రెహమాన్‌ నిర్మాత, రచయితగా ‘99 సాంగ్స్‌’
close
Updated : 22/02/2020 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెహమాన్‌ నిర్మాత, రచయితగా ‘99 సాంగ్స్‌’

ముంబయి: మ్యూజికల్‌ రొమాంటిక్‌ చిత్రం ‘99 సాంగ్స్‌’తో సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మరో కొత్త అవతారంలో పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత, రచయితగానూ ఆయనే వ్యవహరిస్తుండటం విశేషం. అయితే కొత్త బాధ్యతల నిర్వహణ చాలా సవాలుగా ఉందని ఈ ఆస్కార్‌ అవార్డు గ్రహీత అంటున్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ లాంచ్‌ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఒక చిత్రానికి సంగీతం మాత్రమే సమకూరుస్తున్నపుడు ఆలోచనలను పంచుకోవడానికి అనుభవం ఉన్న దర్శకుడు, పాటల రచయిత, నిర్మాత వంటి వారు ఉంటారు. కానీ ఈ చిత్రంలో నేనే రచయితను. రచయితలు రాసేవి నిర్మాతలకు నచ్చాలి. ఇక్కడ అది కూడా నేనే... నేను ఓకే అన్నా దర్శకుడికి నచ్చకపోవచ్చు. అందుకే మేము ప్రతి పాటను మూడు నుంచి నాలుగు వెర్షన్లలో చేశాము. మూడు నెలల క్రితం వరకు మేము పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం ... ఇది చాలా చక్కని అనుభవం.’’ అని వివరించారు.

అంతర్జాతీయంగా రెహమాన్‌కు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఈ చిత్రానికి ఉపయోగపడతాయా అనే ప్రశ్నకు ఆయన అవునని అంటూనే...  ‘‘మేము ఈ చిత్రాన్ని అంబానీకి చెందిన జియో స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్నాం. నేను ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినైతే, వారు ఈ రంగంలో ఇప్పటికే తమను తాము నిరూపించుకుని ఉన్నారు. మేము వారి ఉద్దేశానికి అనుగుణంగానే నడుస్తాం.’’ అని స్పష్టం చేశారు.

99 సాంగ్స్‌ చిత్రానికి విశ్వేశ్‌ కృష్ణమూర్తి సహ రచయిత, దర్శకుడు కాగా... హీరో హీరోయిన్లుగా కొత్తవారైన ఇహాన్‌ భట్‌, ఎడిల్సే వర్గాస్‌లు పరిచయం కానున్నారు. వీరితో పాటు సీనియర్‌ నటీమణులు మనీషా కొయిరాలా, లిసా రేకూడా 99 సాంగ్స్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని