రివ్యూ: పెంగ్విన్‌
close
Updated : 19/06/2020 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: పెంగ్విన్‌

చిత్రం: పెంగ్విన్‌

నటీనటులు: కీర్తిసురేశ్‌, ఆదిదేవ్‌, లింగ, మాస్టర్‌ అద్వైత్‌, నిత్య, హరిణి తదితరులు

సంగీతం: సంతోష్‌ నారాయణ్‌

సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ పళని

ఎడిటింగ్‌: అనిల్‌ క్రిష్‌

నిర్మాత: కార్తీక్‌ సుబ్బరాజ్‌, కార్తికేయన్‌ సంతానం, సుధాన్‌ సుందరమ్‌, జయరామ్‌

రచన, దర్శకత్వం: ఈశ్వర్‌ కార్తీక్‌

బ్యానర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

వేసవి అంటే వినోదాల సందడి. వారానికో కొత్త సినిమా చూస్తూ అందరూ సెలవులను ఆస్వాదించేవారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో థియేటర్లు మూతబడ్డాయి. ఎంతో ఉత్సాహంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో కరోనా చిత్ర పరిశ్రమ ఆశలపై నీళ్లు చల్లింది. అదే సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో ఓటీటీలకు అలవాటు పడ్డారు. దీంతో దర్శక-నిర్మాతల చూపు ఓటీటీలవైపు మళ్లింది. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలకు ఏడారిలో ఒయాసిస్‌లా ఓటీటీ దొరికింది. ‘అమృతారామమ్‌’, ‘పొన్‌ మగళ్‌ వందాళ్‌’, ‘గులాబో సితాబో’ సహా పలు చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు కీర్తిసురేశ్‌ ‘పెంగ్విన్‌’ ఓటీటీ బాట పట్టింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఒక థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో నటించారు. అంతేకాదు, ఇందులో ఓ బిడ్డకు తల్లిగా నటిస్తుండటం విశేషం. దీంతో ‘పెంగ్విన్‌’పై అంచనాలు పెరిగాయి. మరి తొలి థ్రిల్లర్‌లో కీర్తిసురేశ్‌ ఎలా నటించారు? ఈశ్వర్‌ కార్తీక్‌ ఎలా తెరకెక్కించారు? అసలు ‘పెంగ్విన్‌’ కథేంటి?

కథేంటంటే: రిథమ్‌(కీర్తి సురేశ్‌), రఘు(లింగ) భార్యభర్తలు. వీరి ఒక్కగానొక్క కొడుకు అజయ్‌(మాస్టర్‌ అద్వైత్‌). అల్లారుముద్దుగా పెంచుకుంటారు. స్కూల్‌ పిల్లలలో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన అజయ్‌ కిడ్నాప్‌నకు గురవుతాడు.  రిథమ్‌, రఘులతో పాటు పోలీసులు వెతికినా కనపడడు. అజయ్‌ దుస్తులు అడవిలో అక్కడక్కడా పడి ఉండటం చూసి అతను చనిపోయాడని భావిస్తారు. అయినా, అజయ్‌ బతికే ఉన్నాడని రిథమ్‌ గట్టిగా నమ్ముతుంది. రిథమ్‌ తప్పిదం వల్లే అజయ్‌ కనపడకుండా పోయాడనే నెపంతో రఘు ఆమె నుంచి విడాకులు తీసుకుంటాడు. అయినా, రిథమ్‌ తన కొడుకు కోసం వెతకడం ఆపదు. ఈ సమయంలో గౌతమ్‌(రంగరాజ్‌)ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అయినా అజయ్‌ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతుంది. మరి కనపడకుండా పోయిన అజయ్‌ ఏమయ్యాడు? నిజంగా బతికే ఉన్నాడా? ఉంటే ఎవరు కిడ్నాప్‌ చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అజయ్‌తో పాటు అపహరణకు గురైన మరో ఆరుగురు పిల్లలు ఏమయ్యారు? పోస్టర్లు, ట్రైలర్‌లో కనిపించిన మాస్క్‌ మెన్‌ ఎవరు? అతనికీ ఈ కిడ్నాప్‌లకు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక మిస్టరీ థ్రిల్లర్‌. అతి తక్కువ బడ్జెట్‌, ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడంలో ఈ సబ్జెక్ట్‌లను కొట్టింది మరొకటి లేదు. ఇలాంటి సినిమాలకు కథ, కథనాలే ప్రాణం.  బిగిసడలని కథనంతో ప్రేక్షకుడికి ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వొచ్చు. దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ విషయంలో గట్టి ప్రయత్నమే చేశాడు. ఆరంభ సన్నివేశాల్లోనే అసలు కథ దేని గురించో ప్రేక్షకుడికి చెప్పేశాడు. ఆరేళ్ల బాలుడు కిడ్నాప్‌ అవ్వడం అన్న ప్లాట్‌ను రివీల్‌ చేసేశాడు. దీంతో ప్రేక్షకుడికి మనం ఒక మిస్టరీ థ్రిల్లర్‌ను చూడబోతున్నామన్న క్లారీటీ వచ్చేస్తుంది. అయితే, ఆ కిడ్నాప్‌ ఎవరు చేశారన్న ఒక్క పాయింట్‌తోనే రెండు గంటలకు పైగా కథను నడిపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని తీర్చిదిద్దాడు. అజయ్‌ అపహరణ గురవడం, అతను బతికే ఉన్నాడన్న నమ్మకంతో రిథమ్‌ వెతికే ప్రయత్నం చేయడం, తదితర సన్నివేశాలన్నీ ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయి. అడవిలోకి వెళ్లిన రిథమ్‌కు సడెన్‌గా అజయ్‌ కనిపించడంతో ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకున్నా, ఆ తర్వాత అతన్ని ఎవరు కిడ్నాప్‌ చేశారు? ఎందుకు చేశారన్న ప్రశ్నలతో మళ్లీ కథలో నిమగ్నం చేశాడు దర్శకుడు.

ద్వితీయార్ధంలో ఆ ఉత్కంఠను కొనసాగిస్తూనే, పిల్లల కిడ్నాప్‌ వెనుక ఎవరున్నారన్న చిక్కుముడులను విప్పుకొంటూ వెళ్లాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలన్నీ కథపై మరింత ఆసక్తిని పెంచుతాయి. ప్రతి పాత్రపైనా అనుమానం కలిగేలా చేస్తాయి. కథ చివరకు వచ్చేస్తుందన్న సమయానికి దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ చప్పగా ఉంటుంది. అజయ్‌ కిడ్నాప్‌నకు, మిగిలిన పిల్లల కిడ్నాప్‌నకు సంబంధం ఉండదు. ఇక్కడే కథనం పక్కదారి పడుతుంది. అప్పటివరకూ ఫలానా వ్యక్తి ఇవన్నీ చేశానని ఒప్పుకొంటూనే, అజయ్‌ను మాత్రం తాను కిడ్నాప్‌ చేయలేదని, అందుకు కారణాన్ని రిథమ్‌ ఆలోచించాలని చెప్పడంతో కథ తేలిపోయినట్లు ఉంటుంది. పోలీస్‌స్టేషన్‌లో జరిగే ఆయా సన్నివేశాలు కూడా కాస్త గందరగోళంగా ఉంటాయి. ఇక్కడే కథానాయిక గొప్ప ఇంటెలిజెంట్‌ అనే విషయం చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. చివరకు అజయ్‌ను కిడ్నాప్‌ చేయడం వెనుక కారణం కూడా చాలా సిల్లీగా ఉంటుంది. అందుకోసమే పగ సాధించాలా? ఏకంగా పిల్లలను కిడ్నాప్‌ చేయాలా? అనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే: ‘మహానటి’తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌ తొలిసారి ఒక మిస్టరీ థ్రిల్లర్‌ మూవీలో నటించారు. మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి వరకూ కీర్తినే తెరపై కనిపిస్తూ ఉంటుంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. తల్లిగా, నిండు గర్భిణిగా రిథమ్‌ పాత్రలో ఒదిగిపోయారు. కనపడకుండా పోయిన బిడ్డ కోసం తల్లి పడే తపనను చక్కగా ప్రదర్శించారు. మిగిలిన వాళ్లు ఎవరి పాత్రల పరిధి మేరకు వాళ్లు నటించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఒక్క నటుడూ లేడు. బహుశా బడ్జెట్‌ పరిమితుల దృష్ట్యా తమిళ నటులతోనే నడిపించారు.

సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. థ్రిల్లర్‌ చిత్రాలకు నేపథ్య సంగీతం బలం. ఆ విషయంలో సంతోష్‌ నారాయణ్‌ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారు. ఆయన సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. కార్తీక్‌ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. కొడైకెనాల్‌ అందాలతో పాటు, ఉత్కంఠ కలిగించేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. కానీ, కథనం ఆకట్టుకుంటుంది. ఉత్కంఠ కలిగించేలా బలమైన సన్నివేశాలున్నా, క్లైమాక్స్‌ చప్పగా ఉండటం ఈ సినిమాకు ప్రధాన మైనస్‌. 

బలాలు బలహీనతలు
+ ప్రథమార్ధం, స్క్రీన్‌ప్లే - క్లైమాక్స్‌
+ కీర్తి సురేశ్‌ - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
+ సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా: మీకు థ్రిల్లర్‌ మూవీలంటే ఇష్టమా! ‘పెంగ్విన్‌’ తప్పకుండా అలరిస్తుంది. ‘క్లైమాక్స్‌’ను మర్చిపోతే...!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని