వజ్రోత్సవాలకు పిలవకపోవడం బాధనిపించింది
close
Updated : 06/07/2021 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వజ్రోత్సవాలకు పిలవకపోవడం బాధనిపించింది

అప్పుడు అందరూ నన్ను రాజకుమారిగానే చూసేవారు

సినిమా అనేది ఒక అందమైన లోకం.. అందులో అడుగు పెట్టింది రాజశ్రీ అనే అపురూపు సౌందర్యం..ప్రేక్షకులు ఆరాధించారు.. అభిమానించారు.. ఆమె ఒక చలాకీ మాటల వరద.. అభిమానుల మనసును హత్తుకున్న ప్రేమ పరదా..ఆమే అలనాటి సీనియర్‌ నటి రాజశ్రీ. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలను పంచుకున్నారిలా..!

ఎలా ఉన్నారు?

రాజశ్రీ: చాలా చాలా బాగున్నా.

మీ అసలు పేరేంటి?

రాజశ్రీ: కుసుమ కుమారి.. వెండితెరపై రాజశ్రీ.. మలయాళంలో నన్ను గ్రేసీ అనిపిలుస్తారు. ఇంట్లో అందరూ కుమారి అని పిలుస్తారు. 

‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’లోని పాటతో మీరు చాలా పాపులర్‌ అయిపోయారు.

రాజశ్రీ: అవునండీ! అప్పట్లో ఆ పాట చాలా పాపులర్‌ అయింది. పద్మనాభంగారు ప్రొడ్యూసర్‌. ఆ సినిమాలో శోభన్‌బాబు, కృష్ణ, హరినాథ్‌, రామకృష్ణ  కలిసి ఒక శిల్పాన్ని చెక్కి ప్రాణం పోస్తారు. ఒకరు శిల్పాన్ని చెక్కితే, మరొకరు బట్టలు వేస్తారు. ఒకరు నగలు పెడతాడు. మరొక వ్యక్తి ప్రాణం పోస్తాడు. అప్పుడు ఆ శిల్పం అమ్మాయిలా మారుతుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆ నలుగురూ పోటీ పడితే మర్యాద రామన్న వచ్చి తీర్పు చెబుతాడు. ఎందుకంటే శిల్పం చెక్కిన వ్యక్తి బ్రహ్మ అవుతాడు. ప్రాణం పోసిన వ్యక్తి దేవుడు అవుతాడు. నగలు పెట్టిన వ్యక్తి అన్నయ్య అవుతాడు. బట్టలు ఇచ్చి, మానం కాపాడిన వ్యక్తి భర్త అవుతాడని తీర్పు చెబుతాడు. 

ఆ పాటలో మీరు చాలా బాగా డ్యాన్స్‌ వేశారు. మీరు డ్యాన్స్‌ నేర్చుకున్నారా?

రాజశ్రీ: చిన్నప్పుడు స్కూల్లో డ్రామా వేస్తే కృష్ణుడిగా, మేనకగా రెండూ నేనే వేసేదాన్ని. డ్యాన్స్‌ అంటే చాలా పిచ్చి. ఆ తర్వాత జమునగారి ‘నాగుల చవితి’ చిత్రానికి ఏవీఎం వాళ్లు మూడేళ్లు నన్ను బుక్‌ చేశారు. అక్కడ దండాయుధపాణి పిళ్లై మాస్టర్‌గారి వద్ద డ్యాన్స్‌ నేర్చుకున్నా. అక్కడే హిందీ, ఉర్దూ కూడా నేర్చుకున్నా. ఆ తర్వాత ఐదు భాషల్లో నటించా. 

మీతో డ్యాన్స్‌ చేయడానికి హీరోలు ఇబ్బంది పడేవాళ్లా?

రాజశ్రీ: అప్పట్లో హీరోలకు పెద్దగా డ్యాన్స్‌లు ఉండేవి కావు. హీరోయిన్లే డ్యాన్స్‌ చేసేవారు. ‘ప్రేమించి చూడు’లో మాత్రం హీరో స్టెప్‌లు వేస్తాడు. ఎంజీఆర్‌గారితో తమిళంలో తొలి చిత్రంలో చేసిన డ్యాన్స్‌కు మంచి పేరు వచ్చింది. కరుణానిధిగారి చిత్రం ‘పూంబుహార్‌’లో మొత్తం నా డ్యాన్స్‌లే ఉంటాయి. అవన్నీ నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

హీరోయిన్‌గా మీ మొదటి చిత్రం ఏది?

రాజశ్రీ: ‘కాదళిక్కి నేరమిల్లే’. తెలుగులో ఇదే సినిమాను ‘ప్రేమించి చూడు’ అనే పేరుతో అక్కినేనిగారితో తీశారు. హిందీలో ‘ప్యార్‌కియే జా’ గా శశికపూర్‌తో తీశారు. మూడు భాషల్లోనూ నేనే నటించా. 

మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?

రాజశ్రీ: దాదాపు 300లకు సినిమాలకు పైగా నటించా.

మీకు సినిమాల్లో నటించే అవకాశం ఎలా వచ్చింది?

రాజశ్రీ: చిన్నప్పుడు షూటింగ్‌ చూడటానికని స్టూడియోకు వెళ్లాను. అక్కడ రిహార్సల్‌ జరుగుతున్నాయి. నేను దూరం నుంచి చూస్తుంటే, చెట్టియార్‌గారు నన్ను చూసి ‘ఈ అమ్మాయి బాగుంది. సినిమాలోకి తీసుకుందాం’ అన్నారు. జమునగారు కూడా అలాగే అన్నారు. విషయం ఇంట్లో చెబితే మా అమ్మ ఒప్పుకోలేదు. ‘చిన్న బిట్‌. శివుడి దగ్గర డ్యాన్స్‌’ అని చెబితే ఒప్పుకొన్నారు. ఆ తర్వాత పర్మినెంట్‌ ఆర్టిస్ట్‌గా బుక్‌ చేశారు. 

చెన్నైలో మీ పేరు మీద వీధి ఉందట!

రాజశ్రీ: (నవ్వులు) ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా ఉన్నవాళ్లందరూ అప్పట్లో నన్ను చూసేందుకు మా వీధిలో నిలబడేవారు. అక్కడ రెండు ఇళ్లు, షాపులు, హోటల్‌ కూడా మాదే. మా వీధిలోనే విజయ నిర్మలగారు, చిరంజీవిగారు ఉండేవారు. 

సావిత్రితో ఎలాంటి అనుబంధం ఉండేది?

రాజశ్రీ: ఆమెతో కలిసి ‘మనషులు మమతలు’ చిత్రంలో చేశా. ఆ తర్వాత ‘నవరాత్రి’లో చేయాల్సింది. కుదరలేదు. 

అప్పట్లో మీరు 9గదులుండే ఇల్లు కట్టుకున్నారట!

రాజశ్రీ: అప్పట్లో పెద్ద పెద్ద ఇళ్లు అంటే గొప్పగా చెప్పుకొనే వారు. ఇప్పుడు ఆ తొమ్మిది గదుల్లో అన్నీ లాక్‌ చేసి ఒకేదానిలో ఉంటున్నా. మా అబ్బాయి చదువుకోసం నేను కూడా అతనితో కలిసి అమెరికా వెళ్లిపోయా. తన చదవుంతా అక్కడే పూర్తయింది. ఆ తర్వాత నటి లత బంధువుల అమ్మాయితో పెళ్లి చేసేశాం. ఇప్పుడు ఆ ఒక్క గదిలోనే ఉంటాను. 

మీరు నటించడం మానేసిన 40ఏళ్లకు అవార్డు వచ్చిందట!

రాజశ్రీ: ‘కళైమా మణి’ అవార్డు అది. అప్పట్లో ఎంజీఆర్‌గారు సీఎంగా ఉండగా ఆయన చేతుల మీదుగా అందుకోవాల్సింది. కుదరలేదు. ఆ తర్వాత కరుణానిధిగారు సీఎం అయ్యారు.. ఆయన చేతుల మీదుగా అందుకోవాల్సింది అప్పుడూ సాధ్యం కాలేదు. జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అబ్బాయి పెళ్లికి వచ్చినప్పుడు ‘కళైమా మణి అవార్డు తీసుకున్నావా’ అని అడిగారు. ‘లేదు’ అని చెబితే, అప్పటికప్పుడు లెటర్‌రాసి పంపారు. అయితే, ఆవిడ చనిపోవడంతో ఇప్పుడున్న సీఎం మీదుగా అందుకున్నా. 

ఇక్కడ వజ్రజోత్సవం నిర్వహించినప్పుడు మిమ్మల్ని పిలవలేదని మీరు ఫీలయ్యారట!

రాజశ్రీ: అవును! అది నిజం. నాతోటి ఆర్టిస్ట్‌లను చాలామందిని పిలిచారు. నన్ను ఎందుకు పిలవలేదో నాకూ తెలియదు. మాకు పెళ్లయిన ఆరేళ్లకే ఆయన చనిపోయారు. దీంతో పదేళ్ల పాటు ఎవరితోనూ మాట్లాడలేదు. ఇంటి నుంచి బయటకు కూడా పెద్దగా వచ్చేదాన్ని కాదు. మా అబ్బాయి అమెరికా వెళ్లడంతో నాకు ఒంటరితనం మరింత పెరిగింది. ఒకసారి అల్లు రామలింగయ్యగారి ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్తే, ‘మీరు చెన్నైలోనే ఉన్నారా’ అని చాలా మంది అడిగారు. ఆ తర్వాత జయలలిత ఎంజీఆర్‌ అవార్డును ఇంటికి పంపారు. నేను తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా నటించా. అలాంటిది నన్ను తెలుగు వాళ్ల కార్యక్రమానికి ఎందుకు పిలవలేదు? అని బాధనిపించింది. 

ఎవరినీ కలవకపోవడానికి వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా?

రాజశ్రీ: ఏమీ లేదు. ఖాళీగానే ఉండేదాన్ని. టీవీ సీరియల్స్‌లో నటించమని చాలా మంది అడిగారు. నాకు కూడా పెద్దగా ఆసక్తిలేదు. మా అబ్బాయి ఏమంటాడోనని ‘నాన్నా.. టీవీ సీరియల్స్‌లో నటించమని అడుగుతున్నారు. చేయనా..’ అని అడిగా. ‘అమ్మా నీకు ఇంకా నటించే ఓపిక ఉందా. హాయిగా ఉండేదానికి ఎందుకమ్మా లేనిపోని ఒత్తిడులు’ అని అన్నాడు. 

మీ తండ్రి ఏం చేసేవారు?

రాజశ్రీ: మా నాన్నగారు ఏలూరు స్టేషన్‌మాస్టర్‌గా పనిచేశారు. ఆయన చనిపోయిన తర్వాత చెన్నై వెళ్లిపోయాం. ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోయాం.

మీకు వివాహం ఎప్పుడైంది?

రాజశ్రీ: 1977లో జరిగింది. ఆయన పేరు తోట పాంచజన్యం. రాజకీయాల్లో ఉండేవారు. వెంగళరావుగారు సీఎంగా ఉన్న సమయంలో ఆయన చీఫ్‌ విప్‌. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షనాయకుడిగా చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన నన్ను చూసి ఇష్టపడ్డారు. అయితే, నాకు మాత్రం అప్పటికి ఎలాంటి ఇష్టం లేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోమని మా సిస్టర్‌ ఒత్తిడి చేసేది. దాంతో పెళ్లికి ఒప్పుకొన్నా.  మా ఆయన ఆస్పత్రిలో ఉండగా, ఎన్టీఆర్‌ స్వయంగా వచ్చి పలకరించారు. ఆ సమయంలో నాకు అన్ని విధాలా ఎన్టీఆర్‌ అండగా నిలిచారు. 

భోజనం చేసిన తర్వాత అక్కినేని మిమ్మల్ని వాకింగ్‌కు తీసుకెళ్లేవారట!

రాజశ్రీ: పొల్లాచిలో ఆలియర్‌ డ్యామ్‌ అనే పెద్ద భవనం ఉండేది. అక్కడ ఎక్కువగా షూటింగ్‌లు జరుగుతూ ఉండేవి. సాధారణంగా భోజనం అయిపోయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకొంటాం. కానీ, అక్కినేని గారి సినిమా షూటింగ్‌ అయితే, ఆయన మమ్మల్ని వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. చాలా సరదాగా ఉండేది. 

ఎన్టీఆర్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?

రాజశ్రీ: ఆయనతో నటిస్తుంటే చాలా భయం వేసేది. మా తొలి సినిమా ‘అగ్గిబరాటా’. ఆ తర్వాత ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించా.

1972లో మీకు యాక్సిడెంట్‌ అయిందట!

రాజశ్రీ: అవును! అప్పుడు ఒక కన్నడ సినిమాలో నటిస్తున్నా. అందులో నాది బాగా డబ్బున్న అమ్మాయి పాత్ర. అయితే, నేను కారు నడపాల్సి వచ్చింది. నాకు పెద్దగా డ్రైవింగ్‌ రాదు. లాంగ్‌ షాట్‌. కెమెరా దూరంగా పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఒక మలుపు దగ్గరకు వచ్చే సరికి కారు కంట్రోల్‌ కాలేదు. మరోవైపు ఎదురుగా లారీ, వెనుకవైపు ఎద్దులబండి వస్తున్నాయి. దాంతో కారును తీసుకెళ్లి పెద్ద దిమ్మకు గుద్దేశా. అంతే స్టీరింగ్‌ నా పక్కటెములకు బలంగా గుద్దుకుంది. ముక్కు నుంచి రక్తం వచ్చేసింది. నేను చనిపోయానని అనుకున్నారు. దేవుడి దయ వల్ల బయటపడ్డా. చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డా. 

మీరన్నీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాల్లోనే నటించారా?

రాజశ్రీ: లేదు. తమిళంలో నేను చేసిన సినిమాలన్నీ కలర్‌ పిక్చర్లే. తెలుగులో ఒక సినిమా చేశా. వివాహం అనంతరం సినిమాల్లో నటించకూడదని మావారు చెప్పడంతో ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ‘పెళ్లి తర్వాత సినిమాలు చేయను’ అని ప్రకటన కూడా ఇచ్చా. ఆ తర్వాత త్వరత్వరగా అన్నిసినిమాలు పూర్తి చేసేశా. వాణశ్రీయే నన్ను పెళ్లి కూతుర్ని చేసింది. ఒక తమిళ చిత్రం మాత్రం పూర్తి కాలేదు. పెళ్లయిన తర్వాత వాళ్లు చేయమని అడిగారు. నేను కుదరదని చెప్పా. నాపై కేసు వేస్తానని అన్నారు. మావారు చాలా మొండి.‘వేస్తే వేసుకోమను’ అన్నారు. చివరకి వాళ్లు ఏదో డూప్‌ను పెట్టుకుని సినిమా పూర్తి చేశారు. 

కృష్ణకుమారితో మీకు అనుబంధం ఎలా ఉండేది?

రాజశ్రీ: ఆమె టాప్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాల్లో నేను సెకండ్‌ హీరోయిన్‌గా చేసేదాన్ని. ఆ తర్వాత ఆమెకు వివాహం కావడంతో మెయిన్‌ హీరోయిన్‌గా నాకు అవకాశాలు వచ్చేవి.

ఆనాటి వాళ్లను ఇప్పటికీ కలుస్తున్నారా?

రాజశ్రీ: అప్పట్లో కంటే ఇప్పుడే ఎక్కువ కలుస్తున్నాం. రోజూ ఫోన్‌లో కూడా మాట్లాడుకుంటాం. 

మీరు హాంకాంగ్‌ వెళ్తే కస్టమ్స్‌ వాళ్లు ఆపేశారట!

రాజశ్రీ: అది తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. మేము ఎప్పుడు అమెరికా వెళ్లినా మా అబ్బాయి, హాంకాంగ్‌, అక్కడి నుంచి శాన్‌ఫ్రాన్సికోకు టికెట్లు బుక్‌ చేస్తాడు. ఎవరైనా నీ మీదకు వస్తే ఇది స్ప్రే చేయ్‌ అని పెప్పర్‌ స్ప్రే ఇచ్చాడు. దాన్ని నా హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకున్నా. చెకింగ్‌లో అది బయట పడింది. దాంతో మమ్మల్ని ఆపేశారు. ఆ తర్వాత ‘మా అమ్మకు తెలియక పెట్టుకొచ్చింది’ అని వివరిస్తే వాళ్లు వదిలేశారు. 

ఎక్కువ జానపద చిత్రాలు చేయడంలో ఏమైనా కారణం ఉందా?

రాజశ్రీ: ఒక సీజన్‌లో అన్నీ జానపద చిత్రాలే చూసేవారు. అప్పుడు అందరూ నన్ను రాజకుమారిగానే చూసేవారు. చిన్నప్పుడు చందమామ కథలు ఎక్కువగా చూసేదాన్ని.

మీరు సినిమా నటి అయినందుకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
రాజశ్రీ: సినిమా నటి కావడం వల్ల నన్ను పెళ్లి చేసుకోనని చెప్పారు. కట్నం ఎక్కువ ఇస్తే చేసుకుంటానని చెప్పారు. ‘నాకు అసలు పెళ్లే వద్దు’ అని చెప్పా. 

అల్లు రామలింగయ్య మీ ఇంటికి వచ్చి ‘చిరంజీవి అనే కుర్రాడిని మా అమ్మాయికి ఇస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి’ అని అడిగారట!

రాజశ్రీ: చిన్నప్పటి నుంచి అల్లు రామలింగయ్యగారి కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉండేవి. వాళ్ల ఇంట్లో పిల్లలతో కలిసి ఆడుకునేదాన్ని. ‘అత్తను దిద్దిన కోడలు’ సినిమా షూటింగ్‌ సందర్భంగా అల్లు రామలింగయ్యగారు వచ్చి, ‘కొత్తగా ఒక కుర్రాడు వచ్చాడు. చాలా బాగుంటాడు. డ్యాన్స్‌లు కూడా బాగా చేస్తాడు. మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇద్దామని అనుకుంటున్నాం. ఏమంటారు’ అని అడిగారు. ‘కొత్త అబ్బాయి.. అందులోనూ డ్యాన్స్‌లు ఇరగదీస్తున్నాడంటే మంచి భవిష్యత్‌ ఉంటుంది. కానిచ్చేయండి’ అని అందరం చెప్పాం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని