మహా అయితే రెండుమూడేళ్లు నటిస్తానేమో!
close
Published : 07/02/2020 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహా అయితే రెండుమూడేళ్లు నటిస్తానేమో!

కథానాయికగా సమంత ప్రయాణం తొలి ఆరేళ్లు ఒకెత్తైతే.. ఆ తర్వాత మరో ఎత్తు. తనలోని నటిని వందశాతం తెరపై ఆవిష్కరిస్తోంది. వరుసగా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తున్న సమంత తాజాగా‘జాను’లో నటించింది.  శర్వానంద్‌, సమంత జంటగా నటించిన ఆ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాతోపాటు తన వ్యక్తిగత ప్రయాణాన్ని ఆమె మాటల్లోనే వివరించింది...


హాయ్‌! నేను మీ సమంతని...

ఇప్పటికి నా పేరు ఇదే కానీ... ఈ నెల 7 తర్వాత మాత్రం కొన్నాళ్లపాటు జానుగానే గుర్తుండిపోతా. ‘జాను’ సినిమాలోని రామ్‌, జాను పాత్రలు మీతో పాటే ఇంటి కొస్తాయి. కొన్నాళ్లపాటు మిమ్మల్ని వెంటాడతాయి. నవతరమేకాదు, పెద్దవాళ్లు కూడా నా పాత్రలో వాళ్లని వాళ్లు చూసుకుంటారు. ఆ భరోసా నాదీ. నటుల్ని తీర్చిదిద్దేది వాళ్లకి ఎదురయ్యే సవాళ్లే అని నా నమ్మకం. అందుకే ప్రతిసారీ ఓ కొత్త సవాల్‌ని భుజాన వేసుకుంటున్నా. అందులో భాగమే ఈ... ‘జాను’. నా  సినీ ప్రయాణానికి పదేళ్లు. మహా అంటే ఒకట్రెండేళ్లు నటిస్తానేమో. దాని తర్వాత కూడా నా గురించి మాట్లాడుకోవాలి కదా. అలా జరగాలంటే ‘జాను’లాంటి పాత్రలు చేయాల్సిందే. ఒకట్రెండేళ్లు అన్నానని ఆ తర్వాత సినిమాల నుంచి విరమిస్తుందా అనుకోవద్దండోయ్‌. సినిమాతో నా ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతుంది. కాకపోతే నాకు పెళ్లయింది, కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా అందుకే అలా చెబుతున్నా.
అందరికీ తెలిసిన విషయమే. కథానాయికల సినీ ప్రయాణం చాలా తక్కువ. వాళ్లు తెరకు దూరమయ్యారంటే అందరూ మరిచిపోతారు, మరొకరు వస్తారు. కొద్దిమంది నటులు, వాళ్ల పేర్లు మాత్రం అలా నిలబడిపోతాయి. వీలైనన్ని రోజులు అలా నా పేరూ వినిపించాలనేదే నా ప్రయత్నం.


చాలా ప్రత్యేకం

ఒకొక్క సినిమా ఒక్కో అనుభవాన్నిస్తుంటుంది. ‘జాను’ నా సినీ ప్రయాణంలో చాలా ప్రత్యేకం. రెండు పాత్రలే ప్రధానంగా తెరపై కనిపిస్తుంటాయి. గొప్ప గొప్ప లొకేషన్లు కూడా ఉండవు. ప్రతి సన్నివేశాన్ని పండించాల్సిన బాధ్యత రెండు పాత్రలపైనే కాబట్టి చాలా ఒత్తిడిగా ఉండేది. శర్వా, నేను ఇద్దరం సమన్వయంతో నటిస్తూ పాత్రల్లో గాఢత కనిపించేలా ప్రయత్నించాం. శర్వా కాకుండా, మరొకరు ఎవరున్నా ఆ పాత్రలు అంత బాగా పండేవి కాదేమో అనిపించింది. మాతృకని తీసిన దర్శకుడే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన్ని సెట్‌లో వందల ప్రశ్నలు అడిగి మరీ నటించేదాన్ని.


పేరు కోసమే నా తపన..

కెరీర్‌ ఆరంభం నుంచి పేరు కోసమే పనిచేశా. డబ్బు కోసం ఎప్పుడూ సినిమా చేయలేదు. ఈ సినిమా చేస్తే ఎంత పేరొస్తుందని మాత్రమే ఆలోచించి సంతకం చేశా. డబ్బు దానంతట అదే వచ్చింది. తమిళంలో విజయవంతమైన ‘96’కి రీమేక్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక ప్రేక్షకురాలిగా ఆ సినిమాని చూసినప్పుడు ఎంత ముచ్చటపడ్డానో. అందరూ అది విజయ్‌ సేతుపతి సినిమా అన్నారు కానీ, నాకు మాత్రం త్రిష సినిమా అనిపించింది. అప్పుడే ఈ సినిమా క్లాసిక్‌, దీన్ని ఎవ్వరూ రీమేక్‌ చేయకూడదని కూడా చెప్పా. చైతూ, నేనూ కూడా అదే మాట్లాడుకున్నాం. కానీ ఈ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం నాకే వస్తుందని అనుకోలేదు. మొదట చేయకూడదని దిల్‌రాజుని కలవలేదు. ముందే చెప్పాను కదా... సవాళ్లే నటుల్ని తీర్చిదిద్దేది అని. దిల్‌రాజు రెండోసారి  సంప్రదించాక ఈ సవాల్‌ని స్వీకరించాలని అనుకున్నా. ఈ సినిమా చేయకపోయుంటే, నేను జానుని కాకపోయుంటే మంచి అనుభూతిని, అనుభవాన్ని కోల్పోయే దాన్నని ఇప్పుడనిపిస్తోంది.


ఎన్నెన్నో జ్ఞాపకాలు..

కొన్ని సినిమాలు మనల్ని మనకు మరోసారి గుర్తు చేస్తాయి. గడిచిపోయిన మన జీవితాల్లోకి మరోసారి తీసుకెళ్లి కూర్చోబెడతాయి. నాటి అనుభూతుల్ని, అనుభవాల్ని మరోసారి ఆస్వాదించమని చెబుతాయి. ‘జాను’ కూడా అలాంటి సినిమానే. నాకూ చాలా జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. వాటిలో    ఎక్కువగా గుర్తుకొచ్చింది నా కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన. చదువు విషయంలో మా అమ్మ నాపై  ఒత్తిడేమీ పెట్టేవారు కాదు. నేనే ఒక లక్ష్యం నిర్దేశించుకున్నానంటే దాన్ని సాధించాల్సిందే అనేంత పట్టుదలతో ఉండేదాన్ని. కామర్స్‌లో వందశాతం మార్కులొస్తాయని అనుకున్నా. కానీ ఒక్క మార్క్‌ తగ్గేసరికి కిందపడి ఏడ్చేశాను. మా అమ్మేమో ‘ఈ అమ్మాయి ఫెయిలైందేమో’ అనుకున్నారట. అసలు విషయం తెలిసి అవాక్కైపోయారు. సినిమాల్లోకి వచ్చాక కూడా నా తీరు మారలేదు. సినిమా ఫలితం గురించి చాలా ఉత్కంఠకి గురవుతుంటా. బాగుందనే మాట వినిపిస్తే  తప్ప మనసు శాంతించదన్నమాట.


అదృష్టవంతురాల్ని..

ఇంతగా చెబుతున్నానని సమంతలో చాలా ప్రతిభ ఉందని అనుకోవద్దు. అదృష్టం కూడా కలిసొస్తుంటుంది నాకు. ‘రంగస్థలం’ విషయంలో అదే జరిగింది. నిజం చెప్పాలంటే ఆ సినిమా కథ కూడా నాకు పూర్తిగా తెలియదు. రామలక్ష్మి పాత్ర గురించే తెలుసుకుని నటించా. కష్టానికి తోడుగా అదృష్టం కూడా తోడైంది. సినిమా పరిశ్రమలో అంతే. ఒక మంచి పాత్ర చేశామంటే... అది పెట్టుబడితో సమానం అన్నమాట. కచ్చితంగా ఎప్పుడో ఒకసారి తిరిగి ప్రతిఫలం ఇస్తుంది. ‘ఈగ’ సినిమా నాకొక పెట్టుబడిలాంటిది. అందుకే నాకు ‘రంగస్థలం’లాంటి సినిమాలొచ్చాయేమో అనిపిస్తుంటుంది.


చివరిగా ఒకమాట చెబుతా..

ఈ ఏడాది నాలోని మరిన్ని కొత్త కోణాల్ని చూడబోతున్నారు. ఇప్పటిదాకా నేను ఆడిపాడటమే తప్ప హీరోల్లాగా ఫైట్లు చేసింది లేదు. అలాగే నన్ను తెరపై ఎప్పుడూ మంచి అమ్మాయిగానే చూశారు కానీ, నాలో విలన్‌ని చూడలేదు. ‘ఫ్యామిలీ మేన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో ఆ  అవకాశం వచ్చింది. ఇందులో ఫైట్లు చేయడమే కాదు, విలన్‌గా కనిపిస్తా. ఫైట్లు చేస్తుంటే మన హీరోలే గుర్తుకొచ్చారు. ఫైట్ల కోసం వాళ్లు ఇంతగా కష్టపడుతున్నారా అనిపించింది. నేను ఒక్క ఫైట్‌లో కూడా డూప్‌ సహాయం తీసుకోకుండా నటించా. త్వరలోనే విడుదల కానున్న ఆ  సిరీస్‌నీ చూసి ఆస్వాదించాలి మరీ...

 

ఇట్లు మీ

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని