close

తాజా వార్తలు

Published : 21/09/2020 09:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చక్కటి భావోద్వేగాల ‘యమలీల..ఆ తరువాత’

వెండితెరపై ఓ కథకి శుభం కార్డు పడింది.  పాతికేళ్ల తర్వాత ఆ కథ పునః ప్రారంభమైంది...అదే - ‘యమలీల  ...ఆ తరువాత’.  ఈ నెల 21(సోమవారం) నుంచి ‘ఈటీవీ’లో రాత్రి 8గంటలకు ప్రేక్షకుల్ని అలరించబోతోంది.
‘వేశా.. మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా.. నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా..’- ఇలా పాతికేళ్ల కిందట తల్లీకొడుకుల అనుబంధాన్ని ఒక అందమైన కథలో... గొప్పగా ఆవిష్కరించిన చిత్రం ‘యమలీల’. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘యమలీల ... ఆ తరువాత’ ధారావాహిక రూపొందింది. సినిమాలో తల్లీకొడుకులుగా నటించిన అలీ, మంజు భార్గవి ఇందులోనూ అదే పాత్రల్ని పోషించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సురేష్‌ దర్శకుడు. ఈ సందర్భంగా అలీ, మంజు భార్గవి ‘ఈనాడు సినిమా’తో   చెప్పిన విశేషాలివి...

మా ‘యమలీల’ విడుదలై 25 యేళ్లు అయ్యిందంటే నమ్మబుద్ధి కాలేదు. నాలుగైదేళ్ల కిందటే ఆ సినిమా చేసినట్టుగా ఉంటుంది. సరిగ్గా పాతికేళ్ల మైలురాయి అందుకోగానే అప్పుడే ‘ఈటీవీ’ బృందం ఈ ధారావాహిక ఆలోచనతో నన్ను సంప్రదించింది. ‘యమలీల.. ఆ తరువాత’ అంటూ కథ  చెప్పగానే కనెక్ట్‌ అయిపోయా. బుల్లితెర కోసమే అయినా... పెద్ద తెర కోసం చేసినట్టుగానే చిత్రీకరణ జరిగింది. అప్పట్లో అనుకోకుండానే నాకు ‘యమలీల’లో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు ఎలాంటి అనుభూతికి గురవుతూ నటించానో, ‘యమలీల... ఆ తరువాత’ చేస్తున్నప్పుడూ అంతే! నేను ధారావాహికలో నటించడం ఇదే తొలిసారి. కుటుంబం మొత్తాన్ని థియేటర్‌కి తీసుకొచ్చిన చిత్రం ‘యమలీల’. ఇప్పుడు బుల్లితెర ద్వారా వాళ్లందరికీ ఈ కథా చేరువ కానుంది’’.

* అప్పట్లో ‘యమలీల’కు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్లగా ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతి చెందారు. అలాంటి ఓ గొప్ప కథ కొనసాగింపులోనూ నేనే నటించడం చాలా తృప్తినిచ్చింది. దర్శకుడు సురేష్‌ చక్కటి భావోద్వేగాలతో     తీర్చిదిద్దారు.
* సినిమాతో పోలిస్తే టెలివిజన్‌ కోసం నటించడం చాలా కష్టం. సినిమాకి స్క్రిప్టు ముందే ఇచ్చేస్తారు. మనం సిద్ధమై సెట్‌కి వెళ్లి నటించాలి. టెలివిజన్‌   విషయంలో భావోద్వేగాలు, టైమింగ్‌ మీద వెళ్లిపోవాలి. ఒక పక్క చిత్రీకరణ, మరోపక్క డబ్బింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణం ఓ కొత్త అనుభవం. 21 యేళ్ల టీవీ ప్రయాణం నాది. ఈటీవీతోనే 15 యేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. నేను చేసిన తొలి షో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌తో చాలా మంది డ్యాన్స్‌ మాస్టర్లు చిత్ర పరిశ్రమకి పరిచయ్యారు. అలీ 369, అలీతో జాలీగా, అలీతో సరదాగా, అలీ టాకీస్‌... ఇలా చాలా ప్రదర్శనల్ని నిర్వహించా’’.

 

నేనెన్ని ధారావాహికల్లో నటించినా.. వాటిలో ‘యమలీల... ఆ తరువాత’ ప్రత్యేకం. ఇది మేం చేసిన కథే. 25 యేళ్ల తర్వాత దానికి కొన సాగింపుగా తెరకెక్కుతున్న ఈ ధారావాహికలో అదే నటులే భాగం కావడం అరుదైన విషయం. కథ రీత్యా ‘యమలీల’ ఒకెత్తైతే, ఈ ధారావాహిక మరో ఎత్తు. ‘యమలీల’ చేసేటప్పుడు నా పాత్ర, కథ గురించి చెప్పి ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఇది మీరే చేయాలి, మరొకర్ని ఊహించలేను’ అని చెప్పారు. అప్పట్లో నేను ఎక్కువ సినిమాలు చేసేదాన్ని కాదు. ఎస్వీ కృష్ణారెడ్డి అలా చెప్పడంతో అందులో నటించేందుకు ఒప్పుకొన్నా. దీనికి ఏమాత్రం తగ్గని విధంగా ఈ ధారావాహిక రూపొందింది. మానవ అనుబంధాలే ప్రధానంగా సాగుతుంది. ‘శంకరాభరణం’, ‘యమలీల’ చేస్తున్నప్పుడు నటిగా ఎలాంటి అనుభూతి చెందానో, ఈ ధారావాహికలో  నటిస్తున్నప్పుడూ అంతే. కొన్ని కథలు, పాత్రలు నటుల్ని అప్రయత్నంగా వాటిలో లీనమయ్యేలా చేస్తాయి. ‘యమలీల.. ఆ తర్వాత’ చేస్తున్నప్పుడు భావోద్వేగాలు పండించాల్సిన సన్నివేశాల్లో గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు కార్చేదాన్ని.’’

* నేను, అలీ కలిసి నటిస్తున్నప్పుడు ‘యమలీల’ రోజులే గుర్తుకొచ్చేవి. ఆ సినిమా వచ్చి పాతికేళ్లయినా ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు ప్రేక్షకులు. పోయిన యేడాది హైదరాబాద్‌కి చిత్రీకరణ కోసం వచ్చినప్పుడు విమానాశ్రయం వెళ్లే కారులో డ్రైవర్‌ నన్ను చూసి   ‘యమలీల’ పాటని తిప్పి తిప్పి వినిపించాడు. ‘అమ్మా... నేను ఈ పాట కోసం రోజూ థియేటర్‌కి వెళ్లి కూర్చునేవాణ్ని’ అన్నాడు.’’
* ఎక్కువగా సినిమాలు, ధారావాహికలు చేయకపోవడానికి కారణం నాకు ఆసక్తి లేకపోవడమే. చిన్నప్పట్నుంచి మా అమ్మ నన్ను నటన వైపు ప్రోత్సహించారు. నాకు మాత్రం డ్యాన్స్‌పైనే దృష్టి ఉండేది. అమ్మ  ప్రోద్బలంతోనే నేను గొప్ప చిత్రాల్లో నటించాను కదా అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి మరో కారణం ఏంటంటే... నేను ముక్కు సూటి మనిషిని. అలా ఉంటే పరిశ్రమలో పనికి రారు. నా డ్యాన్స్‌, నా ప్రదర్శనలు, నా విద్యార్థులు, నా తరగతులు... ఇదే నా ప్రపంచం ప్రస్తుతం. బెంగళూరులో మా ఇంటి పరిసరాల్లో ఉన్నవాళ్లకి కూడా నేను అక్కడ ఉన్నట్టు తెలియదు.’’

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.