close
Published : 29/01/2020 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఫొటో పంచుకున్న ఎన్టీఆర్‌‌!

హైదరాబాద్‌: తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు, యావత్‌ భారత చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. కాగా, గతేడాది ప్రెస్‌మీట్‌ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ చిత్ర బృందం ఇప్పటివరకూ పంచుకోలేదు. కనీసం పండగలకు కథానాయకుల ప్రచార చిత్రాలనూ విడుదల చేయలేదు. దీంతో అభిమానుల నుంచి అసహనం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొన్ని చిత్రాలను పంచుకోవడం ప్రారంభించింది. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ చిత్రాలను పంచుకున్న సంగతి తెలిసిందే. 

కాగా, చాలా రోజుల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్‌ ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు స్వాగతం చెబుతూ రామ్‌చరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, రాజమౌళిలతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రకటన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్‌ పంచుకున్న చిత్రం బహుశా ఇదే కావచ్చు. 

‘‘అజయ్‌ దేవగణ్‌ సర్ ‌‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచంలోకి మీకు సాదర స్వాగతం’’-ట్విటర్‌లో ఎన్టీఆర్‌

‘‘అజయ్‌ దేవ్‌గణ్‌ సర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్స్‌లోకి మీకు స్వాగతం, మీతో పనిచేయడం ఎంతో ఇష్టం. అంతకుమించి మీ వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మీరు ఉండటం చాలా సంతోషం’’ -ఇన్‌స్టాలో రామ్‌చరణ్‌

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఓలివియా మోరిస్‌లు సందడి చేయనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కథానాయకులకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కోసం వేచి చూస్తున్న అభిమానులకు తారక్‌ పంచుకున్న ఈ ఫొటో కాస్త సంతోషాన్నిచ్చే అంశమే. 


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని