మాస్ట్రోలో నితిన్‌ని కొత్తగా చూస్తారు - Telugu News Nithiin Starrer Maestro Pre Release Event Held at Hyderabad
close
Updated : 15/09/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్ట్రోలో నితిన్‌ని కొత్తగా చూస్తారు

నితిన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. నభా నటేష్‌ కథానాయిక. తమన్నా ముఖ్యభూమిక పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 17న ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. నితిన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు కొంచెం భయమేసింది. వాణిజ్య ప్రధానమైన సినిమా చేస్తూ వెళ్లొచ్చు కదా అనుకున్నా. నటుడిగా ఎక్కడో సాహసం చేయాలి, ఇలాంటి కళాత్మకమైన సినిమాలూ చేయాలి కదా? అనే ఒప్పుకొన్నా. దర్శకుడు గాంధీ చాలా కష్టపడ్డాడు. కచ్చితంగా తెలుగులోనూ ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. సాగర్‌ మహతి సంగీతం చాలా బాగుంది. ఛాయాగ్రాహకుడు యువరాజ్‌తో ఇది నాకు రెండో చిత్రం. మా బృందమంతా మళ్లీ పెద్ద తెర కోసం సినిమా చేస్తాం. నేను, తమన్నా... ఇలా చాలా మంది సాహసోపేత నిర్ణయం తీసుకుని ఈ సినిమా చేశామ’న్నారు. తమన్నా మాట్లాడుతూ ‘‘నాకు తెలిసినంత వరకు నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది. కొత్త రెక్కలనిస్తుంది. నా అభిమానులు ఇచ్చిన ప్రేమవల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నా. నేను వేసే ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహిస్తున్నారు. నితిన్‌ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఈ సినిమా. ఇలాంటి పాత్రని చేయడం చాలా కష్టం. తెలుగు ప్రేక్షకులందరూ రకరకాల జోనర్లు చూసి ఉంటారు, డార్క్‌ కామెడీ కథలు అంతగా రాలేదు. దర్శకుడు గాంధీ ఈ సినిమాని ఒక బాధ్యతగా తీసుకుని తనదైన శైలిలో తీశారు. భిన్నమైన పాత్ర చేసిన ప్రతిసారీ ఎంతో ఆనందాన్నిస్తుంది. అందులో ఇదొకటి’’ అన్నారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ‘‘నితిన్‌తో ఎప్పట్నుంచో వాణిజ్య ప్రధానంగా సాగే ఓ కామెడీ సినిమా చేయాలనుకున్నా. ఒక మంచి కళాత్మక సినిమా ‘అంధాదున్‌’ రీమేక్‌ చేశా. నితిన్‌ అన్నని ఈ చిత్రంలో కొత్తగా చూస్తారు. తమన్నా ఈ సినిమాతో గొప్ప నటి అనిపించుకుంటారు. సినిమా చూశాక తప్పకుండా పోల్చి చూస్తారు. తిట్టడానికో పొగడటానికో సినిమానైతే అందరూ చూడండి’’ అన్నారు. నభా నటేష్‌ మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి ఈ సినిమాకి ఎంపిక చేశారు. ఇది నా తొలి రీమేక్‌ చిత్రం. నితిన్‌తో తొలి చిత్రం. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. పాత్రలో లీనమై నటించారు. అందరి మొహాల్లో నవ్వుని పంచుతుందీ చిత్రం’’ అన్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే అన్నారు సమర్పకులు రాజ్‌కుమార్‌ ఆకెళ్ళ. ఈ కార్యక్రమంలో వి.కె.నరేష్‌, కాసర్ల శ్యామ్‌, మంగ్లీ, మహేష్‌, రచ్చ రవి, నిఖిల్‌, యువరాజ్‌, సాహి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని