సీటీమార్‌ ఓ పండగలా వచ్చింది - Telugu News Seetimarr Success Celebrations
close
Updated : 15/09/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీటీమార్‌ ఓ పండగలా వచ్చింది

‘‘విజయాలు చూశాను, పరాజయాలు చూశాను. సినిమా ఫలితం ఏమిటనేది విడుదల రోజు నా ఫోనే నాకు చెబుతుంది. నిజాయతీగా హిట్‌ అనే మాట వినడానికి చాలా ఏళ్లు పట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల మధ్య సినిమా ఇంత పెద్ద విజయం అందుకోవడం నిజంగా ఆనందంగా ఉంది’’ అన్నారు గోపీచంద్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు. గోపీచంద్‌ మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో చిత్రీకరణ చేయడం సులభం కాదు. అందరూ చాలా ధైర్యంగా వచ్చి సినిమా చేశారు. మా అందరి కృషి ఫలించింది. విజయం ప్రతి రోజూ రాదు. వచ్చిన రోజు ఆస్వాదించాలి. ప్రేక్షకులు సినిమాని బాగా ఆశీర్వదిస్తున్నారు. ‘సీటీమార్‌ ఓ పండగలా వచ్చింది అన్నా’  అని చెబుతున్నారు. తమన్నాతో కలిసి ఇదివరకే  పనిచేయాలనుకున్నా, ఇప్పటికి కుదిరింది. తన పాత్రని చూసినప్పుడు ప్రతి అమ్మాయిలోనూ స్ఫూర్తి కలుగుతుంది. ఎవరేమనుకున్నా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది’’ అన్నారు. సంపత్‌ నంది మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి ఆక్సిజన్‌ నింపారు ప్రేక్షకులు. ఏ సినిమా విషయంలోనైనా తప్పు జరిగితే అది నాదే. ఆడినప్పుడు దానికి కారణం నా సాంకేతిక బృందమే. ‘గౌతమ్‌ నంద’ సినిమాతోనే నేను, గోపీచంద్‌ విజయాన్ని సాధిస్తాం అనుకున్నాం. ఆ బాకీ ఇప్పుడు తీర్చుకున్నా. జ్వాలారెడ్డి పాత్రలో మరో పదేళ్లు గుర్తుంటుంది తమన్నా’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. ప్రతి నటి కెరీర్‌లో కొద్దిమంది చాలా ముఖ్యమైనవాళ్లు ఉంటారు. నాకు తెలుగు సినిమా కెరీర్‌లో సంపత్‌ నంది ఒకరు. బేటీ బచావ్‌.. బేటీ పడావ్‌ అనేది వ్యక్తిగతంగా నా నినాదం. ఆ విషయాన్ని చెప్పే ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని