కథలు.. కథలుగా చెప్పాలని..!
close
Updated : 22/07/2021 04:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కథలు.. కథలుగా చెప్పాలని..!

‘సూటిగా చెప్పు.. సుత్తి లేకుండా’.. - సినిమాల విషయంలో చిత్ర పరిశ్రమ అనాదిగా అనుసరిస్తున్న సూత్రమిది. ప్రేక్షకులకు చెప్పబోయేది ఎంతటి విస్తారమైన కథనమైనా.. అటు ఇటుగా రెండు, మూడు గంటల నిడివిలోనే చెప్పే ప్రయత్నం చేసేవారు. ఏ మాత్రం నిడివి పెరిగినా.. ఎడిటర్లు తమ కత్తెరకు పని చెప్పి చిత్రాల్ని కుదించేవారు. అయితే ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలకు దక్కిన ఆదరణ.. కథలు చెప్పడంలో కొత్త మార్పులకు నాంది పలికింది. రెండు భాగాల ట్రెండ్‌కు ఊపిరిలూదింది. నిర్ణీత నిడివిలో చెప్పలేమనుకున్న ఆసక్తికర కథల్ని ఇప్పుడు భాగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిర్మాతలకూ లాభదాయకంగా ఉండటంతో.. చిత్రసీమలో ఈ ఫార్ములాకి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది.  

‘బాహుబలి’ సినిమాని రెండు భాగాలుగా తీసుకొచ్చి.. బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించారు రాజమౌళి. విస్తారమైన కథల్ని.. భాగాలుగా విడగొట్టి ఆసక్తికరమైన దృశ్య కావ్యాలుగా ఎలా మలచొచ్చో భారతీయ చిత్ర పరిశ్రమకు చూపించారు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకునే ‘కేజీఎఫ్‌’ని రెండు భాగాలుగా విడదీశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 1’తో విజయాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడు సినీప్రియుల కళ్లన్నీ ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’పై పడ్డాయి. కోలార్‌ బంగారు గనుల నేపథ్యంలో అల్లుకున్న యాక్షన్‌ కథాంశంతో రూపొందించిన చిత్రమిది. యష్‌ కథానాయకుడిగా నటించారు. ఇందులో సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పాన్‌ ఇండియా సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

* అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’ని రెండు పార్ట్‌లుగానే తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. ఈ కథను తొలుత ఒక చిత్రంగానే చూపించాలనుకున్నారు సుక్కు. అయితే కథను మరింత చక్కగా తీర్చిదిద్దుకునే క్రమంలో.. మరో పార్ట్‌కు అవకాశం దొరికింది. ప్రస్తుతం తొలి భాగం తుది దశ చిత్రీకరణలో ఉంది.

* దర్శకుడు మణిరత్నం కలల చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కల్కీ కృష్ణమూర్తి రాసిన చారిత్రక నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. చోళుల కాలం నాటి ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోంది. నిర్ణీత నిడివిలో చెప్పలేని విస్తృతి ఉన్న కథ ఇది. అందుకే రెండు పార్ట్‌లుగా రూపొందించే పనిలో పడ్డారు మణిరత్నం. తొలి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇందులో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

* వైవిధ్యభరిత కథలకు చిరునామాగా నిలుస్తుంటారు కథానాయకుడు నితిన్‌. ఆయన ‘పవర్‌ పేట’ పేరుతో ఓ డ్యూయాలజీ చిత్రం చేయనున్నారు. దీన్ని దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించనున్నారు. ఇందులో నితిన్‌ 18ఏళ్ల యువకుడిగా, 40ఏళ్ల మధ్యవయస్కుడిగా, 60ఏళ్ల వృద్ధుడిగా విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారు.

ప్రచారంలో మరిన్ని..

‘బాహుబలి’ సినిమాలతో రెండు పార్ట్‌ల ట్రెండ్‌కి ఊపు తీసుకొచ్చారు ప్రభాస్‌. ఇప్పుడాయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోచేస్తున్న సినిమా ‘సలార్‌’. శక్తిమంతమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశముందని కొన్నాళ్లుగా ప్రచారం వినిపిస్తోంది. కల్యాణ్‌ రామ్‌ కథా నాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘బింబిసార’. వశిష్ట్‌ దర్శకుడు. చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది.

ట్రయాలజీలు ఊరిస్తున్నాయి...

‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమకు ట్రయాలజీ ఫార్ములాని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఇతిహాసాలతో ముడిపడిన విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతోంది. ఎంతో విస్తృతితో కూడిన కథ ఇది. అందుకే దీన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అయాన్‌. తొలి పార్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది ఆఖర్లో విడుదల చేసే అవకాశముందని ప్రచారం వినిపిస్తోంది.
* భావోద్వేగభరిత కుటుంబ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పుడాయన ‘అన్నాయ్‌’ పేరుతో మూడు భాగాల చిత్రం చేయనున్నారు. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని