close

తాజా వార్తలు

Published : 27/09/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కడ చూపుల్లో... కన్నీటి రాగాల్లో

బాలు పాటలతో వాట్సప్‌ స్టేటస్‌లు నిండిపోయాయి. ఆయన స్మృతులతో ఫేస్‌బుక్‌ వాల్స్‌ తడిసిపోయాయి. ఆయన జీవిత విశేషాలు, సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాల గురించి తెలుసుకుంటూ.. తెలియజెబుతూ... అభిమానులు కన్నీటి సంద్రమై  పోయారు. బంధుమిత్రులు, అభిమానులు, సినిమా ప్రముఖుల ఘన నివాళుల మధ్య శనివారం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంతిమ వీడ్కోలు పలికారు.

అమృత తుల్యమైన గీతాలతో ఆబాలగోపాలాన్ని రంజింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఇక లేరన్న వార్తను సినీ సంగీత ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీతారలంతా సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌.. ఎస్పీబీకి భావోద్వేగభరితంగా అక్షర నివాళి అర్పించారు.
‘‘అదేంటో..

రాసుకున్న ప్రతీమాట మీ వాయిస్‌లోనే వినిపిస్తుంది..
ఒక్క పాటేంటి..
ప్రతీ వాక్యం, కథా, నవల ఏదైనా సరే..
వాటి గొంతు మాత్రం మీదే...
అంతలా మాలో అంతర్భాగమైపోయింది..
మీ గాత్రం మీ పాటలు వింటూనో..
మీ రాగాలు హమ్‌ చేస్తూనో..
మీ గాత్రమాధుర్యం గురించి చర్చిస్తూనో..
ఎన్నో గంటలు.. కాదు..
రోజులు.. సంవత్సరాలు బ్రతికేశాం.. బ్రతికేస్తాం..
ఆ రోజులన్నీ మీవే కదా..
మీరు మాతో గడిపినవే కదా..
అంటే ఒకేరోజు కొన్ని కోట్ల రోజులు బ్రతకగల నైపుణ్యం మీది..
ఇంక మీకు మరణం ఏంటి???
మరణం పిచ్చిది..
పాపం తనొచ్చాక మీరుండరని అనుకుంది..
ఇలా వచ్చి..
అలా చేయి పట్టుకుని తీసుకెళ్లి పోవచ్చు అనుకుంది.
కానీ ఎక్కడ చూసినా మీరే, ఎక్కడ విన్నా మీ పాటే..
మా ప్రతి అనుభూతిలోనూ మీ గానామృతమే..
మా హృదయాలలో..
మా అంతరంగాలలో..
అజరామరమైన మిమ్మల్ని..
ఎలా తీసుకెళ్లాలో దానికర్థంకాలేదు...
మిమ్మల్ని తీసుకెళ్లడమంటే..
ఈ భూమండలం మొత్తాన్ని మోసుకెళ్లడమేనని దానికర్థమైంది..
మొదటిసారి మరణం ఒంటరైంది.
ఏం చేయాలో తెలియక.. బిత్తర చూపులు చూస్తోంది..
దిక్కుతోచక భోరున ఏడుస్తోంది..
‘మృతిలో తలదాచుకున్న బ్రతుకు..
శృతిలో కలిపింది నిన్ను జతకు’ మళ్లీ మీ పాటే దానికి ఓదార్పు..
పోన్లెండి బాలు సర్‌..
ఈసారి దాన్ని క్షమించేయండి..
ఇంకెప్పుడూ రాదులేండి..
(‘మరణంతో నిజమయ్యే ఈ బతుకు.. ఒక కలయేలే.. కల నిజాల సంధిరేఖ కలిసిపోవు నీలోనే..’ - ఎప్పుడో రాసుకున్న వాక్యాలు గుర్తొస్తున్నాయి.అది కూడా మీ గొంతుతోనే)’’

- సుకుమార్‌


కడచూపు భాగ్యం దక్కలేదు

‘‘సహోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కడచూపు చూసే భాగ్యం నాకు  దక్కలేదు. పేగుపంచుకోని సహోదరుడు బాలు. నేను ఆయనను ఎంత ప్రేమించానో తెలియదు కానీ, నన్ను ఆయన అమితంగా ప్రేమించారు. ‘అన్నా..’ అంటూ ఆత్మీయంగా పిలిచినప్పుడు ఎనలేని ఆనందం కలుగుంది. పూర్వజన్మలో మేమిద్దరం అన్నదమ్ముల్లా జన్మించామని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. ఆయనకోలుకుని త్వరగా వచ్చేస్తాడని ఎదురుచూశాం. కరోనా అతిపెద్ద ఆవేదనను మిగిల్చింది. నేను యూఎస్‌లో ఉన్నందువల్ల రాలేకపోతున్నా. అనుమతి లేదు. జీవచ్చవంగా ఉన్న బాలాను చూస్తే నా హృదయం ద్రవించిపోతుంది. ఇకపై ఆయన జ్ఞాపకాలతో జీవిస్తా’’

- జె. ఏసుదాసు


దేవుడికి కన్ను కుట్టింది

‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనకందరికీ కావాల్సిన వ్యక్తి ఎస్పీ బాలుని వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. ఆయనతో నేను ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. మేమిద్దరం కలిసి ఎన్నో పాటలు పాడాం. బుల్లితెర వేదికగా ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమంతో ఎంతో మంది గాయనీగాయకులను ఆయన తయారు చేశారు. దేవుడికి కన్నుకుట్టినట్లుంది. మనందర్నీ దుఃఖసాగరంలో పడేయాలనుకున్నాడు. అందుకే మనకెంతో ఇష్టమైన వ్యక్తిని  తీసుకెళ్లిపోయాడు.’’

- సుశీల


డబ్బు వద్దనే వారు

‘‘తెలుగు కావొచ్చు, తమిళం కావొచ్చు. కన్నడం, మలయాళం, హిందీ... ఆయా  భాషల్లోని హీరోలకి వారిలాగే పాడి ఒప్పించి, మెప్పించిన మహోన్నతుడు బాలుగారు. నాకైతే ‘అర్ధరాత్రి స్వతంత్య్రం’, ‘ఎర్రసైన్యం’  మొదలుకొని మొన్నటి ‘అన్నదాత సుఖీభవ’ వరకు నన్ను కూడా అనుకరిస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్తేజంగా పాడారు.   ఆయనలో ఎంత గొప్ప గాయకుడు ఉన్నారో, అంత గొప్ప మానవీయ కోణమూ ఉంది. ‘అర్ధరాత్రి స్వతంత్య్రం’ నుంచి ‘నారాయణమూర్తిగారు ప్రజలకి ఉప  యోపగడే చిత్రాలు తీస్తున్నారు, ఆయన దగ్గర డబ్బు తీసుకోకూడద’ని తన వ్యక్తిగత సహాయకులకి చెప్పేవారు.’’

- ఆర్‌. నారాయణమూర్తి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.