Maa Election: ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నాం
close
Updated : 27/06/2021 05:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maa Election: ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నాం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నట్టు తెలిపారు ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్‌. తాము పదవుల కోసం ఆశపడడం లేదని, క్రమశిక్షణ కమిటీ కోరితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న సభ్యులు తమ పదవీకాలం పూర్తి కాక ముందే, ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరి మీడియా సమావేశంలో పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మా’ ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న శివ బాలాజీ, కరాటే కళ్యాణి, పసునూరి శ్రీనివాసులు, గౌతంరాజు,  అశోక్‌కుమార్‌లతో కలిసి నరేష్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. తన అధ్యక్షతన ‘మా’ ఆధ్వర్యంలో చేసిన పనుల గురించి ఆయన వివరించారు. ‘‘సినీ పరిశ్రమకి ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. నువ్వు జీవితంలో అధ్యక్షుడివి కాలేవు అన్నారు. కానీ అధ్యక్షుడినై ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి 728 మంది సభ్యులకి రూ.3 లక్షల జీవిత బీమా చేయించాం. ఆరోగ్య బీమా, పింఛన్లు, మృతి చెందిన సభ్యుల కుటుంబాలకి సాయం, జాబ్‌ కమిటీలు... ఇలా ఎన్నో పనులు చేశాం. ‘మా’ రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది సినీ పెద్దలు మెట్టు మెట్టు పేర్చి దీన్ని స్థాపించారు. ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులంతా ‘మా’ అభివృద్ధి కోసం పనిచేశారు. నేను చేసిన ప్రతి విషయాన్నీ పెద్దలందరికీ తెలియజేశా. కానీ నాగబాబు నాలుగేళ్లుగా ‘మా’ ప్రతిష్ట మసకబారిందని వ్యాఖ్యానించారు. ఆ మాటలు తప్పు. ఆ మాటలు షాక్‌కి గురిచేశాయి. ప్రకాశ్‌రాజ్‌ మూడు నెలల కిందటే ఫోన్‌ చేసి ఈ ఏడాది ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పా. లోకల్‌, నాన్‌లోకల్‌ అనే ప్రస్తావన మేమెప్పుడూ తీసుకురాలేదు. క్రమశిక్షణ కమిటీ ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు తమ కార్యవర్గం తప్పుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికి కూడా ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నాం. గత ఎన్నికల్లో మహిళకు అవమానం జరిగింది కాబట్టి ఈసారి మహిళకి అవకాశం ఇస్తే ఏకగ్రీవం చేసేందుకు సహకరిస్తాం’’ అన్నారు నరేష్‌. మా కార్యవర్గ సభ్యురాలు, నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ ‘‘పదవిలో ఉండగానే మరో ప్యానల్‌లో చేరి నిబంధనలు ఉల్లంఘించిన సభ్యుల్ని సస్పెండ్‌ చేయాల’’ని కోరారు. శివబాలాజీ మాట్లాడుతూ ‘‘సేవే ప్రధాన లక్ష్యంగా పని చేశాం. ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించింది. ఎన్నికలలోపు మేం  చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఎవరైనా సరే వచ్చి పని చేయాలి, గుర్తింపు పొందాల’’న్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని