10 తర్వాత సమాధానం చెబుతా
close
Updated : 27/09/2021 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10 తర్వాత సమాధానం చెబుతా

‘మా’ ఎన్నికల తర్వాత పవన్‌కల్యాణ్‌ అడిగిన ప్రతి మాటకీ సమాధానం చెబుతానని ఓ లేఖ ద్వారా స్పష్టం చేశారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. ‘రిపబ్లిక్‌’ సినిమా వేడుకలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై  స్పందించాలంటూ మోహన్‌బాబుని ఉద్దేశించి ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మోహన్‌బాబు ఆదివారం ఓ లేఖ ద్వారా స్పందించారు.  ‘‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్‌ నువ్వు నా కంటే చిన్నవాడివి. అందుకని ఏకవచనంతో సంభోదించాను. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబరు 10న ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతా. ఈలోగా నువ్వుచేయవల్సిన ముఖ్యమైన పని... నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి గెలిపించాలని కోరుకుంటున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు మోహన్‌బాబు.

యువ కథానాయకుల మద్దతు

పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై యువ కథానాయకులు నాని, కార్తికేయ స్పందించారు. నిజాయతీగా చిత్రసీమ సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించాలని కోరారు. నాని ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... ‘‘పవన్‌కల్యాణ్‌ సర్‌కీ... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికీ మధ్యనున్న రాజకీయ విభేదాలని పక్కనపెడదాం. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని నిజాయతీగా ప్రస్తావించినందుకు పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమ పునరజ్జీవన విషయంలో ఆలస్యం కాకుండా తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంద’’న్నారు. మరో యువ కథానాయకుడు కార్తికేయ ట్వీట్‌ చేశారు. ‘‘నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడమో లేక, వ్యతిరేకించడమో లేదు. తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి పవన్‌కల్యాణ్‌ ప్రస్తావించిన సమస్యలు పూర్తిగా వాస్తవం. మా అందరి తరఫున మాట్లాడిన పవన్‌ సార్‌కి మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నా’’ అని తెలిపారు.

అవి వ్యక్తిగత అభిప్రాయాలే

సినీ పరిశ్రమకి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పష్టం చేసింది. వివిధ వ్యక్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వాళ్ల వ్యక్తిగతమే తప్ప, వాటితో చిత్ర పరిశ్రమకి సంబంధం లేదని స్పష్టం చేసింది. చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్‌దాస్‌ నారంగ్‌ పేరిట ఆదివారం ఓ లేఖని విడుదల చేసింది మండలి. ‘‘ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని ఆహ్వానం మేరకు ఇదివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఆందోళనల్ని తెలిపాం. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అర్థం చేసుకుని, మా ఆందోళనలకి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ఏళ్లుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాధించలేదు. నాయకులు, ప్రభుత్వాలు నిరంతర మద్దతు అందించడం చిత్ర పరిశ్రమకి ఎంతో అవసరం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని