‘స్పైడ‌ర్’ విష‌యంలో ఇప్ప‌టికీ బాధ‌గా ఉంది!
close
Updated : 04/01/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్పైడ‌ర్’ విష‌యంలో ఇప్ప‌టికీ బాధ‌గా ఉంది!

దర్శకుడు మురుగదాస్‌

‘‘నెల రోజులు రాత్రిళ్లు చిత్రీక‌ర‌ణ అంటే ఏమాత్రం అసౌక‌ర్యానికి గురికాకుండా... ఒక్క రోజు కూడా నేను రాలేననో లేదంటే ఆల‌స్య‌మ‌వుతుంద‌నో  చెప్ప‌కుండా సెట్స్‌కి వ‌చ్చారు. చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. కానీ, ఆ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితాన్ని మాత్రం ఇవ్వ‌లేక‌పోయా. ‘స్పైడ‌ర్’ విష‌యంలో ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతుంటా’’ అన్నారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌. ర‌జ‌నీకాంత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ద‌ర్బార్’. న‌య‌న‌తార క‌థానాయిక‌. నివేదా థామస్‌, సునీల్‌శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మురుగ‌దాస్ శ‌నివారం హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించారు. 

రజనీకాంత్‌ను తొలిసారి ఎప్పుడు కలిశారు? 

మురుగదాస్‌: ఎవ్వ‌రు మంచి సినిమా చేసినా పిలిచి వాళ్ల‌తో మాట్లాడ‌టం ర‌జ‌నీకాంత్ అల‌వాటు. ఆయ‌న నా ‘గ‌జిని’ చూసి పిలిపించారు. సినిమా బాగుంద‌ని మెచ్చుకుని భుజం త‌ట్టారు. ఆయ‌నతో సినిమా చేయాల‌ని అప్పుడే అనుకున్నా. కానీ, అంత‌లోనే ‘గ‌జిని’ చిత్రాన్ని హిందీలో తీసే అవ‌కాశం రావ‌డం, ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ స‌ర్ కూడా ‘శివాజీ’, ‘రోబో’ త‌దిత‌ర సినిమాల‌తో బిజీ కావ‌డంతో మా కాంబినేషన్‌లో సినిమా కుద‌ర‌లేదు.

మరి ఆయనతో సినిమా చేయాలని ఎప్పుడు అనిపించింది?

మురుగదాస్‌: ‘స‌ర్కార్’ త‌ర్వాత మా ఇద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తుంద‌ని మీడియాలో వార్త‌లొచ్చాయి. చాలా మంది స్నేహితులు, తెలిసిన‌వాళ్లు ఫోన్ చేసి అభినందించ‌డం మొద‌లుపెట్టారు. అప్ప‌టికి మా క‌ల‌యిక‌లో సినిమా ఖ‌రారే కాలేదు. కానీ, ఈసారి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ప్ర‌చారాన్ని నిజం చేయాల‌నుకున్నా. 

వెంటనే రజనీకి కథ వినిపించారా?

మురుగదాస్‌: ర‌జ‌నీ స‌ర్‌కి క‌థ న‌చ్చ‌క‌పోతే  సినిమాని వాయిదా వేస్తారు. అందుకే ఎలాగైనా ఆయ‌న్ని ఒప్పించాల‌ని నాలుగైదు ర‌కాల క‌థ‌లు సిద్ధం చేసుకున్నా. క‌థ చెప్పాక వెంట‌నే  ఒప్పుకొన్నారు. అలా ‘దర్బార్‌’ కుదిరింది.

‘దర్బార్‌’ కథ ఎలాంటిది?

మురుగదాస్‌: ముంబయి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అక్క‌డి స‌మ‌స్య‌లు ఎలా ఉంటాయి? వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో అందుకు త‌గ్గ‌ట్టుగా ఈ క‌థ సిద్ధం చేశా.  పోలీసులంటే రియ‌ల్ హీరోలుగానే క‌నిపిస్తారు. వాళ్లు ఒక మంచి ప‌ని చేశారంటే అది మొత్తం తెలిసిపోతుంటుంది. మొన్న హైద‌రాబాద్‌లో జ‌రిగిన దిశ సంఘ‌ట‌న త‌ర్వాత పోలీసుల గురించి మొత్తం మాట్లాడుకున్నారు. అలాంటి సంఘ‌ట‌న‌ల్నే మా సినిమాలో కూడా చ‌ర్చించాం. 

అంటే దిశ ఘటన జరగకముందే ముందే ఈ అంశాలు మీ కథలో ఉన్నాయా?

మురుగదాస్‌: అవును! దిశ సంఘ‌ట‌న‌కి ముందే రాసుకున్న క‌థ ఇది. మేం చిత్రీక‌ర‌ణ చేశాక జ‌రిగిన దిశ సంఘ‌ట‌న గురించి ర‌జ‌నీకాంత్ స‌ర్ కూడా ఫోన్ చేసి ‘మ‌న సినిమాలోలాగే జ‌రిగింది చూశావా’ అని అడిగారు. ర‌జ‌నీకాంత్ స‌ర్ స్టైల్ అంశాల‌తో కూడిన ఓ పోలీస్ అధికారి క‌థ ఇది. అందరికీ వినోదం పంచుతుంది.

రజనీకాంత్‌కు మాస్‌లో విపరీతమైన ఇమేజ్‌ ఉంది. అందుకు తగినట్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా?

మురుగదాస్‌: చిన్న‌ప్ప‌ట్నుంచి ర‌జ‌నీకాంత్ స‌ర్‌ని చూస్తూ పెరిగాం. ఆయ‌న్ని తెర‌పై ఎలా చూశామో, ఎలా చూడాల‌నుకుంటామో అలాగే సినిమాని తీశా. కాక‌పోతే ఆ స‌న్నివేశాలు ఈ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఉంటాయి. ర‌జ‌నీకాంత్ స‌ర్  సింప్లిసిటీ, ఆయ‌న వ్య‌క్తిత్వం ఎప్పుడూ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటుంది. 

ఈ సినిమా షూటింగ్‌సందర్భంగా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా?

మురుగదాస్‌: ఇందులో ఒక స‌న్నివేశం తీస్తున్న‌ప్పుడు భారీ వ‌ర్షం వ‌చ్చింది. దాంతో చిత్రీక‌ర‌ణ క్యాన్సిల్ అయ్యింది. కానీ, ఛాయాగ్రాహ‌కుడు సంతోష్ శివన్ వాన‌లోనే చిత్రీక‌ర‌ణ చేద్దాం అన్నారు.  ‘న‌టులు వ‌ర్షంలో త‌డుస్తూ సినిమా చేయ‌గ‌ల‌రా?  రెయిన్ స‌న్నివేశాలు తీస్తున్న‌ప్పుడు షాట్ అయిపోగానే ప‌క్కకొచ్చి తుడుచుకుని, మ‌ళ్లీ కెమెరా ముందుకు వెళ‌తారు. కానీ, నాన్‌స్టాప్‌గా వాన‌లో చిత్రీక‌ర‌ణ అంటే న‌టులెవ్వ‌రూ ఒప్పుకోరు క‌దా అన్నా’ ర‌జ‌నీకాంత్ స‌ర్ ‘నేను చేస్తా’ అన్నారు. ఆయ‌నే వ‌చ్చిన‌ప్పుడు ఇక మిగ‌తావాళ్లు ఎందుకు చేయ‌రు? అలా సెట్‌లో మ‌మ్మ‌ల్ని చాలా విష‌యాల్లో ఆశ్చ‌ర్యానికి గురిచేశారు.

ఈ సినిమా విషయంలో రజనీకాంత్‌ మీకు ఏమైనా సలహాలు ఇచ్చారు?

మురుగదాస్‌: ఈ సినిమా విషయంలో రజనీసర్‌ ఒక మంచి సలహా ఇచ్చారు. ‘ఇప్పుడంటే ఒక్కొక్కసారి ఒక్కో సినిమానే విడుద‌ల‌వుతోంది. కానీ, ఇదివ‌ర‌కు పండ‌గంటే ఒకే రోజు నాలుగైదు సినిమాలు విడుద‌ల‌య్యేవి. అప్ప‌ట్లో  మ‌రి మీ సినిమా ఫెయిల్ అయిందంటే ఆ ప్ర‌భావం నుంచి ఎలా బ‌య‌టికొచ్చేవారు’ అని రజనీ సర్‌ని అడిగా.. అందుకు ఆయన  ‘నా సినిమా ఎలా ఉంది? ఎంత వ‌సూళ్లు సాధించింద‌నేదే తెలుసుకుంటాను. మిగ‌తా సినిమాల్ని నేను ఒక సాధార‌ణ ప్రేక్ష‌కుడిగా చూసి ఆనందించ‌డ‌మే త‌ప్ప‌, అది నాకు పోటీ క‌థానాయ‌కుడిదా? ఎన్ని వ‌సూళ్లు తెచ్చిందనే విష‌యాల్ని అస్స‌లు ఆరా తీయ‌ను. మీరు కూడా అదే చేయండి. మీ గ‌త సినిమాతోనే మీరు పోటీ ప‌డండి. మిగ‌తావాళ్ల సినిమాల గురించి ఆలోచించొద్దు’ అని చెప్పారు. అలా ఆయన్నుంచి ఎన్నో గొప్ప  విష‌యాలు తెలుసుకున్నా. 

‘స్పైడర్‌’ పరాజయం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
మురుగదాస్‌: తెలుగు సినిమా చేస్తున్న‌ప్పుడు ఏదో  మిస్ అవుతోంది. ఈసారి అలా జ‌ర‌గ‌కుండా ఒక మంచి క‌థ‌తో ప‌క‌డ్బందీగా సినిమా చేస్తా.

మరి మహేశ్‌బాబు ఎలా స్పందించారు?

మురుగదాస్‌: ‘స్పైడ‌ర్’` త‌ర్వాత వారం రోజుల‌పాటు రోజూ నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఒక హిట్టు త‌ర్వాత ద‌ర్శ‌కుడు, హీరో మ‌ధ్య మ‌రింత సాన్నిహిత్యం పెర‌గొచ్చు. కానీ, ఒక ఫెయిల్యూర్ త‌ర్వాత కూడా ఆయ‌న నాకు అండ‌గా నిలిచిన విధానం న‌న్ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ‘ద‌ర్బార్’ టీజ‌ర్ విడుద‌ల స‌మ‌యంలో కూడా నేను మెసేజ్ పెట్టింది చూసి వెంట‌నే స్పందించి ట్వీట్ చేశారు. మ‌హేష్ పాల తెలుపుతో క‌నిపిస్తుంటాడు. కానీ ఆయ‌న మ‌న‌సు కూడా అంతే తెలుపు.  ‘స్పైడ‌ర్’కి ముందు ఆయ‌న చేసిన సినిమా ఫ్లాప్ అయ్యింది. దాని త‌ర్వాత మ‌ళ్లీ నేను ఫ్లాప్ ఇవ్వ‌డం చాలా బాధేసింది.

త‌దుప‌రి సినిమాల గురించి?

మురుగదాస్‌: ఇంకా ఏమీ ఆలోచించ‌లేదు. నేనే స్వయంగా వెల్లడిస్తా!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని