలంటే ‘చందమామ’లనీ చెప్పి ఆకట్టుకున్న  సినిమాలూ ఉన్నాయి.
*  ఇలా ప్రేమని వ్యక్తం చేసినప్పుడే కాదు, ‘అంతా మీరే చేశారు నాన్నా...’ (బొమ్మరిల్లు) అంటూ నాన్నని నిందించినప్పుడు, ‘హే ఓల్డ్‌ మేన్‌...’ (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే) అంటూ తండ్రిని వెక్కిరించినప్పుడూ పితృస్వామ్యంపై భావోద్వేగాలు పండాయి. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు కురిశాయి.

బిడ్డలు ఎక్కే ప్రతి మెట్టులోనూ నాన్న భుజాలు ఆ బరువును ఆనందంగా మోస్తుంటాయి. బిడ్డలు నడిచే ప్రతి దారిలోనూ నాన్న కళ్లు వెలుతురులా పరుచుకుంటుంటాయి. అందుకే తండ్రి అన్న ఎమోషన్‌... బిడ్డలకే కాదు... సినిమాలకు ప్రాణమే.  చిత్రాలకెప్పుడూ నాన్న తత్వం.. కథానాయకత్వమే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని