Most Eligible Bachelor: ఆ ప్రేక్షకులను తీసుకురావాలంటే రిస్క్‌ తప్పదు - telugu news producer Bunny vasu Latest Interview
close
Updated : 14/10/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachelor: ఆ ప్రేక్షకులను తీసుకురావాలంటే రిస్క్‌ తప్పదు

‘‘కరోనాతో అందరూ చాలా బాధల్లో ఉన్నారు. అందుకే వాళ్లని తీసుకొచ్చి రెండు గంటలు నవ్వించి పంపాలన్నది నా కోరిక. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో ఆ కోరిక తీరుతుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు నిర్మాత బన్నీవాసు. ఇప్పుడాయన నిర్మాణంలో అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా శుక్రవారం   ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు బన్నీవాసు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..  

‘‘భార్యాభర్తల అనుబంధాలను,  వైవాహిక జీవితం గొప్పతనాన్ని వివరిస్తూ చాలా సినిమాలొచ్చాయి. అందులోని ఓ సున్నితమైన అంశాన్నే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో కొత్త కోణంలో చెబుతున్నాం. ప్రతి కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి ఏమేం కావాలి.. ఎలా  ఉండాలి? అన్నదే నేర్పుతారు. పెళ్లి తర్వాత భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా మెలగాలి? అని చెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. మేము ఆ అంశాన్నే దీంట్లో టచ్‌ చేశాం. పెళ్లికి ముందే కాదు.. పెళ్లయ్యాక ఎలా ఉండాలనేది పిల్లలకి నేర్పించండి? అనే విషయాన్ని ఈ చిత్రంతో చెప్పనున్నాం. సున్నితమైన అంశాన్ని     వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం’’.

* ‘‘అఖిల్‌పై ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు.. ఓ సింపుల్‌ కథే చెప్పాలి, ఆ కథతో అఖిల్‌ని అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో చాలా సున్నితంగా వెళ్లే కథ ఇది’’.

* ‘‘భాస్కర్‌ స్క్రిప్ట్‌ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు కానీ, సినిమా తీయడానికి అంత సమయం తీసుకోడు. నిజానికి ఈ చిత్రాన్ని మేము 85రోజుల్లోనే పూర్తి చేశాం. కరోనా పరిస్థితుల వల్ల షూట్‌కు ఆటంకాలు ఎదురవడంతో రెండేళ్ల సమయం పట్టింది. కుటుంబ ప్రేక్షకుల్ని మునుపటిలా థియేటర్ల వైపు తీసుకురావాలంటే కచ్చితంగా ఇలాంటి పెద్ద చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు తీసుకురాక తప్పదు. ఎవరో ఒకరు రిస్క్‌ చేయాల్సిందే. గత నెలలో ‘లవ్‌స్టోరీ’తో ఆ రిస్క్‌ చేశారు. మంచి ఆదరణ దక్కింది. ఈనెలలో నావంతుగా ఈ సినిమాని తీసుకొస్తున్నా’’.

* ‘‘పరిశ్రమ సమస్యలన్నింటిపైనా ఏపీ ప్రభుత్వ పెద్దలతో చర్చించాం. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. టికెట్‌ రేట్లు ఎంత ఉండాలి? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి’’.

* ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి.. పరిశ్రమకి మధ్య కమ్యునికేషన్‌ గ్యాప్‌ ఉంది. ఇకపై ఆ సమస్య రాకూడదు.. ఎలాంటి అపోహలు ఉండకూడదనే అటు ప్రభుత్వ పెద్దలతోనూ, ఇటు పవన్‌ కల్యాణ్‌తోనూ మాట్లాడాం. ఇద్దరూ సానుకూలంగా స్పందించారు. ఇక అందరూ తెలుసుకోవాల్సిన మరో అంశం ఏంటంటే.. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ అన్నది ప్రస్తుతం అన్ని థియేటర్లలో ఉంది. అయితే ప్రభుత్వం అడిగేదేంటంటే.. రోజులో ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఎంత ఆదాయం వస్తుందన్నది స్పష్టంగా తెలియాలని. ఎందుకంటే ఇప్పటికీ కొందరు ఎగ్జిబ్యూటర్లు సక్రమంగా పన్నులు చెల్లించడం లేదు. దీనికి తోడు దాదాపు మూడోందల థియేటర్లు జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉన్నారు. అందుకే ఈ సమస్యలన్నిటికి పరిష్కారంగానే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసినా.. పరిశ్రమ వర్గాల సలహాలు, సూచనలకు అనుగుణంగానే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ చేస్తే.. సినిమా ఆదాయమంతా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుందన్నది అపోహే’’.

‘‘పుష్ప’ తొలి భాగం చిత్రీకరణ పూర్తయితే తప్ప అల్లు అర్జున్‌ లైనప్‌పై ఓ స్పష్టత రాదు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మురుగదాస్‌తోనూ సినిమా చేయాల్సింది. అలాగే ‘ఐకాన్‌’ ఉంది. అయితే వీటిలో ముందు సెట్స్‌పైకి వెళ్లేది ఏదనేది ఇప్పుడే చెప్పలేం. కొవిడ్‌తో పాటు థియేటర్ల సమస్యల నుంచి తేరుకున్నాక.. మా బ్యానర్‌ నుంచి వరుసగా ఏడెనిమిది ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తాం’’.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని