రివ్యూ: బాఘి 3
close
Updated : 06/03/2020 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: బాఘి 3

చిత్రం: బాఘి 3

నటీనటులు: టైగర్‌ ష్రాఫ్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, శ్రద్ధా కపూర్‌, అంకిత లోఖండే, జమీల్‌ ఖౌరీ, దిశాపటానీ

మాటలు: ఫర్హాద్‌ సమ్జీ

కథ: సాజిద్‌ నదియాద్‌వాలా

నిర్మాత: సాజిద్‌ నదియాద్‌వాలా

దర్శకత్వం: అహ్మద్‌ ఖాన్‌

సంస్థ: ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌

విడుదల తేదీ: 06-03-2020

పలు యాక్షన్‌ ప్రధానమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌. ఇప్పటికే తెలుగులో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ‘వర్షం’, ‘క్షణం’ చిత్రాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘బాఘి’, ‘బాఘి 2’ చిత్రాలతో యాక్షన్‌ ప్రియులను మెప్పించిన టైగర్‌ తాజాగా ‘బాఘి 3’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. మరి ‘బాఘి 3’ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో తెలియాలంటే కథేంటో చూద్దాం.

కథేంటంటే: రోనీ(టైగర్‌ ష్రాఫ్‌), విక్రమ్‌(రితేశ్‌ దేశ్‌ముఖ్‌) అన్నదమ్ములు. వృత్తిరీత్యా పోలీస్‌ ఆఫీసర్‌ అయిన విక్రమ్‌ భయస్థుడు. చిన్నప్పటి నుంచి చాలా అమాయకుడిగా ఉంటాడు. వృత్తిలో కానీ, వ్యక్తిగతంగా కానీ అన్నయ్యకు ఎలాంటి ఆపదలు వచ్చినా రోనీ ముందుండి కాపాడుతుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నయ్యకు అన్నీ తానే అయి చూసుకుంటాడు. అయితే ఒకరోజు వృత్తిపరమైన పనుల కోసం సిరియా వెళ్లిన విక్రమ్‌ని జైష్‌-ఇ-లష్కర్‌కు చెందిన కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేస్తారు. విక్రమ్‌ను కాపాడేందుకు సిరియా వెళ్లిన రోనీ ఉగ్రవాదుల చెర నుంచి అతన్ని ప్రాణాలతో కాపాడగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే కథలు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ చాలా వచ్చాయి. ‘బాఘి3’ కూడా అదే కోవకు చెందినదే. ఒకప్పుడు కథలను పరిశీలిస్తే, తన తమ్ముళ్లకు కష్టం వస్తే, అన్నయ్య రంగంలోకి దిగేవాడు. కానీ, గత కొద్దికాలంగా ట్రెండ్‌ మారింది. ఇప్పుడు తమ్ముళ్లు దూకుడుగా వ్యవహరిస్తున్న కథలతో సినిమాలు వస్తున్నాయి. తెలుగులోనూ ‘తడఖా’(తమిళంలో వేట్టై) కూడా ఈ తరహా ఇతివృత్తంతోనే వచ్చింది. అలాగే దర్శకుడు అహ్మద్‌ఖాన్‌ అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని తెలియచేస్తూ ‘బాఘి 3’ ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ కథగా తీర్చిదిద్దారు. ప్రథమార్ధమంతా రోనీ, విక్రమ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలతో హాయిగా సాగిపోతుంది. దీనికి తోడు సియానందన్‌తో రోని ప్రేమ తదితర వ్యవహారాలతో సాగుతుంది. ఎప్పుడైతే విక్రమ్‌ సిరియా వెళ్తాడో అక్కడి నుంచి కథ సగటు కమర్షియల్‌ చిత్రంగా మారిపోయింది. ఉగ్రవాదులతో రోనీ పోరాటం, వారి చెర నుంచి తన అన్న విక్రమ్‌ను విడిపించుకునే ప్రయత్నం, భారీ యాక్షన్‌ సన్నివేశాలు తన అన్న ప్రాణాలు కాపాడటంతో కథ సుఖాంతం కావడం. ఇవి తప్ప దర్శకుడు కొత్తగా ఏమీ చూపించలేదు. భావోద్వేగాలతో సాగాల్సిన కథను యాక్షన్‌ బాట పట్టించాడు. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశ సైన్యాలే అడుగు పెట్టలేకపోయిన ఆ ప్రాంతంలో రోనీ ఒక్కడే వెళ్లడం, ఉగ్రవాదులతో పోరాటం చేయటం ఇవన్నీ హీరోయిక్‌గా ఉన్నాయి తప్ప కథకు అతికినట్లు కనిపించవు. 

ఎవరెలా చేశారంటే: ‘బాఘి 3’ టైగర్‌ వన్‌ మ్యాన్‌ షో అనే చెప్పాలి. ఎప్పటిలాగానే యాక్షన్‌ సన్నివేశాల్లో టైగర్‌ మెప్పించారు. ఆయనపై చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకుడిని అలరించేలా ఉన్నాయి. కాకపోతే ఎమోషనల్, కామెడీ సన్నివేశాల్లో టైగర్‌ ఇంకొంచెం మెప్పించేలా నటించి ఉంటే బాగుండేదనే భావన ప్రేక్షకుడిలో కలుగుతోంది. అమాయకుడైన యువకుడిగా విక్రమ్‌ పాత్రలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఒదిగిపోయారు. పేరుకి ‘బాఘి 3’ హీరోయిన్‌ అయినప్పటికీ శ్రద్ధా కపూర్‌ పాత్ర అంత ప్రభావంతమైనది కాదు. పాత్ర పరిధి వరకూ ఆమె నటించారు. అలాగే అందంగా కనిపించారు. ఉగ్రవాద సంస్థ ప్రధాన సూత్రధారి, ప్రతినాయకుడి పాత్రలో జమీల్‌ ఖౌరీ నటన మెప్పించేలా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలు తప్ప ఈ కథలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. దర్శకుడు అహ్మద్‌ఖాన్‌ కేవలం టైగర్‌ను దృష్టిలో పెట్టుకునే వాటిని రూపొందించారు. గుర్తుండిపోయేలా తీసిన సన్నివేశం ఒక్కటి కూడా కనిపించదు. నేపథ్యం సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు

+ టైగర్‌ ష్రాఫ్‌ 

+ యాక్షన్‌ సీక్వెన్స్‌

బలహీనతలు

- కథ, కథనం

- ఒక్కటి కూడా హత్తుకునే సన్నివేశం లేకపోవటం

చివరిగా: యాక్షన్‌ సన్నివేశాలు తప్ప ఏమీలేని ‘బాఘి3’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని