నాని రీమేక్‌లు టచ్‌ చేయడు
close
Published : 03/02/2020 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని రీమేక్‌లు టచ్‌ చేయడు

టైటిల్‌ ఇచ్చినందుకు ప్రభాస్‌కు థ్యాంక్స్‌.. దిల్‌ రాజు

హైదరాబాద్‌: డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా మారి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను సినీ ప్రియులకు అందించిన వ్యక్తి.. దిల్‌ రాజు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘జాను’. తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘96’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దిల్‌రాజు విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా తాను తెరకెక్కించనున్న సినిమాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలివే..

హృదయాన్ని తాకింది..

‘96’ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడు.. ఓ వ్యక్తి నాకు ఆ వీడియోను పంపించారు. ఎందుకో తెలియదు ఆ టీజర్‌ నాకు బాగా నచ్చేసింది. అప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఫాలో అయ్యేవాడిని. నాకు తెలిసిన వాళ్ల సాయంతో ‘96’ ఫస్ట్‌కాఫీని ఆ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌తో కలిసి చూశాను. నాకు తమిళం రానప్పటికీ ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం నా హృదయాన్ని తాకింది.

రూ.15లక్షలు ఎక్కువ ఇచ్చాను..

ప్రేమ్‌కుమార్‌ ‘ఆర్య’ సినిమాకు అసిస్టెంట్‌ కెమెరా మెన్‌గా చేశారు. ‘96’ ఫస్ట్‌ కాఫీ చూడడానికి చెన్నై వెళ్తున్నప్పుడు నాకు తెలిసిన వ్యక్తి ఆ విషయం చెప్పారు. ఫస్ట్‌ కాఫీ చూసిన వెంటనే నిర్మాతతో డబ్బుల విషయం మాట్లాడి రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్నాను. ఈ కథ నా హృదయానికి టచ్‌ అయ్యింది. అందుకే నిర్మాత అడిగిన దానికంటే రూ.15 లక్షలు ఎక్కువ ఇచ్చాను. 

నేను చేసిన మంచి పని అదే..

‘96’ ఫస్ట్‌కాఫీ చూసిన వెంటనే డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడాను. ‘96’ రీమేక్‌కు పనిచేయమని అడిగాను. నెల రోజుల తర్వాత ‘96’ సినిమా విడుదలైన సమయంలో మొదటి రోజు చెన్నైకి వెళ్లి థియేటర్లలో ప్రేక్షకుల రియాక్షన్‌ చూశాను. ఆ వెంటనే ప్రేమ్‌కుమార్‌ను ‘జాను’ సినిమాకి ఫిక్స్‌ చేసేశాను. నాకు తెలిసి ‘జాను’ సినిమాకు నేను చేసిన మంచి పని అదే.

చాలా కామెంట్లు వచ్చాయి

నేను ‘96’ సినిమాని రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించగానే చాలా కామెంట్లు వచ్చాయి. అది క్లాసిక్‌ మూవీ. అలాంటి సినిమాలను రీమేక్‌ చేయకూడదు అని చాలా మంది అన్నారు. కానీ నాకు కథ బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాని మరింత దగ్గర చేయాలనుకున్నాను అందుకే రీమేక్‌ చేస్తున్నాను. ఈ సినిమాకు కనెక్ట్‌ అయితే కన్నీళ్లు వచ్చేస్తాయి.

సమంత భయపడినప్పటికీ.. 

‘96’ రీమేక్‌ అనుకున్నప్పుడు నా మైండ్‌ సమంత దగ్గరే ఆగిపోయింది. సమంత ఒప్పుకున్నాకే హీరో గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. అలా సమంతను ఒప్పించడానికి చాలా టైం పట్టింది. సమంత ఒప్పుకోగానే.. శర్వాకి ‘96’ సినిమా చూపించాను. నా మీద ఉన్న గౌరవంతో శర్వా వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ సినిమా చేయడానికి సమంత చాలా భయపడింది. చివరికి ఒప్పుకుంది. షూటింగ్‌కి వచ్చిన మొదటిరోజు నుంచి డైలీ ‘ఈ మూవీలో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంది సర్‌. థ్యాంక్యూ ఇలాంటి గొప్ప సినిమాలో నన్ను పార్ట్‌ చేసినందుకు’ అని మెస్సేజ్‌లు పంపిస్తుండేది.

నాని, బన్నీ చూసి..

‘96’ సినిమా రీమేక్‌ చేయాలని అనుకున్నాక.. ఆ సినిమా రీలీజ్‌కి ముందు ఓ కాపీని నాని, బన్నీకి చూపించాను. నాని ఈ సినిమా చూసి.. ‘సూపర్బ్‌’ అన్నారు. అలాగే బన్నీ కూడా ఇది మంచి క్లాసిక్‌ మూవీ అన్నారు. నేను వాళ్లకు చూపించింది కేవలం అభిప్రాయం తీసుకోడానికి మాత్రమే. ఎందుకంటే నాని రీమేక్‌లు చేయడు. తను ఆ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు.

కొన్ని మార్పులు..

‘జాను’ విషయంలో ప్రేమ్‌కుమార్‌పై నేను ఎలాంటి ప్రెజర్‌ పెట్టలేదు. కాకపోతే తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న చిన్న మార్పులు చేశాం. సమంత, శర్వా చాలా అద్భుతంగా నటించారు. షూటింగ్‌ కంప్లిట్‌ అయ్యాక కాపీ చూసి చాలా సంతోషించాను. ‘96’ సినిమా చూసినప్పుడు నాకెలాంటి ఫీలింగ్‌ వచ్చిందో ‘జాను’ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్‌ వచ్చింది.

బెంగళూరు డేస్‌ అనుకున్నా..కానీ..

రీమేక్‌ చేయకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుంచి వాటి జోలికి వెళ్లలేదు అంతే. ‘ప్రేమమ్‌’, ‘బెంగళూరు డేస్‌’ సినిమాలు నాకు బాగా నచ్చాయి. ‘బెంగళూరు డేస్‌’ రీమేక్‌ చేయాలనుకున్నాం. దాని మీద వర్క్‌ చేశాం. ‘బెంగళూరు డేస్‌’లోని ఓ పాత్రకు నాని, మరో పాత్రకు శర్వానంద్‌ను అనుకున్నాం. కాకపోతే మూడో హీరో పాత్రకు ఎవరూ సెట్‌ కాలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్‌ను అలా ఉంచాం. అదే సమయంలో ‘ప్రేమమ్‌’ తీయాలనుకున్నాను. అప్పుడే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వాళ్లు ‘ప్రేమమ్‌’ రీమేక్‌ చేస్తామని చెప్పగానే సరే అన్నాను. ప్రస్తుతం ఓకే ఇయర్‌లో మూడు రీమేక్‌లు చేస్తున్నాను. ఒకటి ‘పింక్‌’ తెలుగు రీమేక్‌.. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌.. ‘96’ తెలుగు రీమేక్‌.

ప్రభాస్‌కి థ్యాంక్స్‌ టైటిల్‌ ఇచ్చారు..

‘96’ సినిమా రీమేక్‌ అనుకున్నాక టైటిల్‌ కోసం చాలా ఆలోచించాను. నా హార్ట్‌ జాను అనే టైటిల్‌ దగ్గరే ఆగిపోయింది. అయితే ప్రభాస్‌ నటిస్తున్న సినిమాకి ‘జాన్‌’ అనే టైటిల్‌ అనుకున్నారు. ఆ సమయంలో నేను యూవీ క్రియేషన్స్‌ వారిని సంప్రదించి టైటిల్‌ గురించి చెప్పాను. కొన్నిరోజులు ఆలోచించిన తర్వాత వాళ్లు నాకు ఫోన్‌ చేసి.. ‘‘జాను’ టైటిల్‌ పెట్టుకోండి. మా సినిమా రావడానికి చాలా టైం ఉంది కదా. మాకు ఇబ్బంది లేదు’ అని చెప్పారు. అలా నేను ఈసినిమాకి ‘జాను’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశాను. థ్యాంక్యూ ప్రభాస్‌ టైటిల్‌ ఇచ్చినందుకు.

పవన్‌ సినిమా విడుదల అప్పుడే..

2012లో పవన్‌కల్యాణ్‌ నటించిన గబ్బర్‌సింగ్‌ చిత్రం మే నెలలో విడుదలయ్యింది. కాబట్టి ‘పింక్‌’ సినిమా రీమేక్‌ను కూడా వేసవి కానుకగా ఈ ఏడాది మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం మేము ‘జాను’, ‘వి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాం. ఉగాదికి ‘వి’ రిలీజ్‌ అయ్యాక ‘పింక్‌’ సినిమా ప్రమోషన్స్‌ గురించి ఆలోచిస్తాం. ‘పింక్‌’ సినిమా కథలో చాలా మార్పులు చేసి తెలుగు వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నాం.

మహేశ్‌ నెక్ట్స్‌ ఆయనతోనే ఫిక్స్‌..

వంశీపైడిపల్లి డైరెక్షన్‌లో మహేశ్‌ ఓ సినిమా చేయనున్నారు. మహేశ్‌ నెక్ట్స్‌ సినిమా అదే. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్‌3’ సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. నటీనటుల గురించి ప్రకటిస్తాం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని