బాలకృష్ణ-రానా కలిసి నటించనున్నారా?
close
Published : 31/03/2020 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ-రానా కలిసి నటించనున్నారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొంతకాలంగా అడపాదడపా మల్టీస్టారర్‌ సినిమాలు తళుక్కున తెలుగు తెరపై మెరుస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర కథానాయకులు యువ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లేవీ జరగడం లేదు. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా, దర్శకులు, కథానాయకులు కొత్త సినిమా కథల ఎంపికలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు కొత్త కథలను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘అయ్యప్పానుమ్‌ కొషియుమ్‌’ అనే మలయాళ చిత్ర రీమేక్‌ హక్కులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

పృథ్వీరాజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నందమూరి బాలకృష్ణతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడిచింది. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో మరో పాత్ర కోసం యువ కథానాయకుడు రానాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ విషయమై రానాతో సితార బృందం చర్చలు కూడా పూర్తి చేసిందని టాక్‌. త్వరలోనే దర్శకుడిని కూడా ఎంపిక చేయనున్నారట. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రానా ‘అరణ్య’, విరాట్‌ పర్వం’ చిత్రాల్లో నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. కాగా, బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో బాలకృష్ణ-రానాలు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కలిసి నటించారు. ఇక రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘నెంబర్‌ 1 యారీ విత్‌ రానా’ కార్యక్రమంలో చేసిన సందడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని